జయశంకర్ కలల తెలంగాణ ఎక్కడ..?

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  ద్వారా సీమాంధ్ర కు విచ్చలవిడిగా నీటిని మళ్లిస్తున్నా అధికారానికి దాసోహమైన తెలంగాణ పాలకులు నీళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో  తెలంగాణ  వాదనలు పరిపాలనలో అసమర్థతను కనబరిచినాయి. ఒకవైపు సీమాంధ్రలో నీటి లభ్యత కు మించి చట్ట విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించ లేదు,కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడంలో విఫలమైనారు.మరో వైపు క్రిష్ణా  నది కింద తెలంగాణ లో చిన్నవి పెద్దవి కలిపి దాదాపు ఇరువై ప్రాజెక్టులు ఉన్నవి. వీటికి బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా,నిర్మాణాలు పూర్తి చేయకుండా దశాబ్ద కాలం పాటు కాలం వెళ్లదీసినారు. ప్రస్తుతం ఏడాదిన్నర పాలన కూడా ఆవైపుగానే సాగుతుంది.
తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమానికి దశ దిశ నిర్థేశించి తన స్వప్నం సాకారంకాకుండానే ఆచార్య జయ శంకర్ అమరుడైనారు.సార్ తెలంగాణ ను విడిచివెళ్లి నేటికి  పద్నాలుగు ఏండ్లు.ఉద్యమానికి జవసత్వాలు నింపిన మేధావులలో ఆచార్య జయశంకర్ ప్రముఖులు.వారు విద్యావేత్తగా,ఉద్యమ దిక్సూచిగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, అభివృద్ధి కలలని రూపుదిద్దారు.నీళ్లు, నిధులు,ఉద్యోగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివిధ వేదికలపై ప్రస్తావించడం తో పాటు,అనేక నివేదికలను పాలకుల ముంధు ఉంచి ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని నొక్కి చెప్పారు.
మన నీళ్లు-మన నిధులు-మన ఉద్యోగాలు అనే నినాదం జయశంకర్ ఆశయాలకు ప్రతి రూపం.తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే జయశంకర్ ఆకాంక్షించిన ఆశయాలు నెరవేర్చుకోవడానికి మార్గం ఏర్పడుతుందని జయశంకర్ తో పాటు, తెలంగాణ సమాజం కూడా బలంగా విశ్వసించింది.2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం చోటుచేసుకున్న రాజకీయ, ఆర్ధిక, సామాజిక మార్పులు తదనంతరం కూడా పాలనలో జరుగుతున్న మార్పులు ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా జరుగుతున్నాయా.! లేదా.! అనే విషయాన్ని వారి 14 వర్ధంతి సందర్భంగా విశ్లేషించుకోవాలసిన అవసరం ఉన్నది.
యధేచ్చగా కొనసాగుతున్న నీళ్ల దోపిడి
ఆచార్య జయశంకర్ నదీ జలాల విషయంలో నీళ్ల పంపిణీ భౌగోళిక పరంగా(బేసిన్ ఏరియా బేస్డ్) జరగాలని,వినియోగపరంగా కాదని ఆ లెక్కన తెలంగాణకు కృష్ణా నది జలాలో 68% వాటా దక్కాలని,ఆ వైపు గా ప్రాజెక్టుల నిర్మాణం కూడా జరగాలని సమైక్య పాలకుల ముంధు బలంగా డిమాండ్ వినిపించారు.సీమాంధ్ర జల దోపిడి  పై ప్రజలను చైతన్యం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినా,అటు వైపుగా ఆచరణలో అడుగులు కూడా పడలేదు.పాలనా పగ్గాలు చేతికందిన తర్వాత ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారనడానికి కింద పేర్కొన్న గణాంకాలే ఇందుకు నిదర్శనం.
కృష్ణా నదీ జలాల పంపిణీ ట్రిబ్యునల్-1 ప్రకారం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నీటి కేటాయింపులు 811 టీఎంసీలు.ఇందులో సీమాంధ్రకు 512(64-65%) టిఎంసిలు,తెలంగాణకు 299(36-37%) టీఎంసీలుగా పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతం యాజమాన్య పరంగా 68% కలిగి ఉన్నప్పటికీ, నీటి కేటాయింపు లు కేవలం 36% మాత్రమే దక్కుతందని,సహజ న్యాయ సూత్రాల ప్రకారం కూడా తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి ఆరు దశాబ్దాలుగా క్రిష్ణా నది జలాలపై జయశంకర్ శాస్త్రీయమైన లెక్కలతో సమాజం ముందు ఉంచుతూ,గొంతెత్తి నినదిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఇందుకు పరిష్కారం అని తేల్చి చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమైక్య పాలనలోకంటే జల దోపిడీ రెట్టింపు స్థాయిలో పెరిగిపోయింది. సంవత్సరాల వారీగా ఏపీకి, తెలంగాణకు (టీఎంసీల)  క్రిష్ణా నది నీటి కేటాయింపులు చూస్తే జయశంకర్ ఆకాంక్షలకు గడ్డపారలతో తూట్లు పొడిచినట్లుగా స్పష్టం గా కనబడుతుంది.
  • 2015-16 ఏ.పి కి 512 టిఎంసీలు,తెలంగాణ కు 299 టిఎంసీలు.
  • 2019-20 ఏపికి 603,తెలంగాణ కు 208 తెలంగాణకు దక్కింది కేవలం 28% మాత్రమే.
  • 2021-22 ఏపికి 592,తెలంగాణ కు 219 దారుణమైన  వినియోగం.
  • 2023-24ఏపీకి 615,తెలంగాణ కు 196 కేవలం 24% మాత్రమే.
ఈ ఏడాది క్రిష్ణా లోకి 1010 టీఎంసీల నీళ్లు రాగా.. ఇందులో ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకు 343 టీఎంసీలు వాడుకోవాలనే నీటి ఒప్పందం జరిగినట్లు సమాచారం. ఏపీ ఇప్పటికే 657 టీఎంసీలు నీరు తరలించుకొని పోయింది. కాని తెలంగాణ 343 టీఎంసీలలో కేవలం 220 టీఎంసీలు మాత్రమే వినియోగించుకుంది. ప్రస్తుతం ఏపీకి 9 టీఎంసీలే  మిగిలి ఉన్నాయి.కాని తెలంగాణకు 123 టీఎంసీలు రావాల్సి ఉంది.ఈ వాటా గురించి రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనే సోయి లేకుండా పోయింది. ఏపీకి నీటి విడుదలను ఆపేసి తెలంగాణ వాటాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేయడంలో విఫలమవుతున్నారు.
విభజన తరువాత  సగటున తెలంగాణ కి దక్కిన వాటా 24% నుండి 28% మాత్రమే, అంటే కేవలం 180-220 టిఎంసీల మధ్యలోనే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు తెలంగాణ కు వచ్చిన వాటా 299 టిఎంసీలు(దరిదాపుగా 36%).రాష్ట్ర ఏర్పాటు తర్వాత దక్కుతున్న వాటా 24% నుండి 28% మాత్రమే. ఈ వివరాలు ఆధారంగా చూస్తే, తెలంగాణకు విభజన తర్వాత సుమారు 80-100 టీఎంసీల వరకు తక్కువ నీరు అందుతుంది. ఇది తెలంగాణ వ్యవసాయం,తాగునీరు,పరిశ్రమల అభివృద్ధిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇందుకోసమేనా.! జయశంకర్ తన జీవితాన్ని త్యాగం చేసింది.ఇలాంటి ఘటనల పట్ల తెలంగాణ సమాజం పునరాలోచన చేయాల్సిన సందర్భం ఇది.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్  ద్వారా సీమాంధ్ర కు విచ్చలవిడిగా నీటిని మళ్లిస్తున్నా అధికారానికి దాసోహమైన తెలంగాణ పాలకులు నీళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో  తెలంగాణ  వాదనలు పరిపాలనలో అసమర్థతను కనబరిచినాయి. ఒకవైపు సీమాంధ్రలో నీటి లభ్యత కు మించి చట్ట విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరించ లేదు,కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడంలో విఫలమైనారు.మరో వైపు క్రిష్ణా  నది కింద తెలంగాణ లో చిన్నవి పెద్దవి కలిపి దాదాపు ఇరువై ప్రాజెక్టులు ఉన్నవి. వీటికి బడ్జెట్ లో నిధులు కేటాయించకుండా,నిర్మాణాలు పూర్తి చేయకుండా దశాబ్ద కాలం పాటు కాలం వెళ్లదీసినారు. ప్రస్తుతం ఏడాదిన్నర పాలన కూడా ఆవైపుగానే సాగుతుంది.
అనాడు కేంద్రంతో అంటకాగుతూ కేంద్రంతో కొట్లాడకుండా తాత్సారం చేశారు.కేంద్రానికి నిర్దిష్టంగా తెలంగాణ తరుపున లేఖలు / అర్జీలు పంపడంలో కూడా ఆలస్యం ప్రదర్శించారు.చంద్రబాబు సహచర్యమా లేక నిర్లక్ష్యమా ఇప్పుడు కూడా అదే స్టబ్ధత కొనసాగుతుంది.గోదావరి నది తీరాన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టినప్పటికీ పారదర్శకత లేకపోవడం, ఖర్చుల మోతాదును మించిపోయే మోసాలు, కృష్ణా-గోదావరి నదులపై వాటాల విషయంలో న్యాయసమ్మతంగా వ్యవహరించలేకపోవడం,ప్రాజెక్టులకు పెట్టిన ఖర్చులు,రైతులకు చేకూరుతున్న  లబ్ధితో పోలిస్తే పరిమితమే. తెలంగాణలో ఏర్పడ్డ తొలి ప్రభుత్వంగాని, ప్రస్తుత ప్రభుత్వం గాని రెండు కూడా జలదోపిడి అరికట్టడంలో విఫలమైనాయి.
-పందుల సైదులు
న్యాయవాది
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *