కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చూపుతున్న నిరాదరణ , నిర్లక్ష్య వైఖరిని ఎదుర్కునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం కావలసిన అవసరాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రాలకున్న అధికారాలను ఒక్కొక్కటిగా తమ నియంత్రణలోకి తెచ్చుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్న కేంద్ర విధానాన్ని వ్యతిరేకించేందుకు ముఖ్యంగా దక్షిణాదిలోని బిజెపియేతర రాష్ట్రాలు సమిష్టి పోరాటం చేయాల్సి ఉందని, అందుకు అవరసరమైతే తాను నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా మాట్లాడిన ముఖ్యమంత్రుల్లో రేవంత్‌రెడ్డి మొదటివారేమీకాదు. కాకపోతే నాయకత్వం గురించి ఎవరి మనస్సులో వారికే ఉన్నప్పటికీ, సమిష్టిగా పోరాటం చేయాలన్న లక్ష్యం పైన ఇప్పటికే కొంతమేర చర్చలు జరిగిన మాట వాస్తవం. కేంద్రం తమ రాష్ట్రాలపైన వివక్షత చూపిస్తున్నదంటూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ తోపాటు తెలంగాణ ప్రభుత్వాలు గతంలో అనేక సార్లు ఆరోపించిన విషయం తెలియంది కాదు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ అయితే మోదీ సర్కార్‌పైన ఒకవిధంగా యుద్దాన్నే ప్రకటించింది. ఇక తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అందుకేమీ తీసిపోవు. తెలంగాణ విషయానికొస్తే కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన హామీలేవీ కేంద్రం ఇప్పటివరకు నేరవేర్చలేదన్న ఆరోపణ ఉంది. రాష్ట్రం ఏర్పడి ఇప్పటికి పదకొండు ఏండ్లు దాటినా కేంద్రం వాటి ఊసే ఎత్తడం లేదు. రాష్ట్రంలో పదేళ్ళుగా అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ మొదలు ఏడాదిగా ప్రభుత్వాన్ని ఏలుతున్న కాంగ్రెస్ కూడా ఆదే ఆరోపణ చేస్తున్నది. విభజన హామీలను నెరవేర్చాలంటూ ఈ రెండు ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత శాఖలకు అనేకసార్లు మొరపెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వమైతే రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్ళలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ వొచ్చింది. కేంద్రం తీసుకున్న వివిధ నిర్ణయాలపై ప్రతిపక్షాలు విమర్శిస్తున్నా మద్దతు ప్రకటిస్తూ వొచ్చింది. అయినా ప్రతీఏట ప్రకటించే బడ్జెట్‌లో కేంద్రం తెలంగాణను నిరాశపరుస్తూనే వొచ్చింది. తాజా బడ్జెట్‌లో కూడా కేంద్రానిది అదేతంతు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి అధికారంలోకి వొచ్చిన తర్వాత గతంలో కెసిఆర్ మాదిరిగానే తాను కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించారు. ప్రధాని హోదాలో రాష్ట్రానికి విచ్చేసిన మోదీకి కెసిఆర్‌లా ముఖం చాటేయకుండా వేదికను పంచుకున్నారు. తన ఉపన్యాసంలో మోదీని బడే భాయి అంటూ సంబోధించారు. అయినా మోదీలో పెద్దగా మార్పేమీ లేదు. గతంలో కెసిఆర్ ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా బడ్జెట్‌లో గాడిదగుడ్డునే ఇచ్చారు. సిఎం రేవంత్‌రెడ్డి అదేగుడ్డును నెత్తినపెట్టుకుని సభల్లో ప్రదర్శించడం తెలియంది కాదు. ఈ బడ్జెట్‌లోనైనా లక్షల కోట్ల రూపాయల కేటాయింపు జరుగుతాయని తెలంగాణ ప్రభుత్వం ఆశించింది. ఇప్పటికే అనేకసార్లు కేంద్రం దృష్టిలో ఉన్న ప్రాజెక్టులకు, వివిధ అభివృద్ది పనులకు, కొత్తగా చేపట్టనున్న పథకాలకు కావలసిన నిధులను కేంద్రం సమకూరుస్తుందనుకున్నారు. కాని కేంద్ర ప్రభుత్వం ఈసారి కూడా వాటిల్లో వేటిని పరిగణలోకి తీసుకోలేదు. ఇతర కాంగ్రెస్ రాష్ట్రాలపైన సాధారణగా చూపించే నిర్లక్ష్యమే ఇక్కడ చూపించిందన్న ఆరోపణలను మరోసారి కేంద్రం మూటకట్టుకుంది. ఈ వైఖరే కేంద్రంపైన పోరాటం చేయడానికి రేవంత్‌రెడ్డిని ప్రేరేపించింది.
కేరళరాష్ట్రంలోని తిరువనంతపురంలో మలయాళ దినపత్రిక మాతృభూమి నిర్వహించిన ‘మాతృభూమి ఇంటర్‌నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సదస్సులో ఈనెల 9న ముఖ్యఅతిధిగా రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం దక్షిణాదిరాష్ట్రాలను ఆలోచింపజేసేదిగా ఉంది. గతంలో కూడా కెసిఆర్ ఇలాంటి ప్రసంగాలు చేయడమేకాదు, ఒక అడుగు ముందుకేసి వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీ నాయకులతో చర్చలు కూడా జరిగిన విషయం తెలియంది కాదు. అయితే కాంగ్రెస్, బిజెపిలేని ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసేందుకు తమిళనాడు సిఎం స్టాలిన్, జెడిఎస్ నేత కుమారస్వామి, ఆప్ నేత ఆరవింద కేజ్రీవాల్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, బీహార్ సిఎం నితీష్‌కుమార్‌తోపాటు లాలూప్రసాద్ యాదవ్, శరద్ పవార్ లాంటి పలువురు నేతలతో చర్చలు జరిపారు. కానీ, ఆ ప్రయత్నాలేవీ కార్యరూపం దాల్చలేదు. కొందరు కాంగ్రెస్ మినహాయింపు కూడదన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఏదిఏమైనా ఆ ప్రయత్నానికి పులిస్టాఫ్ పడింది . ఇప్పుడు ఇదే తెలంగాణ గడ్డపై నుంచి రేవంత్‌రెడ్డి దక్షిణాది రాష్ట్రాలు సంఘటితం కావాలన్న పిలుపిచ్చారు.
ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే పాలనలో దక్షిణాది రాష్ట్రాలు ఏమాత్రం తీసిపోవు. రాజకీయాల్లోనైతేనేమీ, సంక్షేమ పథకాలను కొనసాగించే విషయంలో దేశంలో తెలంగాణా,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ముందువరుసలో నిలుస్తాయి. అయినా కేంద్రం ఈ రాష్ట్రాలపట్ల ఉదాసీనంగా ఉండటమేంటన్నది రేవంత్‌రెడ్డి ఆవేదన. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాల నుండి పన్నుల రూపంలో వొచ్చే ఆదాయమే ఎక్కువ. అయినా ఈ రాష్ట్రాలకే నిధుల కేటాయింపులో అన్యాయమే జరుగుతున్నది. ఇదిఏదో ఒక ఏడాదో రెండు సార్లో జరుగడం లేదు. ప్రతీ బడ్జెట్‌లో ఈ లోటు కనిపిస్తూనే ఉందటారాయన. జనాభా ప్రాతిపదికన కేటాయింపులంటూ, జనాభా నియంత్రణ పథకాలను విజయవంతంగా అమలు చేసినందుకా తమకీ శిక్ష అని ఆయన ప్రశ్నిస్తున్నారు. జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చూస్తున్న కేంద్రం, ఆ విధంగా కూడా రాష్ట్రాలకు అన్యాయం చేసే ఆలోచన చేస్తున్నది. దానివల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఉభయ సభల సీట్లు తగ్గుతాయని, అప్పుడు దక్షిణాది రాష్ట్రాల అవసరం పెద్దగా కేంద్రానికి ఉండదన్న ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తున్నదని, అందుకు జనాభాతో ప్రమేయం లేకుండా ప్రతీ రాష్ట్రానికి 50 శాతం సీట్లు కేటాయించాలన్నది తమ డిమాండ్‌గా రేవంత్‌రెడ్డి పేర్కొంటున్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తూ, ప్రతీ విషయాన్ని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు బిజెపి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు సంఘటితం కావాల్సిన సమయం అసన్నమైందంటూ ఆయన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. దీనిపై ఆయా రాష్ట్రాలు ఏలా స్పందిస్తాయన్నది చూడాలి..