జీవితమంటే ఏమిటో నిశితంగా తెలుసుకొని అనేకానేక పరిణామాల్ని పరిశీలించిన కవిత్వానికే శాశ్వతత్వం ఉంటుంది. ప్రకృతిలోని అనేక కోణాలను జీవన సత్యాలుగా ఎందరో కవులు వివరించారు. ఓటమి మిగిల్చే విషాదానుభూతి వల్ల ఏర్పడే దుఃఖానుభవం మనిషిలో ఎన్నెన్నో పరిణామాలకు కారణమవుతుంది. అడుసు (బురద) తొక్కిన పాదాలు విషాదానుభూతుల్ని జాగ్రత్తగా దాటుతూ నడక నేర్చుకుని ఉత్తేజపు ఉద్దీపకాలై లక్ష్యం వైపు సాగుతాయి. మనిషి అనివార్యంగా అడుసును తొక్కితే అందులోంచి బయటకు నడిచే క్రమంలో శ్రమలోంచి జ్ఞానం, ప్రాధాన్యత, విలువ, విశిష్టత తెలిసి అతని అంతః శక్తి పెంపొందుతుంది. బురద చుట్టూ తేజరిల్లిన పాదాలు ఏ ఉన్నత స్థానానికైనా మనిషి ఎదగడానికి మూల స్తంభాలుగా నిలుస్తాయన్న జీవన సత్యాన్ని అడుసు/ తొక్కిన పాదాలు పేరుతో శతక కవితా సంకలనంగా మలచి కవి మొవ్వ రామకృష్ణ అందించారు.
ఏదో ఒక మార్గాన్ని ఆలోచించి వెతికితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కనుగొనండి అన్న కవితలో చెప్పారు. చివరకు ఎలా మిగలాలో నీవే ఆలోచించుకో అని మనిషిని ఉద్దేశించి ఖరాఖండీగా అన్నారు. నేల నాకుతున్న పిల్లి అంతా తెలిసినా చెవులు నిక్కబడుచుకొని మూసుకుని నటిస్తున్నదని చురకంటించారు. పానమున్నంత కాలం రెక్కల కష్టం సగటు జీవికి తప్పడం లేదని వేదన పడ్డారు. ఆరాటం – అవసరం/ కుళ్ళిపోతే – వాసనే గద/ ఎవ్వరూ భరించలేరు అందుకే ఆ నలుగురు ఉండాలని అన్నారు. నీకు యాభై వసంతాలు వచ్చాయంటే మనస్సును నిలకడగా ఉంచు అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నప్పటికీ ఎంతో ఆనందంగా గడపడమే జీవితమని అన్నారు. వృద్ధాప్యంలో సంరక్షణ ముఖ్యమని తెలిపారు. నవ్యాంధ్ర కళావతిగా అమరావతిని అభివర్ణించారు. మనిషికి తూకం రాళ్ళు తెలివి తేటలే అని చెప్పారు. మనిషి ఎక్కడ ఎందులో పరిపూర్ణుడు కాలేకపోతున్నాడన్నారు. ధరణిలో ధన్యజీవి రైతన్న అని కీర్తించారు. బాలలను పసి మొగ్గలుగా చూడక దివ్యజ్యోతి ప్రమిదలుగా భావించాలని తెలిపారు. ఏదీ శాశ్వతం కానప్పుడు భ్రమను వీడమన్నారు.
మాటలను తూటాలుగా పేల్చగలిగే నాలుక పాపాల్ని చూస్తూ మౌనం వహించడం అన్యాయమన్నారు. అబ్దుల్ కలాంను జాతి వజ్రంగా అభివర్ణించారు. పదునెట్టిన కత్తి పట్టిన మనిషి రాల్చే చెమట బిందువుల్లో మెరుస్తుందని తెలిపారు. పుట్టుకే వర్ణనాతీతమైన అంతులేని గోస అన్నారు. పేదోడి బతుకు అతుకుల బొంతైంది/ ఉన్నోడి బతుకు ఆకాశాన్నంటింది/ సగటు జీవి సంసారాలు/ చిక్కి శల్యమైన జీవచ్ఛవాలు అని చెప్పారు. చీమల దండుకే కాలానుగుణంగా నడుచుకునే తత్వం చెల్లింది అన్నారు. మర మనిషిలా ఎంత కాలం బ్రతకాలి అని వేదన చెందారు. కలిసుండడమే మానవాళికి ఆదర్శప్రాయమైన సందేశమని చెప్పారు. రేపటి తరం కోసం మార్పు అవసరమన్నారు. నీతి, నిజాయితీ నీడలా వెంట ఉంటాయని అన్నారు. ఆకులు రాలితేనే కొత్త చిగుళ్లు వస్తాయని చెప్పారు. బాల్యాన్ని నెమరేసుకుంటే నువ్వు ఒంటరివి కావు తుంటరివి అని తెలు స్తుందని అన్నారు. విశ్వశాంతి కోసం యాగం చేయాలన్నారు. రేపటి ఆశల పల్లకిగా నూతన సంవత్సరాన్ని ప్రస్తావించారు. అడుసు తొక్కుతూ తొలకరిలో తడిసి ముద్దైతే జన్మధన్యమేనని తెలిపారు.
ప్రేగు బంధం గొప్పదని అన్నారు. చైతన్యవంతం చేసే వాళ్ళంతా గొప్పోళ్లే అని చెప్పారు. పరిపూర్ణుడైన వ్యక్తికి వెలుగు కావాలా అని చెప్పారు. కండువాల పండుగలో ఎన్నికల అరాచకీయాల్ని ఎండగట్టారు. మరో పుట్టుక కోసం నవ్వుతూనే ఉండాలి అన్నారు. పశ్చాతాపం తరువాత అంతా మాములే అని చెప్పారు. భరత మాతకు శ్వేత గులాబీలు సమర్పి ంచాలన్నారు. మహా జాతరగా మేడారంను అక్షరీకరించారు. జన్మభూమి రుణాన్ని ప్రతి జీవి తీర్చుకోవాలని చెప్పారు. యదార్థవాది లోక విరోధి అని అన్నారు. పాదాలు ఎంతో గొప్పవని జీవన ప్రయాణంలో ఎంతో ఆలోచించాలని చెప్పారు. చివరికి ఎవరికి వారే వంటరి ప్రయాణం చేయక తప్పదని అన్నారు. రెండు కళ్లున్నా చూసేది ఒకటే లోకమని చెప్పారు. రంగుల హోళీలో పులకించిన హృదయాన్ని ప్రస్తావించారు. హృదయంలో రంగు లద్దడానికి వసంత ఋతువును పిలిచారు. అంతు లేని అగాదాలు చెడును తలపెడతాయని అన్నారు. బిజీ జీవితాలలో ఆరోగ్యాన్ని కాపాడుకొని బతకడమే మహా భాగ్యమని చెప్పారు. నిజం నిలకడ మీద తెలిసి పోతుందని అన్నారు. ఒక విమర్శకుడు పదివేల పాఠ కులకు పెట్టు అంటారు. కాలమే ఎవరికైనా తీర్పును ఇస్తుందని చెప్పారు. వృద్ధాప్యం ప్రకృతి ధర్మమని తెలి పారు. అడుసు తొక్కిన పాదాలు చిరస్మరణీ యమైనవని తెలిపారు.
ఆశల విత్తనాలు వెదజల్లే రేపటి ఆశల పల్లకిలో ఊరేగాలని నాగలి పట్టిన రైతు కోరుకుంటాడని చెప్పారు. ఎన్ని జన్మలకైనా ఒక్క నేస్తమే కావాలనుకొనే అనుబంధాన్ని కోరుకున్నారు. విరబూసిన వేపచెట్టులో వసంత కేళిని గమనించమన్నారు. ప్రకృతి సొగస్సు అనిర్వచనీయమని చెప్పారు. నీలి రంగు తొడిగిన ఆకాశం నివురు కప్పిన నిప్పులా ఉందని చెప్పారు. ఆమె రాకకై మది నిండా వెన్నెలే అన్నారు. ముందు గొయ్యి వెనక నుయ్యి మధ్యలో ఉండే జంతర్ మంతరే సంసారమని వివరించారు. వంటరిగా వొంటెద్దు పోకడ పోతూ చుట్టూరా శూన్యాన్ని పెంచు కున్న చకోర పక్షిని గురించి తెలిపారు. ల్యాప్‌టాప్‌లో అమ్మను తలచి కన్నీరొలికారు. పాద పూజ ఉత్తమ మార్గాన్ని చూపుతుందని అన్నారు. ఎన్ని జన్మలెత్తినా పాదాలు వెంటనే ఉంటాయని గుర్తు చేశారు. శక్తిమ ంతమైన రసస్ఫోరకమైన కవిత్వం ఈ సంకలనంలో ఉంది. సారవంతమైన తత్వం, సంఘ అభ్యున్నతిని కాంక్షిస్తూ వికాస లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ కవి అప్రతిహత ప్రయాణం సాగింది.
– డా. తిరునగరి శ్రీనివాస్
9441464764





