ఇరాన్, యుఎస్/ఇజ్రాయిల్ యుద్ధం రోజు రోజుకు మరింత తీవ్రరూపం దాలుస్తుండటంతో, మధ్యప్రాచ్య ఇంధనంపై ఆధారపడిన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికిప్పుడు మనదేశానికి చమురు ఇబ్బంది లేనప్పటికీ, గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఖతార్‌లోని ఎలఎన్‌జీ ఉత్పత్తి సంస్థపై ఇరాన్ చేసిన దాడితో మన దేశానికి గ్యాస్ సరఫరాకు తీవ్ర ముప్పు ఏర్పడింది. దీని విధ్వంసంతో ఖతార్‌నుంచి 17% వరకు గ్యాస్ ఎగుమతులు తగ్గిపోనున్నాయి. దీనివల్ల మన దేశానికి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇప్పటికే గ్యాస్ కొరత కారణంగా దేశంలోని వివిధ నగరాలు ముఖ్యంగా ముంబయి, బెంగళూరుల్లో వాణిజ్య సిలిండర్ల కొరతతో 30 నుంచి 40 శాతం హోటళ్లు మూత పడ్డాయి. రెస్టారెంట్లు మెనూను, పనిగంటలు తగ్గించుకోవడం, ఖరీదైన ప్రత్యామ్నాయాలకు మారడంతో నిర్వహణ ఖర్చులు 20 నుంచి 30 శాతం పెరిగాయి. కొన్నిహోటళ్లు ప్రత్యామ్నాయంగా కట్టెలు, ఇండక్షన్ స్టౌలను ఉపయోగిస్తున్నప్పటికీ, పెద్దమొత్తంలో వంటకాలకు ఇవి అనువైనవి కావు. ప్రస్తుతం ప్రభుత్వం గృహావసరాలకు పెద్దపీట వేస్తుండటంతో పంపిణీ దారులు ఆతిథ్య రంగానికి గ్యాస్ సరఫరాను నిలిపివేశారు.
ఫలితంగా రెస్టారెంట్ల కార్యకలాపాల్లో అంతరాయం ఏర్పడటంతో, వైద్య పర్యాటకులతో సహా రోజువారీ భోజనాలకు హోటళ్లపై ఆధాపడే వారిపై ప్రత్యక్ష ప్రభావం పడుతోంది.
స్థిరమైన డాలర్ డిమాండ్, పెరిగిన ముడి చమురు, విదేశీ పెట్టుబడి దారుల నిష్క్రమణ నేపథ్యంలో భారత రూపాయి విలువ డాలర్‌తో పోల్చిన ప్పుడు క్షీణించి రూ.93కు చేరింది. పెరుగుతున్న వాణిజ్యలోటు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఈ నిర్మాణాత్మక బలహీనతకు కారణమవుతున్నాయి. మనదేశం ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా చేస్తుండటం వల్ల ఎక్కువగా డాలర్లను ఖర్చు చేయాల్సి వొస్తున్నది . అదీకాకుండా పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంధన దిగుమతులకు డాలర్లలోనే చెల్లింపులు జరపాల్సి వొస్తోంది.
దీనికితోడు విదేశీ మదుపర్లు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు ఉపసంహరించుకుంటుండటంతో డాలర్ చెల్లింపులు అధికమయ్యాయి. ఫలితంగా స్టాక్ మార్కెట్లలో డాలర్ల కొరత ఏర్పడుతోంది. యుఎస్ అనుసరిస్తున్న ద్రవ్య విధానం, ఆర్థిక బలం నేపథ్యంలో కేవలం మన కరెన్సీనే కాదు, ఇతర దేశాల కరెన్సీల విలువలు కూడా పడి పోతుండటం వర్తమాన పరిణామం. భవిష్యత్‌లో వాటిల్లబోయే నష్టభయంతో దిగుమతిదార్ల నుంచి వొచ్చిన డిమాండ్, మన కరెన్సీ విలువను కొత్త కనిష్ట స్థాయికి దిగజార్చింది. ఈ పరిణామం వల్ల దిగుమతులపై ఆధారపడే కంపెనీలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వొస్తుండగా, ఐటీ, ఫార్మా రంగాలు ఎక్కువ ఆదాయంతో లాభాల బాటలో నడుస్తున్నాయి.
ఇరాన్‌పై భూతల దాడులకు సిద్ధపడాలని భావించినా ప్రస్తుతానికి యుఎస్/ ఇజ్రాయిల్‌లు వైమానిక, క్షిపణి, మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిం చడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇదిలావుండగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రిసార్ట్‌లు, వినోద పార్క్‌లు, సందర్శనా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ తాజా హెచ్చరికతో ఈ యుద్ధానికి అంతం ఎక్కడ అన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇజ్రాయిల్ ప్రస్తుతం లెబనాన్‌లోని హిజ్‌బుల్లా స్థావరాలపై దాడులు నిర్వహిస్తుండగా, అమెరికా తన వేలాదిమంది మెరైన్, నావికా దళాలను తరలిస్తోంది. వీరి లక్ష్యం ఇప్పటివరకు ప్రధాన మౌలిక సదుపాయా లపైనే ఉండటం గమనార్హం.
విచిత్రమేమంటే తమకు సంబంధంలేని యుద్ధంలో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. తాజాగా మార్చి 18న ఖతార్‌లోని రాస్ లాఫన్ నగరంలోని ఎలఎన్‌జీ మౌలిక సదుపాయాలపై ఇరాన్ జరిపిన దాడితో ధ్వంసమైన వీటి మరమ్మతులకు మరో మూడు నాలుగేళ్లు పట్టే అవకాశముందంటున్నారు. దీని ప్రభావం భారత్‌పై తీవ్ర స్థాయిలో పడనుంది. ఎందుకంటే మన దేశీయ అవసరాల్లో 40-47% వరకు ఈ క్షేత్రం నుంచే సరఫరా అవుతుంది. ఈ దాడులతో ఖతార్‌నుంచి 17% ఎగుమతులు తగ్గిపోనున్నాయి. ప్రస్తుతం ఇరాన్ దాడిలో ఖతార్ ఎలఎన్‌జీ సంస్థకు చెందిన రెండు “ట్రైన్”లు ధ్వంసమయ్యాయి. మిగిలిన వాటి నుంచి చమురు తెచ్చుకుందామన్నా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో సాధ్యం కాదు.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇంధన భాగస్వామ్యాల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా మనకు ఎలఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరాకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా ఆ దేశానికి చెందిన ఇంధన దిగ్గజం గ్యాస్ ప్రోమ్‌కు చెందిన ఒక యూనిట్ మనదేశ యుటిలిటీ సంస్థ అయిన గెయిల్‌కు ఎల్‌ఎన్‌జీ సరఫరాను ప్రారంభించింది. మన ఇంధన అవసరాలను తీర్చడానికి రష్యా సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ దేశంతో సహా ఇతర దేశాలతో మన దేశం చర్చలు జరుపుతోంది. ఎలఎన్‌జీ మౌలిక సదుపాయాల విషయంలో భాగస్వామ్యం కావడానికి రష్యా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.
ఆర్కిటిక్ ఎల్‌ఎన్‌జీ-2 ప్రాజెక్టు వంటి రష్యా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాల కోసం మన దేశ కంపెనీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికిప్పుడు రష్యా-భారత్‌ల మధ్య పైప్‌లైన్ సాధ్యం కానప్పటికీ, వ్లోడివోస్టాక్-చెన్నై కారిడార్‌ను సిద్ధం చేస్తున్నారు. అయితే రష్యన్ సంస్థలపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించడంవల్ల కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశముంది. దీనివల్ల కలిగే వాణిజ్య ఆటంకాలను అధిగమించేందుకు మన దేశం తన సరఫరా దారులను మరింత విస్తరించుకునే యత్నంలో ఉంది . మొత్తంమీద చెప్పాలంటే రానున్న కాలంలో మన ఇంధన అవసరాలు తీర్చడంలో రష్యా అత్యంత కీలక భాగస్వామి కానుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
ఇదిలాఉండగా అండమాన్‌లో నిర్వహించిన చమురు అన్వేషణలో అక్కడ 11.6బిలియన్ బ్యారళ్ల (371 మిలియన్ మెట్రిక్ టన్నుల)చమురు నిక్షేపాలున్నట్లు తేలిన నేపథ్యంలో రానున్న కాలంలో ఈ చమురును వెలికి తీయడం మొదలు పెడితే మన విదేశీ చమురు బిల్లు గణనీయంగా తగ్గిపోతుందని అంచనా. అయితే 2030-32 లోగా ఇక్కడి నుంచి చమురు ఉత్పత్తి అయ్యే అవకాశాలు లేవు. ఇది ఆచరణలోకి వొస్తే అనేక మందికి ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి. దేశం స్వయం సమృద్ధి సాధించడంలో రాబోయే కాలంలో అండమాన్ క్షేత్రం కీలక పాత్ర పోషించనుంది.
ప్రస్తుతం అన్వేషణ చురుగ్గా సాగుతున్నా, వాణిజ్య ఉత్పత్తి అనేది దీర్ఘకాల లక్ష్యం. లోతైన జలాల్లో డ్రిల్లింగ్ నిర్వహించడానికి మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇందుకోసం ఫ్రాన్స్‌కు చెందిన “లోటస్ ఎనర్జీస్”, యుకె/యూరప్‌లకు చెందిన బ్రిటిష్ పెట్రోలియం సంస్థలతో మన దేశం చర్చలు జరుపుతోంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, లోటస్ ఎనర్జీస్‌తోను, ఓఎన్‌జీసీ, బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలతోను కలిసి పనిచేస్తున్నాయి. బ్రెజిల్‌కు చెందిన “బ్రెజిల్ పెట్రోబాస్”సంస్థ అండమాన్ సముద్ర బేసిన్ కోసం ఆయిల్ ఇండియాతో భాగస్వామ్యమవుతోంది. అండమాన్ చమురు అందుబాటులోకి వొస్తే 50% దేశీయ చమురు అవసరాలు తీరతాయి. ఫలితంగా 88% దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది.





