అది మన సంప్రదాయం.. విధానం కూడా
వీర సైనికులు అందరికీ సెల్యూట్
ప్రపంచమంతా మార్మోగిన ఆపరేషన్ సింధూర్ నినాదం
యుద్ధ క్షేత్రంలో జై భారత్ మాతా నినాదాలు
ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించిన మోదీ
సైనికులకు సెల్యూట్ చేసి ముచ్చటించిన ప్రధాని
ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం.. మన సంప్రదాయం.. మన విధానమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు గొప్ప ప్రేరణ అని ఆయన అభివర్ణించారు. ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ తాను సెల్యూట్ చేస్తున్నారన్నారు. వీర సైనికుల పరాక్రమంతో ఆపరేషన్ సింధూర్ నినాదం.. ప్రపంచమంతా మార్మోగు తోందని తెలిపారు. మంగళవారం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా సైనికులతో ఆయన మాట్లాడారు. అనంతరం సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. మన సైన్యం చేపట్టిన ఈ పరాక్రమం.. భారత్ సామర్థ్యానికి ప్రతి రూపమని పేర్కొన్నారు.
భారత్ చూపిన ఈ పరాక్రమం.. త్రివిధ దళాల త్రివేణీ సంగమమన్నారు. పాకిస్థాన్‌కు భారత వాయుసేన తన సత్తా చాటిందంటూ ప్రశంసల జల్లు కురిపించారు. యుద్ధ క్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశామని.. ఈ జయ జయ ద్వానాలు ప్రపంచమంతా విన్నదని ఆయన గుర్తు చేశారు. భారత్ మాతాకీ జై అనేది ప్రతీ పౌరుడి నినాదమని ప్రధాని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అణు బాంబు హెచ్చరికలను సైతం చిత్తు చేశామని చెప్పారు. దేశంలోని ప్రతీ పౌరుడూ గర్వపడేలా రు చేశారంటూ సైనికులను ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు. రందరూ చరిత్ర సృష్టించారంటూ సైనికులను వెన్నుతట్టి ప్రోత్సహించారు. కోసమే నేను ఇక్కడికి వచ్చానని చెప్పారు. వీరులను చూసినప్పుడు జీవితం ధన్యమవుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.’భారత్ మాతాకీ జై’ నినాదం శత్రువుల చెవుల్లో గింగిరాలు తిరుగుతోందని ప్రధాని మోదీ అన్నారు. అది శత్రువుల వెన్నులో వణుకు పుట్టించిందని వ్యాఖ్యానించారు.
ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మన సైన్యం శపథం చేసింది. మన సైన్యం చూపిన శక్తిసామర్థ్యాలకు ఎన్ని ప్రశంసలు చేసినా తక్కువే. అణు బ్లాక్‌మెయిల్‌ను అపహాస్యం చేసింది. భారత శక్తిసామర్థ్యాలు చూసి నా జీవితం ధన్యమైంది. యుద్ధక్షేత్రంలోనూ భారత్ మాతాకీ జై నినాదాలు చేశాం. ఆకాశం నుంచి పాతాళం వరకు ఆ నినాదం మార్మోగింది. ఈ భూమి నుంచి వీర సైనికులు అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ప్రతి భారతీయుడు సైన్యానికి మద్దతుగా నిలబడ్డాడు. భారత సేనలకు కృతజ్ఞతలు చెప్తున్నాడు. ధర్మసంస్థాపన కోసం ఆయుధం పట్టడం మన సంప్రదాయం.. మన విధానం. మన అక్కాచెల్లెళ్ల నుదుటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశాం అని ప్రధాని ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఆపరేషన్ సిందూర్, భారత్-పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ఆయన పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా మన భద్రతా బలగాలు ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించాయి.
అది జీర్ణించుకోలేని పాకిస్థాన్ మే 9, 10వ తేదీల్లో దాడులకు యత్నించింది. అయితే వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాయాది టార్గెట్ చేయాలని యత్నించిన వాటిలో ఆదంపుర్ వైమానిక స్థావరం కూడా ఒకటి. ఈ ఉదయం నేను ఆదంపుర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లాను.
అక్కడ మన పోరాటయోధులను కలిశాను. ధైర్యం, దృఢ సంకల్పానికి ప్రతిరూపంగా నిలిచేవారితో మాట్లాడటం ఒక ప్రత్యేక అనుభవం. మన దేశ రక్షణ కోసం బలగాలు చేసే ప్రతిచర్యకు ప్రజలందరూ ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటారని ఎక్స్ వేదికగా మోదీ రాసుకొచ్చారు. అలాగే వారితో దిగిన చిత్రాలను షేర్ చేశారు. అక్కడికి వెళ్లి పాక్ చేసిన తప్పుడు సమాచారాన్ని తిప్పికొట్టారు. వాయుసేన సిబ్బందితో ముచ్చటించి భుజం తట్టారు. ఆపరేషన్ వివరాలను మోదీకి బలగాలు వివరించాయి. గంటన్నరకు పైగా ఆయన అక్కడే గడిపారు. ఆ సమయంలో ఆయన ధరించిన టోపీపై త్రిశూల్ చిత్రం కనిపించింది.
ఆపరేషన్ సింధూర్ గురించి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మరుసటిరోజు మోదీ ఈ పర్యటన చేపట్టారు. నిన్న ప్రధాని మాట్లాడుతూ.. భారత్ ప్రళయభీకర దాడులను తట్టుకోలేకే పాకిస్థాన్ చివరకు కాల్పుల విరమణ పేరుతో కాళ్లబేరానికి వచ్చిందని వెల్లడించిన సంగతి తెలిసిందే. నవయుగ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ మట్టి కరిపించిందని, వారు సరిహద్దుల్లో యుద్ధానికి దిగితే మనం వాళ్ల గుండె పైనే కొట్టగలిగామన్నారు. ఆ దేశ ప్రవర్తనను పరిశీలిస్తామని, మున్ముందు ఏమాత్రం తేడా వచ్చినా ఊరుకోబోమని హెచ్చరించారు. పహల్గాంలో ఉగ్రవాదులు వికృత క్రూరత్వాన్ని ప్రదర్శించి.. కుటుంబ సభ్యుల ముందే అమాయక ప్రజలను చంపినందుకు ప్రతీకారంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర సౌధాలను కుప్పకూల్చి 100 మందికి పైగా పేరుమోసిన ఉగ్రవాదులను అంతమొందించినట్లు- ప్రకటించారు. ఆ దేశంతో చర్చలంటూ జరిగితే ఉగ్రవాద నిర్మూలన, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాత్రమేనని స్పష్టంచేశారు.
భారతదేశాన్ని, ప్రజలను రక్షించుకోవడానికి ఎంతపెద్ద నిర్ణయం తీసుకోడానికై•నా వెనుకాడబోమని పాక్‌కు తేల్చిచెప్పారు. ప్రధాని మోదీ షేర్ చేసిన చిత్రాల్లో చెక్కు చెదరకుండా ఉన్న ఎస్-400 రక్షణ వ్యవస్థ కనిపించింది. ఆదంపుర్‌లోని ఎస్-400 స్థావరాన్ని ధ్వంసం చేశామని పాక్ ప్రచారం చేసింది. భారత్‌లోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విద్యుత్తు.. సైబర్ వ్యవస్థలపై దాడి చేసి ధ్వంసం చేశామని చెప్పింది. ఇదంతా హేయమైన దుష్ప్రచారం అని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మోదీ దాయాది తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టారు. అలాగే భద్రతాబలగాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఈ పర్యటన ద్వారా గట్టి సందేశం ఇచ్చారు


