అమెరికా షట్‌డౌన్ ఎందుకు? మనపై ప్రభావం ఎంత?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక శక్తి అయిన అమెరికాలో ఒక వింత సమస్య తరచుగా తలెత్తుతుంది. అదే ప్రభుత్వ కార్యకలాపాల నిలుపుదల లేదా షట్‌డౌన్. ఇది కేవలం తాత్కాలిక పాలనాపరమైన ఇబ్బంది కాదు. రాజకీయ నాయకులు దేశ బడ్జెట్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతే, దేశ కార్యకలాపాలే ఆగిపోయే ప్రమాదకరమైన సంక్షోభం ఇది. అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు సజావుగా సాగాలంటే అక్కడి పార్లమెంటు అయిన కాంగ్రెస్ ఖర్చు పెట్టడానికి చట్టపరమైన అనుమతి ఇవ్వాలి.
ఈ విధానం యాంటీడిఫిషియెన్సీ చట్టం (ఎడిఎ) అనే పాత చట్టంలో ఉంది. ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు అందించేందుకు పార్లమెంట్ తప్పనిసరిగా ప్రతి సంవత్సరం ఒక బడ్జెట్‌ను లేదా తాత్కాలిక ఖర్చు బిల్లును ఆమోదించాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి, అంటే అక్టోబర్ 1వ తేదీలోపు, కాంగ్రెస్ ఈ నిధుల బిల్లులను ఆమోదించడంలో విఫలమైతే, ప్రభుత్వంలో అత్యవసరం కాని విభాగాల సేవలు తాత్కాలికంగా మూసివేయబడతాయి. దీనినే ప్రభుత్వ షట్‌డౌన్ అంటారు.
గత దశాబ్దాలలో ఈ పరిస్థితి తరచుగా సంభవించడం పెరిగింది. ఇది ఒక సాధారణ ప్రక్రియ లోపం కాస్తా, అపారమైన నష్టం కలిగించే శక్తివంతమైన రాజకీయ అస్త్రంగా మారింది. కొన్ని నిధులను ఆమోదించి, మరికొన్నింటిని ఆమోదించకపోతే అది పాక్షిక షట్‌డౌన్ అవుతుంది. ఇది అధ్యక్షుడు ఇష్టపూర్వకంగా తీసుకునే నిర్ణయం కాదు. బడ్జెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ విఫలమైనప్పుడు చట్టం ప్రకారం స్వయంచాలకంగా జరిగే ప్రక్రియ ఇది. అందుకే, ఈ వైఫల్యానికి కారణం, పరిష్కారం రెండూ కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటాయి. నిజానికి, ఈ చట్టాన్ని డబ్బు వృథా కాకుండా ఉండాలనే ఉద్దేశంతో తెచ్చారు. కానీ ఇప్పుడు, రాజకీయ పార్టీలు తమ విధానపరమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి బడ్జెట్ ఆమోదాన్ని అడ్డుకోవడం ద్వారా దీనిని ఒక రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగిస్తున్నాయి. అంటే, డబ్బును నియంత్రించే చట్టం, ప్రభుత్వ కార్యకలాపాలను ఆపేసే సాధనంగా మారిందన్నమాట.
షట్‌డౌన్‌కు అసలు అధికారం అమెరికా రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలో ఉంది. యుఎస్ రాజ్యాంగంలోని ఆర్టికల్ I, సెక్షన్ 9, క్లాజ్ 7 ప్రకారం, “చట్టం ద్వారా చేసిన కేటాయింపుల పర్యవసానంగా తప్ప, ఖజానా నుండి డబ్బు తీయరాదు.” ప్రభుత్వ ఖజానాపై అంతిమ అధికారం పూర్తిగా కాంగ్రెస్‌కే చెందుతుంది. దీని అర్థం, ప్రభుత్వ కార్యకలాపాలు సాగడానికి కాంగ్రెస్ డబ్బును ఆమోదించాలి. ఒకవేళ ఆమోదించకపోతే, చట్టబద్ధంగా కార్యకలాపాలు ఆగిపోతాయి. కాంగ్రెస్ నిధులను ఆమోదించడంలో విఫలమైతే, చట్టాన్ని గౌరవించి, ఖర్చును ఆపడం తప్పనిసరి. అందుకే, షట్‌డౌన్ అనేది బడ్జెట్ ఆమోదం విఫలమైనప్పుడు ఆటోమేటిక్‌గా సంభవించే ఒక పరిణామం.
షట్‌డౌన్‌కు ప్రస్తుత కారణాలు:
ఈ షట్‌డౌన్‌కు ప్రధాన కారణం పార్టీల మధ్య ఉన్న తీవ్రమైన విభేదాలు. ఈ సంక్షోభం కేవలం ఆర్థిక సమస్య కాదు, ఇది తీవ్రమైన రాజకీయ విభేదాల ఫలితం. ఉదాహరణకు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు, డెమొక్రాట్ పార్టీ మరోవైపు మొండి పట్టుదలకు పోవడం ఈ సంక్షోభానికి దారితీస్తుంది. సాధారణంగా, ఆరోగ్య సంరక్షణ నిధులు అంటే మెడికేయిడ్ కోతలు, వలస విధానాలు వంటి కీలక అంశాలపై రాజకీయ డిమాండ్లను నిధుల బిల్లుకు జతచేయాలని డెమోక్రాట్లు ప్రయత్నించడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడుతుంది. డెమొక్రాట్‌లు ఆరోగ్య సంరక్షణ పథకాలకు నిధులు కొనసాగించాలని పట్టుబడుతుంటే, అధ్యక్షుడు ట్రంప్ దీన్ని తన రాజకీయ ఆయుధంగా వాడుకుంటారు. డెమొక్రాట్ల పాలనలోని రాష్ట్రాలకు కేటాయించిన అభివృద్ధి నిధులను నిలిపివేయడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగులలో తనకు వ్యతిరేకంగా ఉన్నవారిని తొలగిస్తానని బహిరంగంగా బెదిరించడం వంటి చర్యలు అమెరికా రాజకీయాల స్థాయిని దిగజార్చాయి. 1980 తరువాత పాత ఎడిఎ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం మొదలుపెట్టాక షట్‌డౌన్‌లు తప్పనిసరి అయ్యాయి. ఈ విధంగా, బడ్జెట్ కేటాయింపుల్లో కాంగ్రెస్ వైఫల్యం చెందితే, ఆ పరిణామాలకు కారణం, పరిష్కారం రెండూ కాంగ్రెస్ చేతుల్లోనే ఉంటాయి.
షట్‌డౌన్‌ల చరిత్ర, –పర్యవసానాలు:
1976వ సంవత్సరం నుండి అమెరికా 20 సార్లకు పైగా నిధుల కొరతను ఎదుర్కొంది. ఈ సమస్య ఇప్పుడు మరింత తరచుగా, ఎక్కువ రోజులు కొనసాగుతోంది. ఇది రాజకీయ నాయకులు పార్టీ ప్రయోజనాలను దేశ పాలన కంటే ముఖ్యమని భావిస్తున్నారనడానికి నిదర్శనం. చారిత్రక ఉదాహరణలను పరిశీలిస్తే, 1996 లో బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 21 రోజులు ఈ షట్‌డౌన్ కొనసాగింది. 2013లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌పై 16 రోజులపాటు షట్‌డౌన్ జరిగింది. ఇక, 2018–19లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సరిహద్దు గోడ నిర్మాణానికి నిధులు ఇవ్వాలనే డిమాండ్‌తో రికార్డు స్థాయిలో 35 రోజులు షట్‌డౌన్ జరిగింది.
అమెరికాపై షట్‌డౌన్ ప్రభావం:
షట్‌డౌన్ జరిగినా, ప్రాణాలు, ఆస్తులను కాపాడే జాతీయ భద్రత, పోలీసు సేవలు వంటివి కొనసాగుతాయి. సామాజిక భద్రత వంటి తప్పనిసరి కార్యక్రమాల నిధులు కూడా ఆగవు. అయితే, ఈ విభాగంలో పనిచేసే ఉద్యోగులు జీతం లేకుండా పనిచేయాలి. ఫెడరల్ పార్కులు, శాస్త్రీయ పరిశోధన, కొన్ని ప్రభుత్వ అనుమతులు ఇచ్చే కార్యాలయాలు మూసివేయబడతాయి. దాదాపు 7.5 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులు జీతాలు లేకుండా బలవంతంగా సెలవులో ఉండాల్సి వస్తుంది. రోజుకు సుమారు 400 మిలియన్ల డాలర్ల జీతం నష్టం జరుగుతుంది. జీతం తిరిగి వచ్చినప్పటికీ, ఈ మధ్యలో వచ్చే ఆర్థిక కష్టాలు, ఇంటి అద్దెలు కట్టలేని పరిస్థితి ఇబ్బంది పెడుతుంది. కాంట్రాక్టు ఉద్యోగులకు పోయిన జీతం తిరిగి రాదు.
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
అమెరికా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి, ఇక్కడి ఆర్థిక అనిశ్చితి వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లు, విదేశీ మారక మార్కెట్లు, వస్తువుల మార్కెట్లలో అస్థిరత పెరుగుతుంది. అమెరికా ప్రభుత్వం తన బడ్జెట్‌ను నిర్వహించలేకపోవడం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఇది ప్రపంచ పెట్టుబడుల ప్రవాహాన్ని తగ్గిస్తుంది. అంతేకాక, ద్రవ్యోల్బణం వంటి కీలక ఆర్థిక సమాచారాన్ని సేకరించే సంస్థలు ఆగిపోతాయి. ఈ సమాచారం లేకపోవడం వల్ల, ప్రపంచ బ్యాంకులతో సహా అంతర్జాతీయ సంస్థలు, ఫెడరల్ రిజర్వ్ వంటివి సరైన నిర్ణయాలు తీసుకోలేవు. షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే, అమెరికా వృద్ధి మందగించడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. తరచుగా షట్‌డౌన్‌లు రావడం వల్ల, అమెరికా ఒక స్థిరమైన, నమ్మదగిన దేశం అనే పేరును కోల్పోతుంది. అంతర్జాతీయ సహాయ కార్యక్రమాలు, వీసా ప్రక్రియలు వంటివి ఆగిపోవడం వల్ల విదేశీ సంబంధాలు దెబ్బతింటాయి.
మన దేశంపై ప్రభావం:
అత్యంత తక్షణ, బాధాకరమైన ప్రభావం హెచ్-1బి వీసా, గ్రీన్ కార్డ్ ప్రక్రియల్లో ఏర్పడిన అంతరాయం. నిధుల కొరత కారణంగా యుఎస్ కార్మిక శాఖ లోని ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ కార్యాలయం అన్ని కార్యకలాపాలను నిలిపివేస్తుంది. కొత్త హెచ్-1బి వీసా పిటిషన్‌ను దాఖలు చేయడానికి లేదా ఉద్యోగాన్ని మార్చడానికి, ముందుగా లేబర్ కండిషన్ అప్లికేషన్ను డీఓఎల్ ధృవీకరించాలి. ఓఎఫ్‌ఎల్‌సీ పనిచేయకపోవడంతో కొత్త ఎల్సీలు దాఖలు చేయడానికి వీలు లేకుండా పోయింది. దీని అర్థం హెచ్-1బి వ్యవస్థ నుండి అత్యధికంగా లబ్ధి పొందుతున్న నైపుణ్యం గల భారతీయ నిపుణులు వేలాది మంది అనిశ్చితిలో చిక్కుకున్నారు.
వారి ఉద్యోగ మార్పిడులు, కొత్త నియామకాలు నిరవధికంగా ఆగిపోయాయి. అదేవిధంగా, శాశ్వత నివాసానికి అవసరం అయిన గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియ కూడా స్తంభించింది. ఈ ప్రక్రియకు కూడా డీఓఎల్ నుండి ధృవీకరణలు లేదా ప్రస్తుత వేతనాల నిర్ధారణలు అవసరం. ఇది ప్రవాస భారతీయులకు ఇప్పటికే కఠినంగా ఉన్న నిరీక్షణ సమయాన్ని మరింత పెంచుతోంది. షట్‌డౌన్ ఎక్కువ కాలం కొనసాగితే అమెరికన్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకుంటాయి. దీని వల్ల మన దేశ ఐటీ సేవల ఎగుమతులు తగ్గిపోయే ప్రమాదం ఉంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్‌లో అనిశ్చితి పెరిగి, భారత స్టాక్ మార్కెట్లు నష్టపోవడం, రూపాయి విలువ తగ్గడం వంటి ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు.
ప్రజాస్వామ్యానికి హెచ్చరిక:
అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అనేది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించే ఒక ఖరీదైన ఆయుధం. దీనివల్ల వందల కోట్ల డాలర్ల నష్టం, ప్రజలకు కష్టాలు, దేశ ప్రతిష్ఠకు నష్టం తప్ప, దీర్ఘకాలికంగా పెద్దగా లాభం లేదు. ఎక్కువ మందికి ప్రయోజనం కలిగించే పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ వంటివి ఆగవు కాబట్టి, సామాన్య ప్రజలు వెంటనే ఇబ్బంది పడరు. దీంతో రాజకీయ నాయకులకు త్వరగా రాజీ పడాల్సిన అవసరం కనిపించదు, సంక్షోభ భారం ఎక్కువగా ఉద్యోగులు, చిన్న వ్యాపారాలపై పడుతుంది. ఈ సమస్యను సృష్టించిన కాంగ్రెస్ నాయకులు, షట్‌డౌన్ సమయంలో కూడా జీతాలు తీసుకుంటూ తమ కార్యకలాపాలను కొనసాగిస్తారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం తన సొంత బడ్జెట్‌ను ఆమోదించుకోలేక పదే పదే ఇలా పాలనను స్తంభింపజేయడం ఒక విచిత్రమైన, విచారకరమైన విషయం. పౌరుల సంక్షేమం కంటే రాజకీయ పంతాలకే ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల వ్యవస్థ బలహీనపడుతోంది. అమెరికా తన విశ్వసనీయతను కోల్పోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తానికే మంచిది కాదు. రాజకీయ వైరుధ్యాలు సహజమే అయినప్పటికీ, దేశ అభివృద్ధిని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక నిర్ణయాల విషయంలో రాజీ పడటం ఎంత అవసరమో ఈ అమెరికన్ షట్‌డౌన్ స్పష్టంగా చెబుతున్న హెచ్చరిక.
డి జయరాం
9440485824

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *