అది నా తీర్పు కాదు..

– దానిని హోంమంత్రి చదివితే బాగుంటుంది
– అమిత్‌షా వ్యాఖ్య‌ల‌కు ఉప‌రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి సుద‌ర్శ‌న్‌రెడ్డి స్పంద‌న‌

న్యూదిల్లీ,ఆగస్ట్23: ‌సల్వా జుడుం తీర్పుపై కేంద్రహోంమంత్రి అమిత్‌ ‌షా చేసిన వ్యాఖ్యలపై ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి స్పందిస్తూ అది తాను ఇచ్చినది కాదని, సుప్రీం కోర్టు తీర్పు అని స్పష్టం చేశారు.కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశాను. కానీ, అది నా తీర్పు కాదు.. సుప్రీం కోర్టు ఇచ్చినది. 40 పేజీల ఆ తీర్పును అమిత్‌ ‌షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు. ఇదే నేను చెప్పదలచుకున్నా. ఇంతటితో ఈ చర్చను ఆపేద్దాం అని జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యంలో లోటు కనిపిస్తోందని, రాజ్యాంగం కూడా సవాళ్లు ఎదుర్కొంటోందని ఇండియా కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.  ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని చెప్పిన జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి కులగణన అవసరమని ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయ పడ్డారు. తెలంగాణలో కులగణనకు సంబంధించి ఆయన చొరవ తీసుకున్నారు.  కుల గణనపై మాట్లాడుతూ.. సామాజిక ఆర్థిక విధానాల రూపకల్పన కోసం దీనిని చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా విపక్షాలు ఏకగ్రీవంగా ఎంపికచేయడం గౌరవంగా భావిస్తున్నా. ఇది 64శాతం ప్రజల ప్రాతినిధ్యాన్ని సూచిస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఇద్దరి అభ్యర్థుల మధ్య పోటీ కాదు, రెండు భావజాలాల మధ్య పోటీ. ప్రజాస్వామ్యం అంటే పరస్పర చర్చ మాత్రమే. వ్యక్తులు, వారి ఆలోచనల మధ్య సంఘర్షణ కాదు. జాతీయ అంశాలపై గతంలో అధికార, విపక్ష పార్టీలు సమన్వయం చేసుకునేవి. దురదృష్టవశాత్తు ఇప్పుడది కనిపించడం లేదు. పార్లమెంటు కార్యకలాపాలకు సభ్యులు అప్పుడప్పుడు ‘అంతరాయం’ కలిగించడం కూడా ఒక విధమైన నిరసన మాత్రమే. అయితే, ప్రజాస్వామ్య పక్రియలో అది అంతర్భాగంగా మారకూడదు. ఒకప్పుడు లోటు ఆర్థిక వ్యవస్థ గురించి చర్చ జరిగేది. కానీ, ఇప్పుడు మాత్రం ప్రజాస్వామ్యంలో లోటు గురించి మాట్లాడుకుంటున్నాం. భారత్‌ ‌ప్రజాస్వామ్య దేశం కాదని అనడం లేదు. ఇప్పటికీ మనది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యమే. అయితే, ప్రస్తుతం అది ఒత్తిడికి గురవుతోందని భావిస్తున్నా అని జస్టిస్‌ ‌బి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *