అగ్ని పురుగుల జుగల్‌ ‌బందీ

పదం దేహం
పద రంగ ప్రదర్శనం రంగనాథ దర్శనం

దిగి పోతున్నాను ధరిత్రి నుండి
జనాబ్‌ అబ్దుల్‌ ‌సమద్‌ఖాన్‌ ‌జుగ్ను హోటల్‌ ఇద్దరూ దిగిపోయినాక
వుపసంహరించుకుంటున్నాను పదాన్నీ ప్రదర్శననీ

కాలమొక లైలాండ్‌ ‌లారీ
ఈ సెకండు ఎవడి వంతో నాకు తెలుసు పోతులూరికి తెలుసు

ఓషో, అమాయకుడు ఏమీ నేర్చుకోనక్కర్లేదన్నాడు
అప్రమత్తంగా అభద్రంగా ప్రమాదకరంగా బ్రతకడం ఏదీ నేర్చుకోనక్కర్లేదన్నాడు
నన్ను నమ్మితే నేనే నీ కాపరినన్నాడు క్రీస్తు
కృష్ణుడు, పాపం చేయనివాడికి కష్టాలే వుండవన్నాడు
లా యిలాహ ఇల్లల్లాహ్‌ ‌మహమ్మదుర్‌ ‌రసూల్‌ ఉల్లాహ్‌ అన్నావు నువ్వు

వాహ్వా వారెవ్వా ఖడక్‌ ఇరానీ ఛాయ్‌
‌మాష అల్లా ఉస్మాన్యా బిస్కెట్లు
అస్సోయ్‌ ‌దూలా ఆలు సమోసాలు
ఝూంఝఝ నకనక తీన్‌మార్‌ ‌బిర్యాని

అమాయకుడు నిష్పాపి అహింసాకారుడు సత్య ప్రతుడు అల్లా భక్తుడు
ముత్తల్లి మూడొందల గజాలను ముప్పై కోట్లకూ అమ్మనన్నవాడు పిజ్జా బర్గర్లపై ఉమ్మేసిన వాడు
తండ్రి భాషే మాట్లాడేవాడు సెల్‌ ‌ధరించనివాడు జీన్‌ ‌ప్యాంట్‌ ‌టీ షర్ట్‌లను తగుల బెట్టిన వాడు
సర్వాహారి ఖద్దరుదారి యోగాభ్యాసి సమద్‌ ‌కాకా మన కాలపు మోస్ట్ ‌పోస్ట్ ‌మోడ్రన్‌ ‌విప్లవకారుడు

అడ్డా కూలీలకు ఆటో డ్రైవర్లకు అలసిన ఇయస్సై నర్సమ్మలకు
పాపం మొదటి స్ట్రోక్‌కే నిర్వీర్యులైన నాగేశ్వర్రావులకు
జాము రాతిరి సూసైడ్‌ ‌ప్రేయసి నగ్నంగా వెంటబడి తరుముతున్న నాలాంటి ఒంటరి ఒంటెలకు
ప్రాణదానం, శక్తిదానం, వీర్యదానం చేస్తున్నవాడు
అరవై ఏళ్ల నుండి క్రితం ముందు వరకు గల్లా ముందు కూర్చొని గణేష్‌ ‌బీడి తాగుతూ…

ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజి ఊన్‌

-శ్రీనివాస్ దెంచనాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *