సహారా రిఫండ్ ప్రక్రియ ఎందుకు ఇంతకాలం పడుతోంది?

“సహారా సహకార సంఘాల పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. చిన్న పెట్టు బడిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని హామీ ఇచ్చింది. రిఫండ్ ప్రక్రియ క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించింది. అయితే సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. సహారా వివిధ పథకాల ద్వారా సేకరించిన మొత్తం రూ. 25 వేల కోట్లకు పైగానే ఉంది. సెబీ వద్ద ఉన్న ఈ నిధుల్లోనూ ఇప్పటి వరకు 20,000 కంటే తక్కువ రిఫండ్ దరఖాస్తులు మాత్రమే అందాయి. అసంపూర్ణ వివరాలు, ధృవీకరించలేని ఫారాలు, స్పందన రాని పెట్టుబడిదారులు వంటి సమస్యలతో చాలా దరఖాస్తులు మూసివేయబడ్డాయి. దీంతో అసలు పెట్టుబడిదారుల అందరికీ నిజంగా డబ్బు చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.”

సహారా గ్రూప్ తమ ఆప్షనల్లి ఫుల్లీ కన్వర్టిబుల్ డిబెంచర్స్ ద్వారా సేకరించిన నిధులను తిరిగి చెల్లించే విషయంలో ప్రస్తుతం భారత్‌లో సాగుతున్న దీర్ఘకాలిక, సంక్లిష్ట ఆర్థిక వివాదాలలో ఇది అత్యంత ప్రధానమైనది. సుప్రీంకోర్టు అనేకసార్లు జోక్యం చేసుకున్నప్పటికీ, సహారా పథకాలలో ముఖ్యంగా సహకార సంఘాల ద్వారా పెట్టుబడి చేసిన కోట్లాది మంది ప్రజలు తమ డబ్బు ఎప్పుడు వస్తుందో ఇప్పటికీ తెలియక ఆందోళనలో ఉన్నారు. ఈ వివాదం దాదాపు దశాబ్దం క్రితం ప్రారంభమైంది. సహారా గ్రూప్ తమ ఓఎఫ్సిడి లు హైబ్రిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్ అని, అవి సెబీ పరిధిలోకి కాకుండా కంపెనీల రిజిస్ట్రార్ పరిధిలోకి వస్తాయని వాదించింది. తాము ఇప్పటికే ఆర్ఓసి అనుమతి తీసుకుని, అవసరమైన పత్రాలను సమర్పించి బాండ్లు జారీ చేశామని సహారా పేర్కొంది. కానీ సెబీ దీనిని అంగీకరించలేదు. సహారా కంపెనీలు బాండ్ల జారీ ఆపి, పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని సహారా కోర్టులో సవాలు చేయడంతో కేసు చివరకు సుప్రీంకోర్టుకు చేరింది.

2012 జూన్‌లో జరిగిన తుది విచారణ సమయంలో, సహారా 93 శాతం పెట్టుబడిదారులకు ఇప్పటికే చెల్లింపులు పూర్తయ్యాయని, మొత్తం రూ. 23,500 కోట్లు తిరిగి ఇచ్చిందని తెలిపింది. ఇంకా సుమారు రూ. 2,260 కోట్లు మాత్రమే బాకీ ఉన్నాయని, అయితే ఇప్పటికే రూ. 12,000 కోట్లను కోర్టు ఆదేశాల మేరకు జమ చేశామని, వడ్డీలతో అది రూ. 16,000 కోట్లకు పెరిగిందని తెలిపింది. 2012 ఆగస్టు లో సుప్రీంకోర్టు తుది ఉత్తర్వు ఇచ్చేటప్పటికి మెజారిటీ పెట్టుబడిదారులకు తాము చెల్లింపులు పూర్తి చేశామని, ఇప్పుడే మళ్లీ డబ్బు చెల్లించడం “ఒకే బాధ్యతపై రెండోసారి చెల్లింపు” అవుతుందని సహారా వాదించింది. ఇదిలా ఉండగా, సెబీ 144 కంటే ఎక్కువ పత్రికల్లో నాలుగు సార్లు ప్రకటనలు ఇచ్చి పెట్టుబడిదారులను రిఫండ్ కోసం దరఖాస్తు చేయమని పిలుపునిచ్చింది. అయినప్పటికీ చాలా కొద్ది మంది మాత్రమే ముందుకు వచ్చారు.

2014 అక్టోబరు నాటికి కేవలం 4,600 మంది మాత్రమే రిఫండ్ దరఖాస్తులు చేశారు. సెబీ వద్ద ఉన్న రూ. 16,000 కోట్లలో కేవలం రూ. 64 కోట్లు మాత్రమే తిరిగి చెల్లించగలిగింది. ఇది రిఫండ్ ప్రక్రియలోని లోపాలపై ప్రశ్నలు రేకెత్తించింది. సహారా మాత్రం తాము చాలా మందికి నేరుగా డబ్బు ఇచ్చేశామని, సెబీ వద్ద ఉన్న రికార్డులు అసంపూర్ణమని వాదించింది. బ్యూరోక్రసీ కూడా ఈ ప్రక్రియను మరింత క్లిష్టం చేసింది. 2013లో సహారా మూడు కోట్లకుపైగా అప్లికేషన్ ఫారాలు, రెండు కోట్ల రిడంప్షన్ వౌచర్లు ఉన్న 127 లారీలు సెబీ కార్యాలయానికి పంపింది. అయితే అవి కార్యాలయ సమయం తర్వాత రావడంతో సెబీ రెండో విడత డాక్యుమెంట్లను స్వీకరించలేదు. చాలా రికార్డులు అసంపూర్ణంగా ఉండటంతో పెట్టుబడిదారుల నిజమైన వివరాలను నిర్ధారించడం కష్టమైంది. సహారా మాత్రం 95 శాతం పెట్టుబడిదారులకు తాము ఇప్పటికే చెల్లించినట్టు మళ్లీ చెబుతోంది.

ఇన్ని సమస్యల మధ్య, ఇటీవల కొంత పురోగతి కనిపించింది. 2023లో సుప్రీంకోర్టు సెబీ సహారా రిఫండ్ అకౌంట్‌లోని రూ. 5,000 కోట్లను సహారా సహకార సంఘాల పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించేందుకు కేంద్ర సహకార సంఘాల రిజిస్ట్రార్ కు బదిలీ చేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నడుస్తున్న ఈ ప్రక్రియలో కొంతమంది పెట్టుబడిదారులు డబ్బు పొందారు. 2025 జూలై నాటికి 27 లక్షల మందికి పైగా పెట్టుబడిదారులకు రూ. 5,000 కోట్లకు పైగా చెల్లించబడింది. అయితే మరో 1.08 కోట్ల మంది ఇంకా వేచి ఉన్నారు.

సహారా సహకార సంఘాల పెట్టుబడిదారుల కోసం ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రారంభించింది. చిన్న పెట్టుబడిదారులకు ప్రాధాన్యత ఇవ్వాలని హామీ ఇచ్చింది. రిఫండ్ ప్రక్రియ క్లిష్టతను దృష్టిలో పెట్టుకుని సుప్రీంకోర్టు గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించింది. అయితే సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. సహారా వివిధ పథకాల ద్వారా సేకరించిన మొత్తం రూ. 25 వేల కోట్లకు పైగానే ఉంది. సెబీ వద్ద ఉన్న ఈ నిధుల్లోనూ ఇప్పటి వరకు 20,000 కంటే తక్కువ రిఫండ్ దరఖాస్తులు మాత్రమే అందాయి.

అసంపూర్ణ వివరాలు, ధృవీకరించలేని ఫారాలు, స్పందన రాని పెట్టుబడిదారులు వంటి సమస్యలతో చాలా దరఖాస్తులు మూసివేయబడ్డాయి. దీంతో అసలు పెట్టుబడిదారుల అందరికీ నిజంగా డబ్బు చేరుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సహారా స్థాపకుడు సుబ్రత రాయ్ మరణం తర్వాత, సెబీ వద్ద మిగిలి ఉన్న రూ. 25వేల కోట్ల భవితవ్యంపై ప్రశ్నలు మరింత పెరిగాయి. కొంతమంది పెట్టుబడిదారులు డబ్బు పొందినా, పెద్ద భాగం పెట్టుబడిదారులు ఇప్పటికీ ప్రభుత్వ–సెబీ –కోర్టుల మధ్య జరుగుతున్న నెమ్మదితనపు ప్రక్రియలో ఇరుక్కుపోయారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఈ మొత్తం రిఫండ్ వ్యవస్థను పర్యవేక్షిస్తూనే ఉంది. అయితే ప్రధాన ప్రశ్న మాత్రం అదే — మిగిలిన పెట్టుబడిదారుల డబ్బు ఎప్పుడు తిరిగి వస్తుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *