ఎండ, తుపాకీ లేకుండా పేల్చేస్తోంది. వాడు అడుపు వీడు తుడుపు అని కాకుండా అందరికీ సమంగా వడ్డించేస్తోంది.
ఆ దారిన వొకే వొక పెద్ద చెట్టుంది. చెమటలు కక్కుతూ తనదగ్గరకు వచ్చినవాళ్ళకు గొడుగై నీడనిస్తోంది. అయితే ఆ గొడుగు కింద నీడ అందరికీ చాలడం లేదు.
నీడలో వున్నవాళ్ళు యెండనపడి వచ్చినవాళ్ళకి ‘నువ్వు కాసేపు నీడకురా, నేను కాసేపు యెండన వుంటాను’ అని అనడం లేదు. నీడను సమంగా పంచుకోవడం లేదు. నీడ దక్కినవాళ్ళు కొంచెం కూడా కదలడం లేదు. అది తనదే అన్నట్టు కాళ్ళు నేలలోకి పాతుకున్నట్టు స్థిరంగా వుంటున్నారు.
అంచేత కొందరికి యెండ. కొందరికి నీడ. అన్నీ అందరివీ అన్నట్టు, నువ్వు యెండన వున్నావా? లేకపోతే నీడన వున్నావా అని చూసి కాకుండా వీచిన గాలి కూడా సమంగానే తాకింది. అందరూ సమంగా పంచుకోండి అన్నట్టు.
నీడ నాది, నిలబడే చోటు నాది అన్నట్టున్నవాళ్ళని చూస్తూ నీడ తానే కదిలింది, కదలినట్టు తెలీకుండా. అంతకన్నా ముందు సూరీడు కదిలాడు, వీళ్ళు కదలరు నేనే కదలాలి అన్నట్టు. అంతే చెట్టు చుట్టూ నీడ మెల్లగా తిరిగింది.
ఇటు యెండలో వున్నవాళ్ళు నీడలోకి వచ్చారు. అటు నీడలో వున్నవాళ్ళు యెండలోకి వచ్చారు.
ఎండా వుండిపోలేదు.
నీడా వుండిపోలేదు.
చెప్పకేం, చెట్టుకింద ఆ మనుషులూ వుండిపోలేదు.
అయినా మరురోజూ రోజురోజూ గొడుగుకింద కథ వొకేలా నడుస్తోంది!
-బమ్మిడి జగదీశ్వరరావు