ఎవరీ చెప్యాల ప్రభాకర్‌?

 ఎం‌దుకు అతని గురించి మాట్లాడుకోవాలి?

అంబేడ్కరీజం, బుద్ధిజం, మార్క్సిజం సంపూర్ణంగా అధ్యయనం చేశాడు. ‘తుపాకి గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది’ అనే నినాదాలు, ఎర్ర జెండాల రెపరెపలు ఆకాశాన్ని ఎరుపెక్కిస్తున్న సమయంలో, యువకులంతా ‘ఎరజెం డడెరజెండెన్నీయల్లో.. ఎరెర్రెనిదీ జెండెన్నీ యల్లో..  పేదల పాలీటెన్నీ యల్లో,  మరి పెన్నిది ఈ జెండెన్నియలో’ అనే పాటలు సాయుధ దళాలవుతూ తెలంగాణ యువత కవాతు చేస్తున్న సందర్భంలో 20 ఏళ్ల  యువకుడు.. యువకులంతా వెళుతున్న ఆ దారిన నడిచారు. దళిత, బహుజన జెం డాను భుజాన వేసుకొని అంబేడ్కరిజం, బుద్ధిజంపై ఉపాన్యాసాలు ఇస్తూ కాన్షీరాం నీల్‌ ‌జెండాతోనే రాజ్యాధికారం సిద్దిస్తుందని ప్రచారం చేస్తూ దాదాపు 40 ఏళ్ల జీవితం అంటే మరణం చివరి వరకు అలు పెరుగకుండా నమ్మిన సిద్ధాంతం కోసమే పని చేసాడు. అంబేడ్కర్‌ ‌సంఘాల నిర్మాణంలోను, పోరాటాలలోను క్రియాశీలపాత్ర పోషిం చాడు. భీమదేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో అంబేడ్కర్‌ ‌విగ్రహాలు నెలకొల్ప డానికి అవిశ్రాంతంగా కృషిచేశాడు.

‘ఈ విగ్రహాలు భవిష్యత్‌ ‌తరాలలో విప్లవాత్మక భావజాలాన్ని నెలకొల్పే చైతన్యమూర్తులు’ అని ఒక సందర్భంలో చెప్పాడు. తెలంగాణలో ఎన్‌కౌంటర్లు, కౌంటర్లు జరుగుతూ నేలంతా రక్తం ఏరులై పారుతున్న సమయంలో, ‘ఎన్‌కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే’ అని ఎంత గట్టిగా నినదించి అమరుల శవాలను భుజానెత్తుకొన్నాడో.. బ్రాహ్మణీజాన్ని ఎంతగా వ్యతిరేకించేవాడో బ్రాహ్మణులతో ముఖ్యంగా కొత్తకొండ బ్రాణ్మణులతో అంత స్నేహం. అగ్రకులాదిపత్యాన్ని ఎంతగా వ్యతిరేకిం చేవాడో అన్ని రకాల అగ్రకుల పెద్దలతో అంతా స్నేహంగా ఉండడం అతనికే సాధ్యం. హుస్నాబాద్‌, ‌భీమదేవరపల్లి, హుజురాబాద్‌, ‌సిరిసిల్ల, జగిత్యాల ముఖ్యంగా పాత కరీంనగర్‌జిల్లా అంత కలెదిరిగి బహుజన్‌ ‌సమాజ్‌ ‌పార్టీ పాత కరీంనగర్‌ ‌జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి దాన్ని బి.ఎస్‌.‌పిని విస్తృతం చేసి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎం.ఎల్‌.ఏగా పోటీ చేసే స్థాయికి ఎదిగి నియోజకవర్గంలోని సమస్యలన్నింటిని ప్రజలముందు పెట్టి నిర్లక్ష్యానికి కారణమైన పాలకపార్టీలను నిలదీసి, ‘వోట్లు  మావి, సీట్లు మీవా, ఇకపై చెల్లదు, ఇకపై సాగదు’ అంటూ నినదించాడు.


తెలంగాణ మలి దశ ఉద్యమానికి పూర్వరంగం ఏర్పాటు చేయడంలో భాగంగా ఉపాధ్యాయ సంఘాలు, పార్టీలు నిర్వహించిన విద్యా సద స్సులకు ఆహ్వాన సంఘం అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా, మండలంలో జరిగిన తెలంగాణ జాగరణ సభలకు ముఖ్యవక్తగా పనిచేసాడు. తెలంగాణ విద్యా వంతుల వేదిక, తెలంగాణ జాయి ంట్‌ ‌యాక్షన్‌ ‌కమిటీల ఏర్పాటులో అనేక మిలిటెంట్‌ ‌పోరాటాలలో అనుభవం ఉన్న మండల జె.ఏ.సి చైర్మన్‌ ‌సారయ్యతో కలిసి అనేక పోరాటాలకు రూపకల్పన చేయడం తోపాటు తను జె.ఏ.సిలో జిల్లా స్థాయి బాధ్యతల్లో పనిచేసాడు. రాత్రి పూట జరిగే తెలంగాణ జాగరణ సభలలన్నింటిలో తెలంగాణపై ప్రజలను చైతన్య పరుచడానికి ఎన్నో ఉపన్యాసాలిచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ప్రజలముందు పెట్టాడు. 2010 జనవరి 15న కొత్తకొండ జాతరలో జరిగిన ధూం ధాం సభలో ఆయన చేసిన ఉపన్యాసం హజరైన లక్షల మందిలో తెలంగాణ స్పూర్తి నింపింది.  ముల్కనూర్‌లోని ఎం.ఎల్‌.ఏ ఇం‌టిపైన, పోలీస్‌స్టేషన్‌పైన ఇతర ప్రభుత్వ కార్యాలయాలపైన నల్ల జెండాలను ఎగురవేసి తన నిరసన తెలిపాడు. ఇనుప రాతి గుట్టల పరిరక్షణకై జరిగిన ఉద్యమంలో చెప్యాల ప్రభాకర్‌ ‌సారయ్య సార్‌తో కలిసి కీలక భూమిక పోషించాడు.

ఉద్యమ కాలంలో ఓ మంత్రి రూరల్‌ ‌బ్యాంక్‌ను సందర్శించడానికి వస్తే గెరిల్లా దాడి చేసి తరిమి తరిమి కొట్టిన సంఘటనకు సారయ్య సార్‌తో కలిసి పథక రూపకల్పన చేసి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను జాతీయ స్థాయిలో పతాక స్థాయికి చేర్చాడు. మిలియన్‌ ‌మార్చ్, ‌సాగరహారాలకు నిర్భంధాన్ని లెక్క చేయకుండా రహస్యంగా హైదరాబాద్‌కు వెళ్ళడమే కాదు, టి.జె.ఏ.సి సంసద్‌ ‌యాత్ర తలపెడితే దిల్లీ కి  వెళ్ళి తెలంగాణ డిమాండ్‌ను నినదించాడు. రైల్‌రోకోలో లాఠీ దెబ్బలు తిన్నాడు. ఉద్యమ కాలం నాటి అనేక కేసులను మోయడమే కాదు జైలు శిక్ష అనుభవించాడు. ముల్కనూర్‌ అం‌బేడ్కర్‌ ‌కూడలిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం నిర్మాణంలో ఆయన కృషి ఎనలేనిది. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే ఎంతో సంతోషపడ్డాడు. వచ్చిన తెలంగాణలో జరుగుతున్న తప్పులను వదిలిపెట్టకుండా నిలదీసాడు. ప్రభాకర్‌ ‌మంచి రచయిత. తన ఆలోచనల్ని తన 45 ఏళ్ళ ఉద్యమ అనుభవాలను ఒక క్రమ పద్ధతిలో రాయడానికి చేసిన ప్రయత్నానికి సంబంధించిన రాత ప్రతులు నేను కొన్ని చూసాను. భద్రపరిచిన వాటిన్నింటిని సేకరించి ఒక పుస్తకంగా తీసుకు వచ్చే ప్రయత్నం కూడా జరగాల్సి ఉంది. ప్రభాకర్‌ ‌మంచి హాస్యప్రియుడు కూడా! తన అనుభవంలో ఎదురైన అనేక సంఘటలను హాస్యంగా మార్చి కడుపుబ్బ నవ్వించేవాడు.

కరువు మండలమైన భీమదేవరపల్లి మండల మెట్ట ప్రాంత రైతాంగ ప్రధాన సమస్యలైన వరద కాలువ, త్రాగు నీరు సాధనకై బహుజన సమాజ్‌ ‌పార్టీ (బి.ఎస్‌.‌పి) ఆధ్వర్యంలో బహుజన చైతన్య పాదయాత్రను మాన్యశ్రీ కాన్షీరాం జన్మదినమైన 15.3.2005 రోజున కన్నారం గ్రామంలో చేపట్టి మండలంలోని అన్ని గ్రామాలలో తిరుగుతూ, బహిరంగ సభలు నిర్వహిస్తూ  నాలాంటి వాళ్ళందరిని పిలిచి ఆ సభలలో మాట్లాడిస్తూ అంబేడ్కర్‌ ‌జన్మదినమైన 14.4.2005 రోజున ములుకనూర్‌లో ముగించి తను ఎటువైపో బహిర్గతం చేశాడు.

భీమదేవరపల్లి మండలంలోని ధర్మారం గ్రామంలో నిరుపేద మాదిగ కుటుంబంలో జన్మించిన చెప్యాల ప్రభాకర్‌ ‌జ్యోతిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. జ్యోతి అంగన్‌వాడీ టీచర్‌గా కొనసాగుతూనే ఉద్యమకారులలో స్ఫూర్తి నింపడానికి గాయకురాలిగా పాటలు పాడుతూ, ఉద్యమాల్లో పాల్గొటూ తన సహచరుడైన ప్రభాకర్‌కు అండగా నిలిచింది. తన ఇద్దరు అమ్మాయిలలో పెద్దమ్మాయికి తనకిష్టమైన మాయావతి అని, రెండో అమ్మాయికి వింధ్యావతి అని పేర్లు పెట్టుకున్నాడు. జ్యోతి క్యాన్సర్‌తో బాధబడు తున్నప్పుడు ఆమెను బతికించుకోవడానికి ప్రభాకర్‌ ‌చేసిన కృషి అంత ఇంతకాదు.

2023 అక్టోబర్‌ 23‌న జ్యోతి మరణించినప్పుడు గుండె పగిలేలా రోదించాడు. స్వల్పకాలంలోనే ప్రభాకర్‌కు ఓపెన్‌ ‌హర్ట్ ‌సర్జరీ కావడం, జ్యోతి మరణాంతరం కేవలం ఒక సంవత్సరం రెండు నెలల కాలంలోనే జనవరి 14, 2025 రోజున ప్రజల ముఖ్యంగా దళిత బహుజన వర్గాల కోసం నిరంతరం పరితపించిన అతని హృదయం ఆగిపోవడం ఆయన ప్రియాతి ప్రియ స్నేహితులమైన సారయ్య సార్‌, ‌నేను ఎంతో కలత చెందాం. అనేక ప్రజా ఉద్యమాల రూపకల్పనలో కీలక భూమిక పోషించిన చెప్యాల ప్రభాకర్‌ అస్తమయం ప్రజలకు తీరనిలోటు. ప్రభాకర్‌, ‌సారయ్య సార్‌ ‌మిత్ర ధ్వయంలో ప్రభాకరుడిని కోల్పోయి ఒంటరిగా నిలబడ్డ సారయ్య సార్‌కు అండగా నిలబడి చెప్యాల ప్రభాకర్‌ ఆకాంక్షలను, ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి…
(23.01.2025 గురువారం చెప్యాల ప్రభాకర్‌ ‌సంస్మరణసభ సందర్భంగా…)
– డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు,
9701007666.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *