గోదావరి కరకట్ట పనుల జాప్యంపై మంత్రి తుమ్మల ఆగ్రహం
ఇరిగేషన్ శాఖ ఎస్సీలపై మండిపాటు
గోదావరి వరదల నుంచి భద్రాచలం ప్రాంతాన్ని కాపాడాలి
కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 4 : గోదావరి కరకట్ట పొడిగింపును ఇప్పటికే సంవత్సరం పాటు ఆలస్యమైందని మళ్లీ జూన్ నుంచి వరదలు వొచ్చే అవకాశం ఉన్నప్పటికి ఇరిగేషన్ అధికారులు పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం చేశారని ఇరిగేషన్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. ఈసారి కూడా భద్రాచలం ప్రాంతాన్ని గోదావరిలో ముంచుతారా అని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన గోదావరి వరదను ఎదుర్కొనేందుకు కరకట్ట నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికి ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. తక్షణమే ఇరిగేషన్ , నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనిచేసి మే 31 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి వరదల నుంచి భద్రాచలం పట్టణంలోని ప్రజలు, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలను, రవాణా మార్గానికి ఇబ్బందులు లేకుండా కొత్తగా చేపడుతున్న కరకట్ట పనుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్నందుకు సంబంధిత ఇరిగేషన్ శాఖ ఎస్సీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని మంత్రి ఎస్సీలకు ఆదేశించారు.
శుక్రవారం సుభాష్ నగర్ కూనవరం రోడ్డులోని కొత్తగా నిర్మాణం చేపడుతున్న స్లూయిస్ పనులను ఆయన పరిశీలించారు. ఏడాది నుంచి పనులు సరిగా జరగడంలేదని జరగకపోవడానికి కారణం తెలపాలని ఎస్సీలపై ఆయన మండిపడ్డారు. మే 31 నాటికి పూర్తిచేయాలని, ఈసారి గోదావరి వరదలు వొచ్చిన ప్పుడు ముంపు ప్రాంతాల ప్రజలు కానీ భద్రాచలం పట్టణం ప్రజలు కానీ ఎవరూ ఇబ్బందులు పడకూడదని అన్నారు. అందుకు సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు నేషనల్ హైవే అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలన్నారు.
పాత కరకట్ట స్లుయిస్ పాయింట్ నుంచి ఇప్పుడు నిర్మాణం జరిగే కరకట్ట వరకు ఎత్తు పెంచాలని అలాగే పర్మనెంట్ గా మోటార్లు బిగించాలని ఆటోమేటిక్ సెటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. కరకట్ట నిర్మాణం పనులకు ఏమైనా అడ్డంకులు ఉంటే శ్రీరామనవమి కాగానే జిల్లా కలెక్టర్ ను సంప్రదించి సమస్య పరిష్కరించుకొని వెంటనే పనులు ప్రారంభించాలని, నిర్లక్ష్యం వహించే ఎస్సీలు డీఈలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోదేం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.





