మళ్ళీ యుద్ధ మేఘాలు… ఆర్థిక తుఫాను?

   ప్రపంచ రాజకీయ వేదికపై మళ్లీ ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. ఇస్లామాబాద్‌లో జరిగిన శాంతి చర్చలు విఫలమవడంతో అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధ దిశగా మళ్లుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ప్రపంచానికి తాత్కాలిక ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఆ ఉపశమనం స్వల్పకాలమే ..! ఇప్పుడు పరిస్థితి మరింత క్లిష్టంగా మారి, దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.

శాంతి చర్చలు విఫలమయ్యాయి అనేది కేవలం రాజకీయ పరిణామం మాత్రమే కాదు; అది ప్రపంచ మార్కెట్లకు ఒక పెద్ద షాక్. స్టాక్ మార్కెట్లు, కరెన్సీ వ్యవస్థలు, ఇంధన ధరలు ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న అంశాలు . యుద్ధం పొడిగిస్తే దాని ప్రభావం కేవలం యుద్ధ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఇది మరింత ప్రభావం చూపే ప్రమాదం  ఉంది.

    భారతదేశం 90 శాతం చమురును దిగుమతి చేసుకుంటోంది. ఇందులో గల్ఫ్ ప్రాంతం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ద్వారా భారతదేశానికి వొచ్చే చమురు, ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీ సరఫరాలు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఈ మార్గంలో అంతరాయం కలిగితే, దేశంలో ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. చమురు ధరలు పెరగడం అంటే కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాదు. అది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరుగుతాయి, ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది, చివరికి వినియోగదారుడిపై భారంగా మారుతుంది. ఒక డాలర్ చమురు ధర పెరిగినా భారతదేశానికి వేల కోట్ల రూపాయల అదనపు భారమవుతుంది.

యుద్ధ పరిస్థితుల్లో ప్రభుత్వాల ముందున్న ప్రధాన సవాలు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. అదే సమయంలో వడ్డీ రేట్లు పెంచాల్సి వొస్తుంది. దీని వల్ల పెట్టుబడులు తగ్గి ఆర్థిక వృద్ధి మందగిస్తుంది. ఇక్కడే ప్రభుత్వం ఒక సున్నితమైన సమతుల్యతను పాటించాలి. పేద ప్రజలపై భారాన్ని తగ్గించడానికి సబ్సిడీలు ఇవ్వాలి, కానీ అదే సమయంలో ఆర్థిక లోటును నియంత్రించాలి. ఇది ఒక క్లిష్టమైన సమీకరణం.ఇటీవల భారత స్టాక్ మార్కెట్ కొంత పుంజుకున్నప్పటికీ, ఇప్పుడు మళ్లీ అనిశ్చితి నెలకొంది. విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. ఇది మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతోంది. రూపాయి విలువ పడిపోవడం మరో ఆందోళనకర అంశం. డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు పెరుగుతుంది. ఇది మళ్లీ ద్రవ్యోల్బణాన్ని పెంచే దిశగా దారి తీస్తుంది.

ప్రపంచీకరణ యుగంలో ఒక ప్రాంతంలో జరిగిన యుద్ధం మరొక ప్రాంతంలో సరఫరా సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా చిన్న పరిశ్రమలు, అసంఘటిత  రంగం తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఉత్పత్తి నిలిచిపోవడం, సరఫరా ఆలస్యం, ఖర్చుల పెరుగుదల వంటి తీవ్ర పరిణామాలు సామాన్యుల జీవన విధానం పై ప్రతికూల ప్రభావం చూపుతుంది  ఇప్పటి వరకు భారతదేశం 7 శాతం పైగా వృద్ధిని కొనసాగిస్తూ ప్రపంచంలో ఒక స్థిరమైన ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. అయితే ఈ యుద్ధ పరిస్థితులు ఆ వృద్ధిని పరీక్షించే అవకాశం ఉంది.ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇంధన నిల్వలను పెంచడం,ప్రత్యామ్నాయ సరఫరా మార్గాలను అన్వేషించడం,పేద ప్రజలకు రక్షణ చర్యలు తీసుకోవడం,మార్కెట్ లలో  స్థిరత్వం తీసుకురావడం వంటి చర్యలు  వేగంగా మరియు సమర్థంగా  తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ కూడా కరెన్సీ స్థిరత్వం కోసం జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక అస్థిరతను నియంత్రించేందుకు తగిన విధానాలను అమలు చేయాలి.

ప్రస్తుతం ప్రపంచం ఒక కీలక మలుపులో ఉంది. యుద్ధం వైపు వెళ్లాలా? లేక శాంతి దిశగా అడుగులు వేయాలా? అనే ప్రశ్న ఎదుర్కొంటోంది. ఈ నిర్ణయం కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు; అది ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. భారతదేశం వంటి దేశాలు ఈ పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తూ, తమ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలి. ఒకవైపు ప్రపంచ సంక్షోభం, మరోవైపు దేశీయ సవాళ్లు—ఈ రెండింటినీ సమర్థంగా ఎదుర్కొనే సమయం ఇది.  యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు. దౌత్యపరమైన చర్చలే శాశ్వత శాంతికి దారి తీస్తాయి. అమెరికా–ఇరాన్ మధ్య విభేదాలు చర్చల ద్వారా పరిష్కారం కావాలి. ప్రపంచ సమాజం కూడా దీనికి సహకరించాలి. యుద్ధం కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం తప్పదు. అందువల్ల అన్ని దేశాలు శాంతి దిశగా ప్రయత్నాలు చేయాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *