పుష్కరకాల ‘త్యాగాల తెలంగాణకు’ ఏమైంది.?

తెలంగాణ అంటే ప్రాంతం పేరు మాత్రమే కాదు. ఉద్యమాలకు  చిరునామా. దశాబ్దాలుగా న్యాయం కోసం,హక్కుల కోసం, ప్రజలు చేసిన పోరాటానికి ఇది ప్రతీక.జూన్ 2 భారత దేశ చరిత్రలో లిఖించదగిన రోజు.ఆరు దశాబ్దాలుగా తండ్లాడిన తెలంగాణ సాకారం అయిన  రోజు.స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం,స్వయం పాలన కోసం, ఆత్మ గౌరవం కోసం, అస్తిత్వం కోసం,ఆధిపత్యం నుండీ విముక్తి కోసం తెలంగాణా ప్రజలు దశాబ్దాలుగా  పరితపించిన తెలంగాణ కల సాకారానికి పుష్కర కాలం అయింది. ప్రపంచంలో ఏ ఉద్యమానికి లేని చరిత్ర తెలంగాణ కు ఉంది.ఉద్యమాలే ఊపిరిగా,పోరాటాలనే స్ఫూర్తిగా తీసుకొని, ఉద్యమం కోసం అన్నింటిని వదులుకొని నిరంతరాయంగా జై తెలంగాణ నినాదాలతో పిడికిలి బిగించి తెలంగాణ గడ్డ నినదించింది.మూడేళ్ళ వయసు నుంచి తొంభై ముదుసలి వరకు తెలంగాణ ను ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణ తన అస్తిత్వం కోసం గళమెత్తింది..
ప్రతి పిడికిలి అగ్ని కణమే
తెలంగాణ సాయుధ పోరాటం కాలం  నుండి   ఉద్యమం సాగినంత కాలం ఇక్కడి ప్రజలు వేగు చుక్కలై బాసటగా నిలిచారు. తెలంగాణ తరతరాలుగా కొంతమంది ఇక్కడి నయవంచకుల సహకారం తో ప్రాంతేతర నేతల మోసాలకు,దోపిడీ కి అన్యాయానికి గురవుతూ వస్తున్న గడ్డ ఇది.అందుకే ఇది ప్రజా ఉద్యమాలకు,త్యాగాలకు కేంద్ర బిందువు అయింది.వేలాది మంది విద్యార్థులు, ఉద్యమకారులు తమ జీవితాలను గాలికి వదిలేసి తెలంగాణ సాధన కోసం పోరాడారు.తెలంగాణ నేలలోంచి గుప్పెడు మట్టిని చేతిలోకి తీసుకుని పలుకరిస్తే అది పాటై ఎన్నో పోరాట గాథలనీ వినిపిస్తుంది.తెలంగాణ లో అక్షరం ముక్క రాని మట్టి మనిషి కూడా పోరాటాలకు పాఠాలు నేర్పిస్తాడు., ఉద్యమాల చేత ఓనమాలు దిద్దిస్తాడు. పాట కోసం ప్రాణాలు ఇస్తాడు. అత్యధిక తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని, తమ భాషా సంస్కృతులను,చరిత్రను పదిలంగా కాపాడుకోవాలని తహతహలాడారు. మొత్తంగా తెలంగాణలోని ప్రతి పిడికిలి అగ్నికణమై గర్జించింది. 2014లో రాష్ట్రంగా ఏర్పడిన ఈ నేల మీద ప్రజలు కొత్త ఆశలతో, ఆకాంక్షలతో జీవించారు.నీళ్లు-నిధులు-నియామకాలు అన్న డిమాండ్ తో దడపుట్టించిన ఈ రాష్ట్రం,ఇప్పుడు పదకొండేళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ, ఆ ‘ఉద్యమ ఆత్మ శ్వాస’ తీసుకోవడానికి తడబడుతుందని చెప్పటం అతిశయోక్తి ఏమి కాదు.
విస్మరణకు గురవుతున్న ఉద్యమ ఆకాంక్షలు
1956 కు ముందు నుంచే వారిలో ఈ స్వాభిమాన భావన బలంగా వుంది. యాభై ఏళ్ళ కింద మొదలైన తెలంగాణ డిమాండ్ ప్రధాన లక్ష్యం నీళ్ళు నిధులు నియామకాలు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ప్రజలు ఒక కొత్త భవిష్యత్తుపై,ప్రత్యామ్నాయ అభివృద్ధి పై ఆశలు పెట్టుకున్నారు.స్వయం పాలన, సమగ్ర అభివృద్ధి, సమాన హక్కులు, సమర్థవంతమైన సంక్షేమం, మరియు ఉమ్మడి వనరులపై న్యాయబద్ధమైన హక్కులు దక్కాలనుకున్నారు. కాని ఈ రోజుకి, రాష్ట్రం ఏర్పడి పుష్కరకాలం కావోస్తున్న తరుణంలో, ప్రజలలోనుంచి వచ్చిన ఆకాంక్షలు  సజీవంగానే ఉన్నాయి.
దశాబ్దాల సీమాంధ్ర దోపిడీ నుండి విముక్తి ఐన తెలంగాణ గడిచిన పదకొండేళ్ల పాలన లో నీళ్ళు, నిధులు, నియామకాలలో అనుకున్న లక్ష్యాలకు చేరువ కాలేదు.
 తెలంగాణ ఉద్యమంలో వ్యక్తమైన ప్రధాన ఆకాంక్షలు సామాజిక న్యాయం,సమానత్వం, స్థానికులకు ప్రాధాన్యత,ఇవన్ని ఆచరణలో దెబ్బతిన్నాయి.ఉద్యమ కాలంలో వ్యక్తమైన ఉద్యోగావకాశాలు, విద్యా సంస్కరణలు, వనరులపై న్యాయపూర్వక నియంత్రణ కొరవడింది.స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలన్న హామీలు కాగితాలకే పరిమితమయ్యాయి.నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపరించింది. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నేటికి కి అమలుకు నోచుకోలేదు. దశాబ్ద కాలం పాలించి ఉద్యమాన్ని నడిపిమని చెప్పుకుంటున్న నాయకత్వం  కావొచ్చు, నేడు అధికారం అనుభవిస్తున్న పాలకులు కావొచ్చు వీరు ఇరువురు కూడా ఉద్యమ ఆకాంక్షలను క్రమ క్రమంగాధ్వంసం చేస్తూ వస్తున్నారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చుకునే దిశగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత తెలంగాణలోని సివిల్ సొసైటీ పైననే ఉన్నది.
అభివృద్ధి అనేది జపం మాత్రమే
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల కుప్పగా మార్చి వేసినారు. రాష్ట్రానికి ఆర్థికంగా మంచి వనరులు ఉన్నప్పటికి  అవి కొన్ని శ్రేణులకే దక్కుతున్నాయి. హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకొని అభివృద్ధి ప్రదర్శన పేరుతో నాటకాలు ఆడుతున్నారు.అభివృద్ధి మంత్రం హైదరాబాద్ చుట్టే తిప్పుతున్నారు.గ్రామీణ ప్రాంతాలని,తండాలను,ఆదివాసీ గూడాలను, పూర్తిగా విస్మరించడం జరిగింది. మెట్రో,ఔటర్ రింగ్ రోడ్లు,రకరకాల ప్రాజెక్టుల పేరిట హైదరాబాద్  నగర
కేంద్రీకుత అభివృద్ధి పైననే చర్చలు చేస్తున్నారు.తండాలవారీగా విద్య, వైద్యం, రవాణా వసతులు రోజురోజుకూ దిగజారుతున్నాయి.పల్లె ప్రజలకు అభివృద్ధి ఒక కలగానే మిగిలిపోయింది.రూరల్ ప్రాంతాల అభివృద్ధి పై దశ దిశ లేదు. నాటి పాలన నుండి నేటి పాలన వరకు ప్రైవేటు విశ్వవిద్యాలయాలకు అడ్డగోలుగా అనుమతులు ఇస్తూ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు పాలకులే స్వయాన పాడేగడుతున్నారు. నేటికీ యూనివర్సిటీలలో వేలాది పోస్టులు ఖాలీగా ఉన్నా భర్తీకి నోచుకోకపోవడం విశ్వవిద్యాలయ పట్ల పాలకులకు ఉన్న చిత్తశుద్ధిని నిరూపిస్తుంది.
పడకేసిన సంక్షేమం
హామీ ఇవ్వబడిన సంక్షేమ పథకాలు, ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, రైతు బీమా,రైతు బంధు,రుణమాఫీ వంటి పథకాలు అనేక మంది పేదలకు అందని స్వప్నాలుగానే ఉన్నాయి. రైతు డిక్లరేషన్,యూత్ డిక్లరేషన్ మైనారిటీ డిక్లరేషన్,ఎస్సీ ఎస్టి డిక్లరేషన్ లు ,పోడు పట్టాల పంపిణీ,ఫోటోలలో
మాత్రమే కనిపిస్తున్నాయి. ఆచరణకు నోచుకోలేదు.మధ్యతరగతి ప్రజల కష్టాలు పెరిగిపోయాయి.ప్రభుత్వ హాస్పిటల్స్ ల్లో నాణ్యమైన వైద్యం దొరకడం లేదు,కార్పొరేట్ కబంధ హస్తాలలోకి విద్య,వైద్యం వెళ్లిపోయింది.విద్య, వైద్యం భారం విఫరీతంగా పెరిగిపోయి అందని ద్రాక్ష గానే మారిపోయింది.ప్యూఛర్ సిటీ, స్మార్ట్ సిటీ ల పేరుతో  వ్యవసాయ భూములు, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతుండటం వలన రైతులు మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడతున్నారు. వేయిలకోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తున్నారు.సంక్షేమ పథకాలు అసంపూర్తిగానే కొనసాగుతున్నాయి. హమీలకు ఆచరణకు పొంతన లేకుండా పోయింది.
అస్తవ్యస్తమైన పాలన
తెలంగాణ ఏర్పాటుతో పాలనా పద్ధతుల్లో మార్పు వస్తుందని ఆశించిన ప్రజలకు నిరంతరం నిరాశే ఎదురవుతుంది.గత పాలనలోని  అధికార కేంద్రీకరణ,విధ్వంసక అభివృద్ధి నమునాలు,ప్రజలపై ఆజామాయిషి,అధికార నేతల చేతులలో పోలీసు వ్యవస్థ,ఇప్పుడు యథాతథంగా తెలంగాణలో మరింత తీవ్రమయ్యాయి.నియోజకవర్గాలల్లో ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయడం కన్నా రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. ప్రజల ఫిర్యాదులు, సమస్యలు అధికారుల డెస్కులపై విసిరేయబడి పరిష్కారం లేని పునరావృతమవుతున్న కథలుగా మారిపోయాయి.పేదల ఎజెండా ను వెలుగెత్తి చాటుతున్న నక్సలైట్ల అజెండా ను అమలు పరుస్తానని అమలులోకి వచ్చిన ఫక్తూ రాజకీయ పార్టీ  అధికారంలోకి వచ్చి అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు.ప్రజలు నిరంకుశ పాలనకు పాడేకట్టి కాంగ్రెస్ ని అధికారంలోకీ తీసుకొస్తే ప్రజా ఆకాంక్షలకు అద్దంపట్టే విధంగా ప్రజా పాలన అందిస్తామని చెప్పిన వారు దారం తెగిన పతంగి లాగా పాలన ఎటుపోతుంధో వారికే అంతు చిక్కడం లేదు.వేలాది మంది అనుభవించిన నిర్బంధాలు వందలాది బలిదానాల తో సాకారమైన తెలంగాణలో అదే సీమాంధ్ర దోపిడి తిష్టవేసుకొని కూర్చుంది.పోరాడిన ఉద్యమకారులు వీధిన పడ్డారు.దళిత ముఖ్యమంత్రి నినాదం మరుగున పడింది,ధర్నా చౌక్ కు మంగళం పాడారు.ప్రాజెక్టుల పేరుతో ధన దోపిడి జరిగింది.పౌర హక్కుల హననానికి పాల్పడ్డారు.పాలకులు మారినా పాలనా విధానాలలో మార్పురాక పోగా దోపిడీ మరింత తీవ్రతరమైంది.
పుష్కర కాలమైనా తెలంగాణపై ఇంకా సవతి తల్లి ప్రేమే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన సందర్భంలో విభజన హామీల లో భాగంగా తెలంగాణకు ఇచ్చిన ఏ హామీ కూడా సంపూర్ణంగా కేంద్రం నెరవేర్చలేదు. పోలవరం ముంపు పేరిట తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఏడు మండలాలను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడం తెలంగాణ ప్రజల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీయటమే. నేటిక మండలాలను తెలంగాణ ప్రాంతానికి అప్పజెప్పకపోవడం తెలంగాణ ప్రాంతం పట్ల బిజెపికి ఉన్నటువంటి వైఖరి ఏమిటో స్పష్టమవుతుంది. కృష్ణానది జలాలలో తెలంగాణకు దక్కాల్సినటువంటి వాటాను నేటి కూడా పరిష్కరించకపోవడం కేంద్రం నిరంకుశ వైఖరికి అడ్డం పడుతుంది. తెలంగాణలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ప్రకటించకపోవడం శోచనీయం.విభజన సమయంలో ఆంధ్రాకు కేటాయించబడ్డ తెలంగాణ ఉద్యోగులను నేటి కూడా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకపోవడం బిజెపి మొండితనం. బయ్యారం ఉక్కు కర్మాగారం పై ఇంతవరకు ఊసే లేదు.2014 లో తెలంగాణకు మంజూరైన ఐటిఐఆర్ ప్రాజెక్టును ఉపసంహరించుకున్నారు. కేంద్ర బడ్జెట్ లోను తెలంగాణ పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణ పట్ల వివక్షతలను పాటిస్తున్నట్లు స్పష్టంగా కనపడుతుంది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి బిజెపి ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తుంది.
ఉద్యమ స్పూర్తిని రగిలించాల్సిన సందర్భం
ప్రజాప్రతినిధులు ప్రజలకు దూరమవుతున్నారు.పాలనలో పారదర్శకత లేమి,రాజకీయ కుటుంబాల పునాదులపై ఆధారపడిన నైతికమైన విచ్ఛిన్నత ఇవన్ని తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని వంచిస్తున్నది. తెలంగాణ ఉద్యమం ద్వారా ఆశించిన స్వరాజ్యం  ప్రజల చేతులలో పాలన, వారి సంక్షేమం కోసం పని చేసే వ్యవస్థ,ఆ ఆశయాలకు నిఖార్సైన ద్రోహం జరుగుతుంది. ఉద్యమం ద్వారా వచ్చిన నాయకులు ప్రభుత్వాన్ని అస్త్రంగా మార్చుకొని,అదే ప్రజలను అణగదొక్కడంలో వినియోగిస్తున్నారు. ఇది ఉద్యమ ఆత్మను పాతాళానికి నెట్టే చర్య.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో ప్రజలు కలలు కన్నట్లే కాదు, త్యాగాలు చేశారు. కానీ వారి ఆశయాలు పరిత్యజించబడ్డాయి.పాలకుల నిర్లక్ష్యం,తప్పుడు ప్రాధాన్యతలు, ప్రజలపై దృష్టి లేని అభివృద్ధి,మొత్తం గా ఉద్యమ స్ఫూర్తిని మసకబార్చేశాయి.
త్యాగాల తెలంగాణలో స్తబ్దత కనపడుతుంది,తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మళ్ళీ జాగృతం చేయాల్సిన అవసరం పౌర సమాజం పై ఉంది,నూతన ఉద్యమ
మార్గాలపై అన్వేషిస్తూ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయడం ద్వారానే ఉద్యమ ఆకాంక్షలను,ప్రజా డిమాండ్లను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.ఆ వైపుగా ప్రజా చైతన్యం కూడగట్టడానికి ప్రజాసంఘాలు సిద్ధం కావడంతో పాటు ప్రజలలో సామూహిక చైతన్యాన్ని తీసుకురావాలి.
-పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *