“బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఒక సమావేశంలో ఆయన “సాక్షాత్ ప్రధానమంత్రినే కన్వర్టెడ్ బీసీ” అని వ్యాఖ్యానించడం కేవలం పదజాలపరమైన తప్పిదం మాత్రమే కాదు.. పదవికి తగిన డెకోరమ్‌ను విస్మరించడం కూడా. ప్రధానమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అది కూడా రిజర్వేషన్ వంటి గంభీరమైన అంశానికి సంబంధం లేకుండా చేయడం, చట్టపర పోరాటం ప్రభావాన్ని దెబ్బతీస్తుందని న్యాయ, రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..”
అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, పీసీసీ నాయకులు తరచూ న్యూదిల్లీకి చక్కర్లు కొడుతూ పార్టీ అగ్రనాయకత్వం మెప్పు కోసం సాగిలాలు పడుతున్నారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా చేపట్టాల్సిన ప్రక్రియలను గాలికి వదిలేసి రాజకీయ ప్రచారం కోసం వెంపర్లాడుతున్నారు. పవర్ పాయింట్ ప్రదర్శనలతో కాంగ్రెస్ అధినాయకత్వాన్నే తప్పుదోవ పట్టించడం కూడా జరుగుతోంది. “తెలంగాణ ఎస్.ఇ.సి-ఈపీసీ సర్వే దేశానికి ఆదర్శం” అని ప్రభుత్వం తరచూ చెబుతోంది; రాహుల్ గాంధీ కూడా ఇలాంటి వాదనలకు మద్దతు ఇస్తున్నారు. కానీ ఈ ధర్నాలు ప్రజాస్వామ్య ఒత్తిడి సాధనం మాత్రమే. చట్టపరమైన పరిష్కారం కావు.
ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు కలిసి న్యూఢిల్లీకి వెళ్లి ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టి, 7న రాష్ట్రపతిని కలిసే కార్యక్రమం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష పార్టీలకు అధికారిక ఆహ్వానం ఇవ్వకుండా ఇలాంటి ఒంటెద్దు పోకడ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. రాష్ట్రపతి నిర్ణయం లేకుంటే బిల్లులు నిలిచిపోయే అవకాశం వాస్తవం. 2025 ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు స్టేట్ తమిళనాడు వర్సెస్ గవర్నర్ తీర్పులో రాష్ట్ర బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు కారణం లేకుండా ఆలస్యం చేయకూడదని, గరిష్టంగా మూడు నెలల్లో చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది. లేకపోతే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో వేగవంతమైన రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా రాష్ట్రపతికి నిర్ణయ గడువు విధింపజేయడం తెలంగాణ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న చట్టపరమైన మార్గం. కానీ ప్రభుత్వం ఈ దిశగా ఎటువంటి నిర్మాణాత్మక కృషి చేస్తున్నట్టు కనిపించడం లేదు.
వివాదాస్పద వ్యాఖ్యల రాజకీయాలు – స్థాయి, డెకోరమ్ ఎక్కడ?
బీసీ రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఒక సమావేశంలో ఆయన “సాక్షాత్ ప్రధానమంత్రినే కన్వర్టెడ్ బీసీ ” అని వ్యాఖ్యానించడం కేవలం పదజాలపరమైన తప్పిదం మాత్రమే కాదు, పదవికి తగిన డెకోరమ్‌ను విస్మరించడం కూడా. ప్రధానమంత్రిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, అది కూడా రిజర్వేషన్ వంటి గంభీరమైన అంశానికి సంబంధం లేకుండా చేయడం, చట్టపరమైన పోరాటం ప్రభావాన్ని దెబ్బతీస్తుందని న్యాయ, రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ఈ సమయంలో కేంద్ర సహకారం అవసరమని చెప్పే ప్రభుత్వం, అదే సమయంలో ప్రధానిని ఈ రీతిలో విమర్శించడం వ్యూహాత్మక వైఫల్యంగా కనిపిస్తోంది. ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి జీ.కిషన్ రెడ్డి విషయంలో కూడా విరుద్ధ వైఖరి కనబడుతోంది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ రచించిన “ప్రజలే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి ఆయనను “నాకు అత్యంత ఆత్మీయుడు” అని పేర్కొనగా, అంతకుముందు మరో సభలో “రాష్ట్రంలో నివాస అర్హత లేని వ్యక్తి” అని ఘాటుగా విమర్శించారు. ఒకే వ్యక్తి గురించి ఇంత విరుద్ధ వ్యాఖ్యలు చేయడం వ్యూహరాహిత్యాన్ని మాత్రమే కాక, ప్రజల్లో గందరగోళాన్ని కూడా పెంచుతున్నాయి. రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రాన్ని ఒప్పించాల్సిన దశలో ఇలాంటి అసమంజసమైన వ్యాఖ్యలు చేయడం ప్రభుత్వ గంభీరతను దెబ్బతీస్తోందనే అభిప్రాయం నిపుణులది.
తెలంగాణ – బలహీన ప్రక్రియలు, చట్టబద్ధత లోపాలు
ప్రస్తుతం తెలంగాణలో స్థానిక సంస్థల్లో బీసీలకు 22% రిజర్వేషన్లు ఉన్నాయి. వీటిని 42%కు పెంచేందుకు బిల్లులు రూపొందించారు. అయితే ఈ నిర్ణయ ప్రక్రియలో ఇంద్రా సహ్నాయ్ (1992), డా. కె.కృష్ణమూర్తి (2010), వికాస్ కృష్ణ గావ్లి (2021) తీర్పులు అనుసరించిన మార్గదర్శకాలను ప్రభుత్వం గౌరవించలేదు. ఈ తీర్పులు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ల శాతం పెంపు నిమిత్తం స్వతంత్ర చట్టబద్ధ కమిషన్ తప్పనిసరి అని స్పష్టంగా పేర్కొన్నాయి. కానీ తెలంగాణలో ప్లానింగ్ విభాగం నిర్వహించిన ఎస్ఈసీ-ఈపీసీ సర్వే ఆధారంగానే ఈ బిల్లులు రూపొందించబడ్డాయి. దీనికి తోడు బుసాని వెంకటేశ్వరరావు నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్ నివేదికను ఉపయోగించారు. ఈ కమిషన్ స్వతంత్రంగా లోతైన అధ్యయనం చేసి నివేదిక సమర్పించిందా? లేక కేవలం ఎస్ఈసీ-ఈపీసీ డేటాకే ఆధారపడి పని చేసిందా? అన్న ప్రశ్నలు నిపుణులు లేవనెత్తారు. అంతేకాక ఎస్ఈసీ-ఈపీసీ పూర్తి నివేదికలు, బుసాని కమిషన్ నివేదికలు అసెంబ్లీలో లేదా మండలిలో టేబుల్ చేయలేదు. ప్రజా ప్రతినిధుల చర్చ లేకుండా ఇంత పెద్ద నిర్ణయాన్ని రాష్ట్రపతికి పంపడం ప్రజాస్వామ్య పద్ధతులకే విరుద్ధం.
కమిషన్‌ల పట్ల నిర్లక్ష్యం – అసమాన ధోరణి
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి కమిటీ నివేదిక సమర్పణ కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా ఆరుగురు మంత్రులు ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్స్టిట్యూట్‌కి వెళ్లారు. కానీ స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు కోసం రూపొందించిన బుసాని ఏక సభ్య కమిషన్ నివేదికను స్వీకరించడానికి ముఖ్యమంత్రి సమయం కేటాయించలేదు. చివరికి ఆ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేయాల్సి వచ్చింది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని స్పష్టంగా చూపుతుంది.
అర్టికిల్-31సి ఉద్దేశం, పరిమితి
25వ రాజ్యాంగ సవరణ (1971) ద్వారా అర్టికిల్-31సి చేర్చబడింది. దీని ఉద్దేశ్యం: అర్టికిల్-39బి (సంపద మరియు వనరుల సమాన పంపిణీ), అర్టికిల్-39సి (ఆర్థిక ఏకాధిపత్య నిర్మూలన) లక్ష్యాలను సాధించడానికి తీసుకొచ్చిన చట్టాలను రక్షించడం. ఈ చట్టాలను అర్టికిల్-14 (సమానత్వం), 19 (వ్యక్తిగత స్వేచ్ఛ) ఉల్లంఘన పేరుతో కోర్టులు రద్దు చేయకుండా కాపాడటం. 42వ సవరణ (1976) ద్వారా ఈ రక్షణను అన్ని ఆదేశిక సూత్రాలకు విస్తరించగా, మినర్వా మిల్స్ (1980) తీర్పులో ఆ విస్తరణ రద్దు చేసింది. ప్రస్తుతానికి 31‑సి రక్షణ కేవలం అధికరణ 39(బి), 39(సి) పరిధిలోనే ఉంది. ఐఆర్ కోహ్లో (2007) తీర్పు ప్రకారం 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన ఏ చట్టాలకైనా బేసిక్ స్ట్రక్చర్ పరీక్ష తప్పనిసరి. అంటే రాష్ట్రపతి ఆమోదం ఉన్నా 50% దాటి రిజర్వేషన్లు శాస్త్రీయ డేటా, స్వతంత్ర కమిషన్ సిఫార్సులు లేకపోతే నిలబడవు.
తమిళనాడు – శాస్త్రీయ సర్వేలు, శాశ్వత రక్షణ
1969 సత్తానాథన్ కమిషన్, 1982 అంబశంకర్ కమిషన్ నివేదికలు తమిళనాడులో బీసీ రిజర్వేషన్లకు బలమైన పునాది వేశాయి. ఇంటింటి సర్వేలు, విద్యా–ఉద్యోగ రంగాల్లో ప్రాతినిధ్యం, సమీక్ష వంటి సమగ్ర అధ్యయనాలు జరిగాయి. అంబశంకర్ కమిషన్ మొత్తం 298 వర్గాలను గుర్తించి, వాటిని బీసీలు (వెనుకబడిన తరగతులు), ఎంబీసీలు (అత్యంత వెనుకవడి తరగతులు), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (డీఎన్‌సీలు), ఎస్సీలు, ఎస్టీలు వంటి విభాగాలుగా వర్గీకరించింది. ఈ కమిషన్ ప్రకారం బీసీలు మొత్తం జనాభాలో 67.15% కాగా, అందులో బీసీలు సుమారు 30% (వెనుకబడిన తరగతులు + వెనుకబడిన ముస్లింలు), ఎంబీసీలు మరియు డీనోటిఫైడ్ కమ్యూనిటీలు కలిపి సుమారు 20% ఉన్నారని శాస్త్రీయంగా నిర్ధారించింది. ఎంజీఆర్ ప్రభుత్వం ఈ ఆధారాలపై 50% బీసీ రిజర్వేషన్లను కొనసాగిస్తూ మొత్తం 69% రిజర్వేషన్ అమలు చేసింది. తర్వాత మండల్ కమిషన్ తీర్పు (1992) నేపథ్యంలో తమిళనాడు 9వ షెడ్యూల్ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లకు శాశ్వత రక్షణ కల్పించింది. ఇది శాసనబద్ధ చర్చల తర్వాత పార్లమెంట్ ఆమోదం పొందిన మోడల్.
తమిళనాడు మోడల్ – ఒక పాఠం
తమిళనాడు 69% రిజర్వేషన్ చట్టం (1993) ఒక మంచి ఉదాహరణ. తమిళనాడు మొదట ఈ చట్టాన్ని 31‑సి రక్షణ కింద రాష్ట్రపతికి పంపింది. రాష్ట్రపతి ఆమోదం ఇచ్చారు. కానీ అంతటితో ఆగలేదు. రాష్ట్రం కేంద్రాన్ని అభ్యర్థించింది, కేంద్రం 76వ రాజ్యాంగ సవరణ (1994) చేసింది. దీంతో ఆ చట్టం 9వ షెడ్యూల్‌లో చేర్చబడింది (అధికరణ 31‑బి కింద). ఈ ద్వంద్వ రక్షణ (31‑సి + 31‑బి) వల్లే ఆ చట్టం నిలబడగలిగింది. ఐఆర్ కోల్హో పరీక్షలో కూడా తమిళనాడు చట్టం నిలబడగలిగింది. ఎందుకంటే శాస్త్రీయ డేటా + చట్టబద్ధ ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి.
సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
– ఇంద్ర సహ్నాయ్ (1992): 50% మించాలంటే అసాధారణ పరిస్థితులు + శాస్త్రీయ డేటా తప్పనిసరి.
– కె. కృష్ణమూర్తి (2010): స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుకు స్వతంత్ర చట్టబద్ధ కమిషన్ అవసరం.
– వికాస్ కృష్ణ గావ్లి (2021): సర్వేలు కాకుండా కమిషన్ డేటా ఆధారమే చెల్లుబాటు.
– ఐఆర్ కోహ్లో IR Coelho (2007): 1973 తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలకైనా బేసిక్ స్ట్రక్చర్ పరీక్ష తప్పనిసరి.
ముగింపు
తెలంగాణ ప్రభుత్వం 31‑సి రక్షణను వాడుకోవచ్చు. కానీ ఇది తాత్కాలికమే. శాశ్వత రక్షణ కోసం తమిళనాడు చూపినట్లు పార్లమెంట్ సవరణతో 9వ షెడ్యూల్ చేర్పు అవసరం. లేకపోతే ఈ బిల్లులు కోర్టుల్లో నిలబడవు. మొత్తంగా చూస్తే, బీసీలకు న్యాయం చేయడంలో కంటే రాజకీయ నాటకాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని చెప్పాల్సి వస్తుంది.





