(గత సంచిక తరువాయి)
3. అంతర్జాతీయ, భారతీయ, తెలుగు సాహిత్య విమర్శలలో మీరు గ్రహించిన మౌలికమైన పోలికలు, విభేదాలు?
-ఒకప్పుటి సాహితీ ప్రియులు ఇతర రాష్ట్రాల సాహిత్యం కూడా చదివేవారు. మన తరానికి రవీంద్రుడు, శరత్ లాంటివాళ్ళు పొరుగురాష్ట్రం వాళ్ళంటే ఇప్పటికీ నమ్మబుద్ధి కాదు. అంతగా పరాయి భాషల సాహిత్యం కూడా చక్కని అనువాదాలతో మన సాహిత్యమే అనిపించేలా మన సంస్కృతిలో భాగమైపోయింది. ఒక తరంలో రష్యన్ జానపదాలు చిన్నారులను అలరిస్తే, కమ్యూనిజం మన రాజకీయాల్ని ప్రభావితం చేసింది. భారతీయ తాత్విక చింతనచేత ప్రభావితమైన విదేశీయులు కోకొల్లలు. పూర్వపు రోజుల్లో సాహిత్యానికి ఎల్లలులేవు, అది సార్వజనీనం. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాహితీ విమర్శ పేరిట ఒకరిమీద ఒకరు విద్వేషాలు చిమ్ముకోవడం, వ్యక్తిగత దూషణలూ- వీటన్నిటికీ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ తేడాలు పెద్దగా ఉండవనే అనుకుంటున్నాను. అన్నిరంగాలకూ విస్తరించిన విషరాజకీయాలకు సాహిత్యం మినహాయింపేమీ కాదు. కానీ నేను చూసినంతలో, సాహిత్యం విషయంలో తెలుగునాట కులమత రాజకీయాలు మిగతా చోట్ల కంటే ఎక్కువనిపిస్తుంది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లో ఆంధ్రా-తెలంగాణా ప్రాంతీయ విభేదాలు కూడా తెరమీదకొచ్చాయి. కానీ సాహిత్య విమర్శకు వీటన్నిటికీ అతీతమైన విశాల దృక్పథం చాలా ముఖ్యం.
దీనికి తోడు తెలుగుతో బాటు సింహభాగం సమకాలీన సాహిత్యం తన సాంస్కృతిక మూలాల్ని వదిలేసి ప్రయాణం చేస్తోందనిపిస్తోంది. ఈ దుస్థితి తెలుగులో మరింత ఎక్కువ. ఎప్పుడైతే అస్తిత్వవాదాల పేరుతో మన చరిత్రనీ, మూలాల్నీ వదిలేసుకున్నామో, అప్పుడే ప్రపంచానికి చెప్పడానికి మన దగ్గర కొత్తకథలేమీ లేనట్లే. ఏ కథైనా పరిణామక్రమంలో సంప్రదాయాన్ని సవాలు చేస్తూ పాత-కొత్తల నడుమ జరిగే సంఘర్షణల నుండి పుట్టాల్సిందే. కానీ ఆ ఘర్షణకు చోటివ్వకుండా, చరిత్రను తిరస్కరిస్తే ఇక కొత్త కథలెక్కడినుంచి పుడతాయి? సాహితీసృష్టికి అత్యంత కీలకమైన “ద్వంద్వానికి” ఆస్కారమెక్కడ? అందుకే ఈరోజుల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న సాంస్కృతికసమృద్ధిలేని డొల్ల సాహిత్యానికి విమర్శ చెయ్యడానికి విమర్శకులకు ఏ ప్రత్యేకార్హతలూ అవసరం లేదు. కాస్త భాష, మరికాస్త వ్యాకరణం వస్తే సరిపోతుంది!
దీనికి ఒక్కటే పరిష్కారం- విమర్శకులకు ‘కరెంట్ ట్రెండ్స్’ తెలిసుండాలంటే తన-పర భేదం లేకుండా కొత్త ఆలోచనలను స్వాగతిస్తూ విభిన్నమైన రచనల్ని విస్తృతంగా అధ్యయనం చెయ్యాలి. రచన నాణ్యతను అంచనా వెయ్యడంలో పారదర్శకత కలిగి ఉండాలి. కానీ అభిమానాలు దురభిమానాలైన ఈ రోజుల్లో, అటువంటి విశాల దృక్పథం కొరవడిందనిపిస్తుంది. నేడు మెజారిటీ పాఠకులు, విమర్శకులు, సమీక్షకులు వీరందరూ తమది కాని సాహిత్యాన్ని చదవడం మానేశారు. ప్రపంచ సాహిత్యం సంగతి వదిలేస్తే , కనీసం ఇరుగుపొరుగు రాష్ట్రాలు, ఇతర భాషల సాహిత్యం కూడా చదవడంలేదు. వేరే సాహిత్యం గురించి ఏ మాత్రమూ తెలుసుకోకుండా, ఎవరికీ వారే తమ సాహిత్యమే గొప్పదని మడికట్టుక్కూర్చుంటున్నారనిపిస్
ఇది నా ప్రాంతం, నా భాష, నా ఊరు, నా దేశం, నా సంస్కృతి, నా కులం, నా మతం, నా జాతి అంటూ మనుషుల్లో కంటికి కనిపించకుండా విషవ్యాధిలా పెరిగిపోయిన సంకుచితత్వాన్ని వదిలించడానికి సాహిత్యంలో కూడా కొందరు పట్టువదలకుండా తమవంతు ప్రయత్నమేదో తాము చేస్తున్నప్పటికీ, అది సముద్రంలో నీటిబొట్టు మాత్రమే. చుట్టూ చూస్తే, ఇది ఇప్పట్లో నయమయ్యే వ్యాధిలా మాత్రం కనబడడం లేదు. అందుకే మొదళ్ళంటా కుళ్ళిపోయిన చెట్లను వదిలేసి, లేత మొలకల మీద దృష్టిపెట్టాలి. ఈ మార్పు వ్యక్తిగత స్థాయి నుండి మొదలవ్వాలి. బహుశా విద్యావ్యవస్థలో కొన్ని సంస్కరణలు జరిగితేగానీ అది సాధ్యం కాకపోవచ్చు!
4. సహృదయ విమర్శకులకి ఉండాల్సిన లక్షణాలను ఆధునికార్ధంలో నిర్వచించగలరా?
ఈ ప్రశ్నకు సమాధానం కూడా దాదాపు పై ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో నే ఉన్నట్లుంది. దానికి మరికొంత కలుపుతాను. న్యాయశాస్త్రంలో నిజానిజాల సంగతి ప్రక్కనపెడితే, సినిమాల్లో అనేక కాల్పనిక కోర్టు సీన్లలో న్యాయాన్యాల విచారణ జరిగేటప్పుడు నేరస్తుడి బంధువుల సాక్ష్యాలు చెల్లవని అంటారు. విమర్శ విషయంలో కూడా పక్షపాతం లేకుండా రచన నాణ్యతను అంచనా వెయ్యాలంటే సాధ్యమైనంత స్నేహితుల, సన్నిహితుల రచనలను విమర్శ చెయ్యకపోవడమే మంచిది. మిత్రులని మొహమాటాలకు పోయి అన్నీ స్తుతివాక్యాలే రాయడం వల్ల రచయిత మరో మెట్టు పైకెక్కడానికి అవకాశం ఇవ్వకుండా, వారిని ఒక ‘కంఫర్ట్ జోన్’లోకి నెట్టేసినవారవుతారు. దానికి తోడు మనకు తెలీకుండానే, సన్నిహితులనే పక్షపాతం వల్ల రచన నాణ్యతను ఎంచడంలో పారదర్శకత లోపిస్తుంది.
ఒకప్పుడు సాహితీ విమర్శ చెయ్యడానికి ప్రత్యేకించి సాహితీ విమర్శకులుండేవారు, రచన గుణదోషాలను నిర్ణయించడానికి కొన్ని ప్రత్యేకార్హతలు కావాల్సొచ్చేది. విమర్శకులు విస్తృతమైన దేశదేశాల సాహిత్యాన్ని చదివిన, ఒకింత ఔపాసన పట్టినవారై ఉండేవారు. వారికి భాషావ్యాకరణాల మీద పట్టు ఉండేది. న్యూయార్క్ మన్హట్టన్ సాహితీ ప్రపంచంలో రచయితలకు ధీటైన ప్రతిపక్షంగా విమర్శకుల కోటరీలు ఉండేవి. విమర్శకులకు, వ్యాసకర్తలకూ కూడా రచయితలకుండేంత పలుకుబడీ, ప్రాతినిధ్యం ఉండేది. సుసాన్ సొంటాగ్ “Interpretation is the revenge of the intellect upon art” అన్నట్లు, కళను విమర్శించడం హేతువాదుల పనిగా భావించేవారు. ఆ విమర్శ కూడా హేతుబద్ధంగా, సాధికారికంగా జరిగేది. ఇప్పుడు గుణదోష విచారణ లేదు. విమర్శ అసలే లేదు. కొంతమంది మిత్రుల, సన్నిహితుల స్తుతివాక్యాలు మాత్రమే ఉంటున్నాయి. దానికి ‘విమర్శ’ అని పేరుపెట్టుకోవడం మనల్ని మనం మభ్యపెట్టుకోవడమే. ఈరోజుల్లో ‘రచన నాణ్యత’ కంటే ‘రచయితకున్న నెట్వర్కింగ్’ అధికశాతం రచన నిలబడడానికి కారణమవుతోంది. ఈ మెజారిటీ తీర్పులకి విలువ శూన్యం.





