ఎవరికి వారే !యమునా తీరే?

ఇక జర్నలిస్ట్ సంఘాలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.గతంలో మాదిరిగా, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొనే విధంగా ఆయా సంఘాలు లేవు.ఎందుకంటే ఎవరి ముఠా వారిదే! అంతేకాదు చాలా చిత్రమైన విషయం ఏమంటే ఈ జర్నలిస్టు సంఘాలు వృత్తి సంఘాలులా కనిపించవు.. కార్మిక సంఘాలు గా అనిపించవు..అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమంటే..ఒక్క ప్రెస్ క్లబ్బులు తప్ప,జిల్లాలో నైనా, రాష్ట్రంలోనైనా,40 ఏళ్ళ క్రితం ఆయా యూనియన్ లకు నాయకత్వం వహించిన వారే ఇప్పటికీ నాయకులు గా ఉన్నారు.వాళ్ళే అధ్యక్ష కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు అటూఇటూ మారుతుంటారు. అంటే పదవులు మారతాయి కానీ , వ్యక్తులు మారడం పెద్దగా కనిపించదు.ఇక్కడ ఫక్తు పెత్తందారీ విధానం కొనసాగుతుంది.  

మాయా’ దర్పణం -5

ఎన్.తిర్మల్
(సీనియర్ జర్నలిస్టు, రచయిత, సామాజిక కార్యకర్త)

నేటి జర్నలిస్టుల పరిస్థితి ఇలాగే ఉంది.గతంలో రాష్ట్రంలో ఏ మూలన జర్నలిస్టుల మీద దాడి జరిగినా రాష్ట్ర మంతా జర్నలిస్టులు నిరసన, ఆందోళన వ్యక్తం చేసేవారు.ఇప్పుడు దాడులు నిత్యకృత్యం అయినా ఎవరికి వారే!యమునా తీరే? అన్నా విధంగా తయారైంది.పత్రికలు, మీడియా రాజకీయ పక్షాల కొమ్ము కాయడం వలన రాజకీయ పక్షాలు వైరుధ్యాలు మాదిరిగా యాజమాన్యం శతృ శిబిరాలుగా చీలిపోయింది.యాజమాన్యం తోకలు గా జర్నలిస్టులు పనిచేయక తప్పని స్థితి! ఇట్లాంటి వైరి శిబిరాలుగా ఒకే వృత్తి దారులు మారడం వలన ఒకరి పై దాడులు మరొకరు ఖండించే స్థితి లేదు.రాజకీయ దాడులైతే ఆయా యాజమాన్యాలు ఖండిస్తాయి.వ్యక్తిగత దాడి జరిగితే యాజమాన్యం కూడా పట్టించుకునే పరిస్థితి లేదు.

వృత్తిలో ఉన్న సమయం లో శతృవులు గా మారి వృత్తి మానివేసిన తర్వాత ఆ కక్ష్యలతో దాడులకు, దౌర్జన్యాలు కు గురైన జర్నలిస్టులు ఎందరో? ఇట్లాంటి వారు బయటకు చెప్పుకునే స్థితి లేదు.ఏదైనా రాజకీయ పక్షం దాడి చేస్తే జర్నలిస్టు లందరూ ఆ పక్షాన్ని,నాయకుడిని బహిష్కరించే వారు.ఇప్పుడు ఆ అవకాశం లేదు.రాజకీయపక్షాలే పత్రికలను, మీడియా ను బహిష్కరణ చేస్తున్న విచిత్రమైన స్థితిని చూస్తున్నాం.జర్నలిజంలో వైరి వర్గాల,పరిధి అతిక్రమణల మూలంగా ఇప్పుడు కేసులు,బెయిళ్ళు,జైళ్ళు సర్వ సాధారణంగా మారిపోయాయి.వారు అధికారంలో ఉంటే వీరు.వీరు అధికారంలో ఉంటే వారు ఇచ్చుకుంటే వాయనం,పుచ్చుకుంటే వాయనం అన్న విధంగా తెలుగు జర్నలిజం పరిస్థితి ప్రస్తుతం తారుమారైంది.        
ఇక జర్నలిస్ట్ సంఘాలు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.గతంలో మాదిరిగా, దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొనే విధంగా ఆయా సంఘాలు లేవు.ఎందుకంటే ఎవరి ముఠా వారిదే! అంతేకాదు చాలా చిత్రమైన విషయం ఏమంటే ఈ జర్నలిస్టు సంఘాలు వృత్తి సంఘాలులా కనిపించవు.. కార్మిక సంఘాలు గా అనిపించవు..అన్నింటికంటే చిత్రమైన విషయం ఏమంటే..ఒక్క ప్రెస్ క్లబ్బులు తప్ప,జిల్లాలో నైనా, రాష్ట్రంలోనైనా,40 ఏళ్ళ క్రితం ఆయా యూనియన్ లకు నాయకత్వం వహించిన వారే ఇప్పటికీ నాయకులు గా ఉన్నారు.వాళ్ళే అధ్యక్ష కార్యదర్శులు,కార్యవర్గ సభ్యులు అటూఇటూ మారుతుంటారు .అంటే పదవులు మారతాయి కాని, వ్యక్తులు మారడం పెద్దగా కనిపించదు.ఇక్కడ ఫక్తు పెత్తందారీ విధానం కొనసాగుతుంది తల నెరసి జర్నలిజం తాతలా మారింది. ఇక వీరు ఏడాదికో,రెండేళ్ళకో ఓ సభ జరిపి,ఓ మంత్రినో,మాకునో పిలిచి అక్రిడేషన్లు,హెల్త్ కార్డులు,ఇళ్ళస్తలాలని గగ్గోలు పెడుతుంటారు.
అధికార పక్షాలు కూడా అర్థం చేసుకున్నట్లు నటిస్తుంటారు. ఒక ముఠా అదికారంలో ఉంటే మరో ముఠాపై వివక్ష సర్వసాధారణం.ఇక్కడ పాపం చిన్నాచితకా జర్నలిస్టులు ఇంటి స్థలం ఆశతోనో, గుర్తింపు కోసమో ఆశపడి సంఘాల్లో చేరుకుంటారు. కానీ,అధికారం చుట్టు చక్కెర్లుకొట్టే జర్నలిస్టులు మాత్రమే తన పేరుతో ఒకటికి,రెండు సార్లు ఇండ్లు స్థలాలు పొందుతుంటారు. మరికాస్తా పలుకుబడి ఉంటే భార్య పేరుతో,పిల్ల పేరుతో,కుక్కపేరుతో,అక్క పేరుతో ఇక పంట పండుతుంది.ఇందులో కూడా నిండినోడిదే నిండుతుంది.ఎండినోడిదే ఎండుతుంది! ఇదో విచిత్రమైన సమస్య.
ఇక జర్నలిస్టు సంఘాల ప్రాధాన్యత ఎక్కడ పోయింది అంటే,ఆయా సంఘాల నేతలే రాజకీయ పక్షాల పంచన చేరడంతో వ్యక్తుల ప్రాధాన్యత పెరిగి, సంఘాల పరపతి తగ్గిపోయింది.ఇప్పుడు కేవలం జర్నలిస్టు సంఘాలు పేపర్ సంఘాలు గా తప్ప దాడులు, దౌర్జన్యాలు ఎదుర్కొనే స్థితిలో గానీ,పాలక పక్షాలను నిలదీసే వృత్తి నిబద్ధత  కోసం నిలబడే వారుగా లేరు. కానీ చాలామంది పైరవీకారులు గా మారిపోయారు. రాజకీయ, పెట్టుబడుల పొల్యూషన్ లో జర్నలిజం శలభం అయ్యింది..! ఏకపక్ష జర్నలిజం ప్రభావం అటు సంఘాలు,ఇటు జర్నలిస్టులను మసక  బార్చింది.ప్రెస్ అకాడమీ, పదవులు ఆయా వర్గాల పైరవీకారులకే దక్కుతాయి తప్ప వృత్తి నిబద్ధత ఇక్కడ ప్రమాణం కాదు.
ఇక తెలంగాణా విషయానికి వస్తే అధికారికంగా 52 ప్రింట్ మీడియా,210 మీడియా ఛానెల్స్ ఉన్నాయి.ఇక యూ ట్యూబ్ ఛానెల్ లైతే లెక్కేలేదు.తెలుగులో ఎన్ని బూతులు ఉంటే అన్ని ఛానళ్ళు తయారయ్యాయి.అయితే అధికారికంగా 38 ఉన్నట్లు ఏఐ సూచిస్తుంది.ప్రభుత్వం 2016 నాటికి 96మంది రాష్ట్ర స్థాయి జర్నలిస్టులుగా ప్రభుత్వం గుర్తిస్తే, 2026 నాటికి ఆ సంఖ్య 700 దాటింది.ఇక దినపత్రికలు మండలాలను కలిపి లెక్కిస్తే 6,340మంది ప్రింట్ మీడియా లో,మరో ఆరువేల మంది ఎలక్ట్రానిక్ మీడియా లో సుమారు గా జర్నలిస్టులుగా పనిచేస్తున్నారు.వీరికి తోడు ఫ్రీలాన్స్ జర్నలిస్టులుగా మరో వందమంది తెలంగాణాలో ఋఉన్నారు.కేవలం సుమారు 16వేలమంది జర్నలిస్టులను గుర్తించడానికి ప్రభుత్వాలు నానాయాగీలు చేస్తున్నాయి.
ప్రస్థుతం జర్నలిస్టులు, జర్నలిస్టులు కానట్లు పాలక పక్షాలు అత్యంత చులకనగా మాట్లాడడం,వ్యవహరించడం వెనుక ఆయా మీడియా,పత్రికా యాజమాన్యాల అక్రమ సంబంధాలు మాత్రమే కారణం.యాజమాన్యాలను అదుపులో ఉంచుకుంటే చాలు అన్న పాలక పక్షాల వైఖరే జర్నలిస్టులను తాళింపులో కర్వేపాకులా తగ్గించి చూడడానికి కారణం.జర్నలిజం న్యూట్రాలిటీ అనబడే లైన్ దాటినప్పుడే  జర్నలిజం విలువలు కూడా విలోమానుపాతంలో దిగజారుతూ వచ్చింది. ఇప్పుడు తూ… అన్నా,చా …అన్నా మరో నడక లేదు! కూటికి గుడ్డకు రాని వృత్తి ఇధి!! అయినా తప్పదు విధి! ఇదే నేటి జర్నలిస్టు ఓంటరికథ!?.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *