అం‌దరం ఒకటయ్యాం …

కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావు
తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వొదిలించడానికే..
కేసీఆర్‌పై తిరుగుబాటు మొదలైంది
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి
నాయకులతో కలిసి పొంగులేటి, జూపల్లిలను పార్టీలోకి ఆహ్వానించిన పిసిసి చీఫ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరికలు సామాన్యమైనవి కావన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలు అని పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ‌పై తిరుగుబాటు మొదలైందన్నారు. అందుకే ఇతర పార్టీల్లోని నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని చెప్పారు. చేరికలన్నీ కేసీఆర్‌ ‌వ్యతిరేక రాజకీయ పునరేకీకరణలో భాగమే అని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశలను సీఎం కేసీఆర్‌ ‌కాలరాశారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో జూపల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి, ఆయన మిత్ర బృందాన్ని కాంగ్రెస్‌ ‌పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత రేవంత్‌ ‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ఆకాంక్షలను సీఎం కేసీఆర్‌ ‌కాలరాశారని, రాష్ట్రం వొచ్చి ఇన్నేళ్లయినా కల్వకుంట్ల కుటుంబానికి తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. పొంగులేటితో పాటు ఇతర నేతల చేరిక, కలయిక తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తును ఇస్తుందన్నారు. ‘‘తెలంగాణ ఏర్పాటుకు ప్రొ.జయశంకర్‌ ‌పరితపించారు.
image.png
తెలంగాణ జాతిపితగా జయశంకర్‌ను 4 కోట్ల మంది గౌరవించుకున్నారు. తొలిదశ, మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించారు. తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతకర్తగా పేరుగాంచారు. కానీ, ఆయన ఆశించిన ఫలితాలు రాలేదు. కేసీఆర్‌ ‌కుటుంబం కోసం తెలంగాణ వనరులను కబ్జా చేశారు. కేసీఆర్‌ ‌కుటుంబానికి తప్ప ఇతరులకు ప్రయోజనం చేకూరలేదు. రాజకీయ ప్రయోగశాలలో తెలంగాణను వేదికగా మార్చారు’’ అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పొంగులేటి, జూపల్లిని కలిశామని..అలాగే పార్టీలోకి ఇద్దరినీ ఆహ్వానించినట్టు రేవంత్‌  ‌తెలిపారు. రాజకీయ పునరేకీకరణ కోసం ఇప్పుడు పునాదులు వేసామని, పార్టీలో చేరికపై పొంగులేటి, జూపల్లి నుంచి సానుకూల స్పందన వొచ్చిందన్నారు. ‘‘తెలంగాణలో రాజకీయ పరిణామాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తాం. త్వరలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌ ‌గాంధీతో సమావేశమవుతాం. ఖమ్మంలో కనీవిని ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఖమ్మం సభ ద్వారానే కేసీఆర్‌ను పాతాళంలోకి తొక్కుతామని రేవంత్‌  అన్నారు. ఇవి ఆషామాషీ చేరికలు కాదు ఇందులో గొప్ప ఉద్దేశం ఉందని రేవంత్‌ ఈ ‌సందర్బంగా తెలిపారు. ఈ చేరికలు తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకేనని, వీళ్లే కాదు..ఇంకా చాలా మంది కాంగ్రెస్‌లోకి వొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మంచి ముహూర్తంలో వీరంతా కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు గెలిపించి కేంద్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీని క్రియాశీలకం చేయాల్సిన అవసరం ఉంది. రాహుల్‌ ‌గాంధీని ప్రధాని సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నిస్తామని రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని ఈ సందర్బంగా రేవంత్‌ ‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆనాడు తెలంగాణతో కేసీఆర్‌కు పేగు బంధం లేదు..ఈనాడు తెలంగాణతో కేసీఆర్‌కు పేరు బంధం లేదు అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌తో రాష్ట్రాన్ని కేసీఆర్‌ ‌దోచుకున్నారు.
image.png
తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించడానికే ఈ చేరికలని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం జూపల్లి, గుర్నాథ్‌ ‌రెడ్డి, దామోదర్‌ ‌రెడ్డి గతంలో బీఆరెస్‌లో చేరారని, తొమ్మిదేళ్లు గడిచినా కేసీఆర్‌ ‌పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయలేదని, అందుకే వారంతా కేసీఆర్‌పై తిరుగుబావుటా ఎగరేశారన్నారు. పాలమూరు జిల్లా అభివృద్ధి కాంగ్రెస్‌ ‌తోనే సాధ్యమని, అందుకే వారిని కాంగ్రెస్‌ ‌లోకి ఆహ్వానించడానికి వొచ్చామని రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఖమ్మం జిల్లా నుంచి సీఎల్పీ నేత, మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లా నుంచి పీసీసీ అధ్యక్షుడు ఉన్నారు. మధ్య నల్లగొండ జిల్లా వారధిగా ఉంది. ఈ విధంగా మొత్తం కృష్ణాపరివాహక ప్రాంతం కాంగ్రెస్‌ ‌పార్టీ అండగా ఉంది’’ అని రేవంత్‌ ‌రెడ్డి వ్యాఖ్యానించారు. హరగోపాల్‌, ‌విమలక్క, ఉద్యమకారులపై ఉపా కేసులు పెడుతున్న పరిస్థితి రాష్ట్రంలో దాపురించిదన్నారు. విమలక్క తన పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిందన్నారు రేవంత్‌ ‌రెడ్డి. విమలక్క మీద పెట్టిన ఉపా కేసును కూడా ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని రేవంత్‌ ‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *