ఇక ఆపరేషన్ సింధూర్ తర్వతా మనదేశానికి, యు.ఎస్.కు మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్ చేసిన విచారణ బోయింగ్ సంస్థలకు అనుకూలంగా, యు.ఎస్. ప్రభుత్వాన్ని బుజ్జగించే రీతిలో కొనసాగిందనేది కొందరు విమర్శకుల అభిప్రాయం. ముఖ్యంగా బోయింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన విపరీత ఒత్తిడి కూడా ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. బోయింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీ సంస్థ. అంతర్జాతీయంగా దీనికున్న పేరు ప్రఖ్యాతులతో పాటు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సంస్థ వెన్నుదన్నుగా ఉంది . ఒకరకంగా చెప్పాలటే ప్రపంచ విమానయాన రంగానికి రారాజుగా బోయింగ్ వెలుగుతోంది.
రోజూ ఉదయించే సూర్యుడు తన లేలేత కిరణాలతో అప్పటివరకు భూమిపై పరచుకున్న చీకట్లను పార ద్రోలి తన వెలుగులతో నింపుతాడు. కోడిపుంజు కూడా రోజూ పొద్దున్నే లేచి కూస్తుంది. తాను కూయడంవల్ల నే చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరిస్తున్నాయని అది భావిస్తుంది. ఫ్లైట్ నెం.171 ప్రమాదానికి సంబంధించి ఎయర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగే షన్ బ్యూరో (ఏఏఐబీ) ఇచ్చిన నివేదిక కోడిపుంజు మాదిరిగా ఉన్నది తప్ప సూర్యుడి మాదిరిగా లేదు! ఇది అసలు నిజాలను వెలికి తీయాల్సింది పోయి, అసంపూర్తి వివరాలతో ఈ ప్రమాదంపై మరింత అస్పష్టతకు, గందరగోళానికి తెరతీసింది. ప్రమాదానికి ముందు పైలెట్లు ఏం మాట్లాడుకున్నారనే దానిపై వెల్లడించిన వివరాల్లో ఎంతమాత్రం స్పష్టత లేదు. నివేదికలో బయటపెట్టిన పైలెట్ల అసంపూర్తి మాటలను పరిశీలిస్తే అసలు నిజాన్ని మరుగుపరచి, ఇదేంటని ప్రశ్నించినవారిని దేశద్రోహులు అని ముద్రవేసే విధంగా వుంది. ఈ గందరగోళం, అస్పష్టత కారణంగా అసలు నివేదిక విడుదల చేసిన ఉద్దేశమేంటనే ప్రశ్న ఉదయిస్తోంది. పైలెట్ల మధ్య జరిగిన పూర్తి సంభాషణను వెల్లడించడంలో ఈ నివేదిక పూర్తిగా విఫలమవడంవల్ల, సమాచారం అసంపూర్తగా, గందరగోళంగా మారిపోదని నిపుణుల అభిప్రాయం. ఫలితంగా ప్రమాదానికి ఎవరు కారణమనేది ఇప్పటికీ స్పష్టం కాలేదు.
ఇంధన స్విచ్‌లు “రన్ పొజిషన్” లోకి మారిన కొద్ది సెకండ్లలోనే విమానం కూలిపోయిందని సమాచారం వెల్లడిస్తోంది. పి.ఆర్. విడుదలైన తర్వాత మీడియాలో ఒక సెక్షన్ మరియు సోషల్ మీడియాలో పైలెట్ల పాత్రపై పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. దీంతో ఇండియన్ కమర్షియల్ పైలెట్స్ అసోసియేషన్ తక్షణమే రంగంలోకి దిగి క్రూ సభ్యులకు అనుకూలంగా ప్రకటన జారీచేయాల్సివచ్చింది. ముఖ్యంగా పైలెట్లు సంక్లిష్ట పరిస్థితుల్లో ఏవిధంగా వ్యవహరించాలో శిక్షణా కాలంలో నేర్పిన దాని ప్రకారమే నడుచుకున్నారని స్పష్టం చేసింది. లేనిపోని ఊహాగానాలతో మరణించిన పైలెట్లు, వారి కుటుంబాలకు ఇబ్బందులు సృష్టించవద్దని పేర్కొంది. విడుదల చేసిన కాక్‌పిట్ సంభాషన వివరాలు అసంపూర్తిగా ఉండటంతో వాల్‌స్ట్రీట్ జర్నల్, బీబీసీ, రాయ్‌టర్స్, డైలీమెయిల్ వంటి మీడియా సంస్థలు నివేదికను తమకు తోచిన రీతిలో చేసిన వ్యాఖ్యలు పైలెట్లను వేలెత్తి చూపేవిగా ఉన్నాయి. ఈ విధమైన వ్యాఖ్యలు ఇప్పటికే వాణిజ్య విమానాల తయారీపరమైన లోపాల ఆరోపణలు ఎదుర్కొంటున్న బోయింగ్ సంస్థకు ఊరట కలిగించవచ్చు.
ఇక ఆపరేషన్ సింధూర్ తర్వతా మనదేశానికి, యు.ఎస్.కు మధ్య సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నమాట వాస్తవం. ఈ నేపథ్యంలో భారత్ చేసిన విచారణ బోయింగ్ సంస్థలకు అనుకూలంగా, యు.ఎస్. ప్రభుత్వాన్ని బుజ్జగించే రీతిలో కొనసాగిందనేది కొందరు విమర్శకుల అభిప్రాయం. ముఖ్యంగా బోయింగ్‌తో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన విపరీత ఒత్తిడి కూడా ఇందుకు కారణమని వారు చెబుతున్నారు. బోయింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద విమాన తయారీ సంస్థ. అంతర్జాతీయంగా దీనికున్న పేరు ప్రఖ్యాతులతో పాటు, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఈ సంస్థ వెన్నుదన్నుగా ఉంది . ఒకరకంగా చెప్పాలటే ప్రపంచ విమానయాన రంగానికి రారాజుగా బోయింగ్ వెలుగుతోంది.
ఈ సంస్థ తయారీ 737, 787, సైనిక విమానాలు, ఎఫ్-15, బ-22 ఓస్ప్రే, వంటివి అంతర్జాతీయంగా యు.ఎస్. పలుకుబడి బలీయంగా ఉండటానికి కారణమవుతున్నాయి. అంతే కాకుండా యు.ఎస్.లో రాజకీయ పార్టీలకు అవసరమైన నిధులు సమకూర్చడంతో పాటు, అత్యంత శక్తివంతమైన రీతిలో లాబీయింగ్‌ను నడపగలదు. ఆ విధంగా అమెరికా ప్రభుత్వంపై బోయింగ్ ప్రభావం చాలా ఎక్కువ. అయితే ఇటీవల బోయింగ్ సంస్థ విమానాల తయారీలో అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు విమర్శలకు గురవుతున్నాయి. ఆర్థికం కంటే ప్రజల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తామని చెప్పుకునే యు.ఎస్. విధానకర్తలకు ఈ పరిణామాలు మింగుడుపడటంలేదు.
ఇప్పుడు ఏఏఐబీ ప్రాథమిక నివేదికను చూస్తుంటే, బోయింగ్ దాని సహచర సంస్థల ప్రతిష్టను దెబ్బతీయకుండా, భారతీయ పైలెట్లపైనే తప్పంతా నెట్టేస్తే పోతుందన్న రీతిలో ఉంది. ఇప్పటికే 737 మాక్స్ కూలిపోవడం (ఇండొనేషియా మరియు ఇథియోపియాల్లో), 2024లో అలాస్కా ఎయిర్‌లైనర్ తలుపు ప్లగ్ ఊడిపోయిన సంఘటన వంటివి బోయింగ్ సంస్థ పనితీరుపై అనుమానాలు రేకెత్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ పైలెట్స్ అసోసియేషన్ ఒక ప్రకటన చేస్తూ, కేవలం బోయింగ్ సంస్థ ప్రతిష్టను కాపాడటానికే పైలెట్లపై నెపం నెట్టేవిధంగా ఏకపక్షంగా నివేదికను తయారుచేశారని ఆరోపించింది. బోయింగ్ మార్కెట్‌ను కాపాడటానికి, రక్షణ కాంట్రాక్టులకు సంబంధించి యు.ఎస్. ప్రయోజనాల పరిరక్షణలో భాగమే ఈ నివేదిక రూపకల్పన అని కొందరు విమర్శకుల అభిప్రాయం. అయితే తప్పును ఇతరులపై నెట్టే చరిత్ర బోయింగ్‌కు ఉన్నదని వీరు గుర్తుచేస్తున్నారు.
737 మాక్స్ విమానం కూలిపోయినప్పుడు తప్పు పైలెట్లదేనని ముందుగా చెప్పినప్పటికీ, సాఫ్ట్ వేర్ లోపమని తర్వాత విచారణలో తేలింది. ఈవిధంగా బోయింగ్ తన జవాబుదారీతనం నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నిస్తుంది. ఇటువంటి పరిణామాలు నిఘావేగులు, విశ్లేషకులు బోయింగ్ సంస్థ అనుసరించే భద్రతా ప్రమాణాల్లో లోపాలను విశ్లేషించి ఎత్తిచూపడం మొదలైంది. ప్రస్తుతం బయటపెట్టిన ప్రాథమిక నివేదిక పైలెట్లపై నెపం మోపితే, సంస్థ కార్పొరేట్ ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదన్న రీతిలో రూపొందించారా అన్న అనుమానాలు రేకెత్తించేదిగా ఉన్నది. ఇక తుది నివేదిక రావడానికి ఏడాదికి పైగా పట్టవచ్చు. అప్పటివరకు పైలెట్ల కుటుంబాలు, బాధితుల కుటుంబాలు అనిశ్చితిలో కాలం వెళ్లబుచ్చాల్సిందే.
మరణించిన పైలెట్లు తమను సమర్థిస్తూ వాదించలేరు. ఇక వారి కుటుంబాలు తగిన న్యాయం కోసం పోరాటం కొనసాగించాల్సిందే. అయితే అసంపూర్తి నివేదిక వల్ల గందరగోళం ఏర్పడి, అనవసర ఊహాగానాలకు, ఉద్వేగాలకు దారితీస్తుంది. బాధిత కుటుంబాలు, ప్రజలు ఈ విషయంలో మరింత స్పష్టతను కోరుకుంటున్నారు. దేశం యావత్తూ అసలు నిజం కోసం డిమాండ్ చేస్తున్నప్పుడు కోడి కూత కాదు సమాధానం, సూర్యోదయం మాత్రమే!
-శామ్ సుందర్





