వంటింటి గడప నుండి అంతరిక్షం వరకు మహిళ 

చెట్టు ఉన్నప్పుడు నీడ విలువ తెలియదు, కోసిన తర్వాత తెలుస్తుంది మహిళ విలువ కూడా చాలామందికి ఆలస్యంగా తెలుస్తుంది. మహిళ తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం జీవిస్తుంది, పెళ్లి అయిన తర్వాత భర్త కోసం జీవిస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జీవిస్తుంది. చివరకు తన కోసం జీవించడానికి సమయం కూడా ఉండదు. దీపం తన కోసం కాదు, ఇతరుల కోసం వెలుగుతున్నట్లు మహిళ జీవితం ఇతరుల కోసమే…”
B.సుచిత్ర మొగిలి
8466827166

మహిళల హక్కులు, గౌరవం, సమానత్వం మరియు సాధికారత కోసం పోరాటానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవం జరుపుకుంటారు.1908లో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో మహిళా కార్మికులు తమ హక్కుల కోసం ఉద్యమించారు. వారికి సమాన వేతనం, పని సమయం తగ్గింపు, ఓటు హక్కు వంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ ఉద్యమ ఫలితంగా 1910లో క్లారా జెట్‌కిన్ మహిళా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఆనాటి నుండి మార్చి 8న అంతర్జాతీయ మహిళ దినోత్సవం జరుపుకుంటున్నాం. అది ఒక సామాజిక చైతన్య ప్రవాహం. శతాబ్దాల అణచివేతను దాటుకుని, కట్టుబాట్ల సంకెళ్లను తెంచుకుని, తనకంటూ ఒక గుర్తింపును సృష్టించుకున్న ప్రతి మహిళా మూర్తికి వందనం చేసే రోజిది.

    నేడు మహిళ ఆకాశపు అంచులనే కాదు, అంతరిక్ష రహస్యాలను కూడా చేధిస్తోంది. వంటింటి గడప దాటడమే సాహసమని భావించిన రోజుల నుండి, దేశాల సరిహద్దులను కాపాడే సైనికురాలిగా, కార్పొరేట్ సామ్రాజ్యాలను శాసించే అధినేతగా ఎదిగిన ప్రయాణం సామాన్యమైనది కాదు. గత కొన్నేళ్లుగా మహిళా సాధికారత విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. విద్యా, వైద్య రంగాలలోనే కాకుండా సైన్స్, టెక్నాలజీ, క్రీడలు మరియు రాజకీయాలలో కూడా మహిళలు తమదైన ముద్ర వేస్తున్నారు. లింగ సమానత్వం కేవలం ఒక నినాదంగా కాకుండా, ఒక ఆవశ్యకతగా సమాజం గుర్తించడం మొదలుపెట్టింది. మహిళా దినోత్సవం కేవలం ఒక రోజు కాదు, అది మహిళ త్యాగాన్ని గుర్తు చేసుకునే రోజు, ఆమె గొప్పతనాన్ని గుర్తించే రోజు, ఆమె గౌరవాన్ని కాపాడాలని మనకు గుర్తు చేసే రోజు.
    కృతజ్ఞత లేని జీవితం విలువలేని జీవితం అనే సామెతలా మహిళ త్యాగాన్ని గుర్తించని సమాజం అభివృద్ధి చెందదు. మహిళను గౌరవించడం మన కర్తవ్యం, ఆమెను ప్రోత్సహించడం మన బాధ్యత, ఆమెను రక్షించడం మన ధర్మం. భారతీయ సంస్కృతిలో స్త్రీని శక్తి స్వరూపిణిగా పూజిస్తాం. కానీ ఆ పూజ గర్భగుడికే పరిమితం కాకూడదు.పొలంలో చెమట చిందించే కూలీలో, సరిహద్దులో గస్తీ కాసే సైనికురాలిలో, రోబోటిక్స్ పరిశోధన చేసే శాస్త్రవేత్తలో, ఆటో నడిపి కుటుంబాన్ని పోషించే ఇల్లాలులో ప్రతి చోటా ఆమె కృషి ఉంది. దేశ జిడిపిలో మహిళల కనిపించని శ్రమ ఎంతో వెలకట్టలేనిది.కానీ ఈ సమాజం మహిళకు ఇచ్చిన గౌరవం మాటల్లో ఎక్కువ, ఆచరణలో తక్కువ. పెదవులపై గౌరవం, చేతల్లో నిర్లక్ష్యం అనే స్థితి ఇంకా కనిపిస్తుంది. ఒక అమ్మాయి పుట్టినప్పుడు కొందరు ఆనందపడకుండా ఆలోచిస్తారు, కానీ అదే అమ్మాయి ఎదిగి కుటుంబానికి ఆధారం అయినప్పుడు ఆమె విలువ తెలుస్తుంది.
     చెట్టు ఉన్నప్పుడు నీడ విలువ తెలియదు, కోసిన తర్వాత తెలుస్తుంది మహిళ విలువ కూడా చాలామందికి ఆలస్యంగా తెలుస్తుంది. మహిళ తన జీవితాన్ని ఇతరుల కోసం అంకితం చేస్తుంది. చిన్నప్పుడు తల్లిదండ్రుల కోసం జీవిస్తుంది, పెళ్లి అయిన తర్వాత భర్త కోసం జీవిస్తుంది, పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం జీవిస్తుంది. చివరకు తన కోసం జీవించడానికి సమయం కూడా ఉండదు. దీపం తన కోసం కాదు, ఇతరుల కోసం వెలుగుతున్నట్లు మహిళ జీవితం ఇతరుల కోసమే. ఆమె తన కలలను మౌనంగా త్యాగం చేస్తుంది, తన ఆశలను తన హృదయంలో దాచుకుంటుంది. కానీ ఎప్పుడూ ఇతరుల సంతోషంలో తన సంతోషాన్ని చూస్తుంది. ఇదే మహిళ గొప్పతనం.కానీ ప్రతిఫలంగా ఆమె కోరేది కేవలం ప్రేమ, గౌరవం మాత్రమే మహిళను గౌరవించడం అంటే కేవలం మాటల్లో కాదు, మన ప్రవర్తనలో చూపించాలి.మహిళను బలహీనురాలిగా చూడకూడదు, ఆమెను శక్తిగా చూడాలి. ఎందుకంటే ఆమె ఒక జీవాన్ని సృష్టించగలదు, ఒక కుటుంబాన్ని నిర్మించగలదు, ఒక సమాజాన్ని మార్చగలదు.
    ఒక మహిళ తన జీవితంలో ఎన్నో పాత్రలు పోషిస్తుంది. తల్లిగా ప్రేమను ఇస్తుంది, భార్యగా తోడుగా ఉంటుంది, చెల్లిగా అనురాగం ఇస్తుంది, కూతురిగా ఆనందం ఇస్తుంది. ఆడది ఉన్న ఇల్లు ఆనందం ఉన్న ఇల్లు. ఆమె లేకపోతే జీవితం అసంపూర్ణం అంటుంటారు అనుభవజ్ఞులు. ఈ ప్రపంచంలో ప్రతి గొప్ప వ్యక్తి వెనుక ఒక తల్లి ఉంది. ఒక తల్లి తన బిడ్డకు కేవలం జీవం ఇవ్వదు, జీవితం ఎలా గడపాలో నేర్పుతుంది. ఆమె నేర్పిన విలువలు, ఆమె చెప్పిన మాటలు, ఆమె చూపిన మార్గం ఆ బిడ్డను గొప్ప వ్యక్తిగా మారుస్తాయి. విత్తనం చిన్నదైనా చెట్టు పెద్దదవుతుంది తల్లి ఇచ్చిన చిన్న విలువలు జీవితంలో గొప్ప విజయాలకు దారి తీస్తాయి. మహిళ బలహీనురాలు కాదు, ఆమె శక్తి స్వరూపిణి. ఆమె ఒక కుటుంబానికి మూలం, ఒక సమాజానికి ఆధారం, ఒక దేశానికి శక్తి. ఆమెను గౌరవించడం మన సంస్కృతి, ఆమెను కాపాడడం మన బాధ్యత, ఆమెను ప్రోత్సహించడం మన కర్తవ్యం.
     గణాంకాల ప్రకారం మహిళా అక్షరాస్యత పెరుగుతోంది, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం మెరుగుపడుతోంది. కానీ, కేవలం నంబర్ల పెరుగుదల సాధికారత కాదు. నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఆమెకు ఉన్నప్పుడే అది నిజమైన గెలుపు. పెళ్లి, చదువు, కెరీర్ లేదా జీవిత భాగస్వామి ఎంపిక ఏదైనా సరే నిర్ణయం ఆమెదే కావాలి. సమాజం కేవలం సలహాదారుగా ఉండాలే తప్ప, శాసనకర్తగా మారకూడదు. ఇప్పటికి ఒకే పనికి పురుషుడితో సమానంగా మహిళకు వేతనం అందడం లేదు. ఇంటి బయటే కాదు, ఇల్లు కూడా మహిళలకు సురక్షితమైన ప్రదేశం అని పూర్తిస్థాయిలో చెప్పలేని పరిస్థితి ఉంది. నిర్ణయాత్మకమైన పదవులలో మహిళల శాతం పెరగాల్సి ఉంది.మహిళలు ప్రజాప్రతినిధు లుగా ఉన్న వారి జీవిత భాగస్వాములే పదవులు అనుభవిస్తూ, నిర్ణయాలు తీసుకుంటూ అణిచి వేస్తున్నారు. డిజిటల్ యుగంలో కొత్త సవాళ్లు నేటి ఆధునిక యుగంలో మహిళలు సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలను వేధించడం, వారి వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించడం పెరిగిపోతున్నాయి. ఆఫీసులో ప్రొఫెషనల్‌గా రాణిస్తూనే, ఇంట్లో గృహిణిగా తన బాధ్యతలను నెరవేర్చడంలో మహిళలు శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇంటి పనిలో పురుషుల భాగస్వామ్యం పెరగనంత వరకు సమానత్వం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుంది.
    మనం చేయాల్సింది మహిళా దినోత్సవం అంటే కేవలం శుభాకాంక్షలు చెప్పుకోవడం, పూల గుత్తులు ఇవ్వడం మాత్రమే కాదు. మహిళల శ్రమను గుర్తించడం, వారి అభిరుచులకు గౌరవం ఇవ్వడం మరియు వారి ఎదుగుదలకు తోడ్పడే వాతావరణాన్ని కల్పించడం. సమానత్వం అనేది ఇంటి నుండే మొదలవ్వాలి. తన కలలను నిజం చేసుకునే క్రమంలో ఆమెకు అడ్డంకులు కాకుండా, అండగా నిలవడమే అసలైన గౌరవం. స్త్రీ శక్తికి అడ్డుకట్ట వేయకుండా, ఆకాశమంత అవకాశాలను కల్పిద్దాం. మహిళా సాధికారత సాధించిన రోజే నిజమైన వికాసం సాధ్యమవుతుంది. కేవలం చట్టాలు చేస్తే సరిపోదు, సామాజిక దృక్పథం మారాలి. చిన్నప్పటి నుండే అబ్బాయిలకు స్త్రీ గౌరవం పాఠంగా కాకుండా సంస్కారంగా నేర్పాలి. ఆడపిల్లలకు రక్షణ పేరుతో ఆంక్షలు విధించడం కంటే, వారిని ధైర్యవంతులుగ తీర్చిదిద్దడం ముఖ్యం. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ఒక ప్రతిజ్ఞ చేద్దాం. మహిళల ఎదుగుదలకు కేవలం చప్పట్లు కొట్టడమే కాదు, వారు పడిపోతున్నప్పుడు చేయూతనిద్దాం. వారి కలలకు రెక్కలొచ్చేలా సహకరిద్దాం. అప్పుడే ఈ ప్రపంచం మరింత అందంగా సమతుల్యంగా మారుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *