సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్ 2: సిద్దిపేటలోని చర్విత మెడోస్ లో నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కల్పతరువుగా మారనుందని దత్తక్షేత్రం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కుప్పా శ్రీపాద శర్మ అన్నారు. నంగునూరు మండలం క్షేత్ర రాంపూర్ లోని శ్రీపాద శ్రీవల్లభ దత్తక్షేత్రం నుండి స్పటిక లింగం, దత్తాత్రేయ స్వామి విగ్రహాలు దత్త పాదుకలను అంగరంగ వైభవంగా సిద్దిపేటకు తరలించారు. ఈ సందర్భంగా దత్తక్షేత్రం వ్యవస్థాపకులు కుప్పా శ్రీపాద శర్మ దంపతులు, చర్విత మెడోస్ సిఎండి జీడిపల్లి హరికృష్ణ దంపతులు దత్యక్షేత్రంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాలను పూలరథంపై ఊరేగింపుగా భక్తులు భజనలతో, మహిళలు మంగళ హారతులతో దత్తక్షేత్రం నుంచి సిద్దిపేట మండలం బూరుగుపల్లి గ్రామంలోని చర్విత మెడోస్ నిర్మించిన శ్రీపాద కార్యసిద్దేశ్వర స్వామి దేవస్థానానికి తరలించారు.ఈ సందర్భంగా భక్తులనుదేశించి దత్తక్షేత్రం వ్యవస్థాపకులు కుప్పా శ్రీపాద శర్మ మాట్లాడుతూ… శ్రీపాద కార్య సిద్దేశ్వర స్వామి దేవాలయం ప్రజల మానసిక, శారీరక రుగ్మతలను దూరం చేయడమే కాకుండా భక్తుల కోరికలను నెరవేర్చే కల్పతరువుగా మారుతుందన్నారు. చర్విత మెడోస్ సీఎం డి జీడిపల్లి హరికృష్ణ ప్రపంచంలోనే తొలిసారిగా రోబోటిక్ త్రీడీ టెక్నాలజీతో దేవాలయాన్ని నిర్మించారని అన్నారు. ఈ ఆలయంలో సింహ వాహనముతో కూడిన పంచముఖ హేరంభ గణపతి, స్పటిక లింగ సహిత దత్తాత్రేయ స్వామి, భువనేశ్వరి అమ్మవారి విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు తెలిపారు. చర్విత మెడోస్ సిఎండి జీడిపల్లి హరికృష్ణ మాట్లాడుతూ రోబోటిక్ త్రీడీ టెక్నాలజీ తో దేవాలయాన్ని నిర్మించామని ఇందులో ప్రధాన ఆలయం చతురస్రాకారంలో ఉండగా ఇరువైపులా మోదక ఆకారంలో హేరంభగణపతి, తామర మొగ్గ భువనేశ్వరి అమ్మవారి ఆలయాలను నిర్మించామన్నారు. పూరిలోని జగన్నాథ స్వామి ఆలయ ఆకారంలో గోపురాలను నిర్మించామని తెలిపారు. ఆలయ నిర్మాణ పనులు మరో 15 రోజుల్లో పూర్తవుతాయని చెప్పారు.
అంగరంగ వైభవంగా విగ్రహాల తరలింపు





