వియత్నాం పర్యటన -3

“హోయ్ నదిలో ఇరవై నిముషాలు ప్రడవ ప్రయాణం చేసాము. రంగు రంగుల కాగితపు లాంతర్లలో దీపాలను ఉంచి నదిలో వదిలాము. ప్రతి పౌర్ణమి రోజు చుట్టూ ఉన్న విద్యుద్దీపాలను కూడా ఆర్పేసి లాంతర్ల పండుగ చేస్తారని గైడ్ చెప్పాడు. ఈ సాంప్రదాయం చైనీస్, జపనీస్ సంస్కృతితో వచ్చింది. నదిలో లాంతరు దీపాలను వదలడం వల్ల తమ కోరికలు తీరుతాయని, శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. అందుకే దానిని ‘ హోనాయ్ లాంతరు గ్రామం ‘ అని కూడా పిలుస్తారు.”

గిరియానం  – 14

దనాoగ్  నగరంలో సాయంత్రం మేము హోయిన పురాతన పట్టణానికి వెళ్ళాము. అది యునెస్కో గుర్తించిన వారసత్వ ప్రదేశం. చైనీస్ జపనీస్ సంస్కృతిని తెలిపే ప్రాచీన నిర్మాణాలు అక్కడ ఉన్నాయి. జపనీస్ కవర్డ్ వంతెన కూడా ఉంది. ఆ వంతెన మీద ఒక అమ్మాయి హా చుమ్ వాయిస్తూ కనిపించింది. అది స్థానిక వాయిద్య పరికరం. ఆ అమ్మాయి పేరు లీ. దాని పైనుంచి మేమూ ఆవలి తీరానికి వెళ్ళాము.ఆ ప్రదేశాన్ని ప్రత్యేకంగా రాత్రి సమయంలోనే చూడాలి. విద్యు ద్దీపాల వెలుగులో పసుపు రంగు నిర్మాణాలు బంగారు భవనాలలాగా మెరిసిపోతాయి. హోయ్ నదిలో దీపాల కాంతులతో తిరిగే చిన్న చిన్న పడవలు నక్షత్రాలతో కూడిన ఆకాశం భువికి చేరిందా! అనే భ్రమ కలిగిస్తుంది.అది ప్రాచీన కాలంలో అది ప్రసిద్ధ వాణిజ్య కేంద్రం. ఆ నది చుట్టూ నడక చరిత్ర తెలిసిన పర్యాటకులను గతంలోకి తీసుకుపోతుంది. ఆ తర్వాత హోయ్ నదిలో ఇరవై నిముషాలు ప్రడవ ప్రయాణం చేసాము. రంగు రంగుల కాగితపు లాంతర్లలో దీపాలను ఉంచి నదిలో వదిలాము. ప్రతి పౌర్ణమి రోజు చుట్టూ ఉన్న విద్యుద్దీపాలను కూడా ఆర్పేసి లాంతర్ల పండుగ చేస్తారని గైడ్ చెప్పాడు. ఈ సాంప్రదాయం చైనీస్, జపనీస్ సంస్కృతితో వచ్చింది. నదిలో లాంతరు దీపాలను వదలడం వల్ల తమ కోరికలు తీరుతాయని, శుభం కలుగుతుందని స్థానికుల నమ్మకం. అందుకే దానిని ‘ హోనాయ్ లాంతరు గ్రామం ‘ అని కూడా పిలుస్తారు.

ఈ రోజు మా వియత్నాం టూర్ లో చాలా ప్రత్యేకమైంది. ఉదయమే బ్రేక్ ఫాస్ట్ చేసి మేము బానా పర్వతాలకు వెళ్ళాము. పూర్వం వీటిని బనాన హిల్స్ అని పిలిచేవారట. రెండు గంటల ప్రయాణం. సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో ఉంది. వాతావరణం చల్లగా ఆహ్లాదకరంగా ఉంది. దట్టంగా పొగమంచు కమ్ముకొని ఉంది. అడపా దడపా చిరు జల్లులు కూడా కురిసాయి. అక్కడ ప్రపంచం లోనే అత్యంత పొడవైన, ఎత్తైన కేబుల్ కార్ ప్రత్యేకం. కేబుల్ కార్ ఎక్కడం కొరకు మేము ఐదారు లెస్కలేటర్స్ ఎక్కి వెళ్ళవలసి వచ్చింది. అది సింగిల్ ట్రాక్ మీద వెళుతుంది. ఆ విధంగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకుంది. ఒక క్యాబిన్ లో ఆరు నుంచి ఎనిమిది మంది కూర్చోవచ్చు. కేబుల్ కార్ సేవలు 2013 లో మొదలయ్యాయట. ప్రస్తుతం ఐదు ట్రాకులు నడుస్తున్నాయి. మరిన్ని ట్రాకుల కొరకు పనులు జరుగుతున్నాయి. దానిని సన్ వరల్డ్ సంస్థ వాళ్ళు నిర్వహిస్తున్నారు. అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తుంది కాబట్టి ఎలాంటి భయమూ ఉండదు. టికెట్ ధర పదిలక్షల వియత్నాం డాలర్స్. ఐదు కిలోమీటర్ల దూరం, సుమారు 5800 మీటర్ల ఎత్తులోకి ఈ ప్రయాణం సుమారు ఇరవై నిమిషాలు సాగుతుంది.  అదొక అద్భుతమైన అనుభవం. మేఘలలోకి దూసుకుపోతున్న అనుభూతి కలుగుతుంది. అడవులు, జలపాతాలను, కొండ శిఖరాలను దాటుకుంటూ నుయి చువా (NUICHUA)పర్వతం మీదకు చేరుకున్నాము.

పర్వతం పైన చూడవలసిన ప్రదేశాలు : – లీ నిమ్ విల్లాలు, ఆర్చిడ్ గార్డెన్, ఓల్డ్ ఫ్రెంచ్ సెల్లార్, లీ జార్డిన్ డామౌర్, లించ్ ఉంగ్ పగోడా, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. అమ్యూజ్ మెంట్ పార్కు. కేబుల్ కార్ లో వెళుతున్న ప్పుడు దూరంగా వీటిలో కొన్ని కనిపిస్తాయి. పైకి వెళ్ళాక ముందుగా మేము ఫ్రెంచి గ్రామానికి వెళ్ళాము. యురోపియన్ వాస్తు శైలిలో ఉన్న నిర్మాణాలు, సెయింట్ డెనిస్ చర్చి మొదలైనవి చూసాము. ఫ్రెంచి వాస్తుశైలిలో ఉన్న లీ నిమ్ విల్లాలు కూడా ఉన్నాయి. అవి నివాస యోగ్యం కాదు. కేవలం పర్యాటక ఆకర్షణగా ఉన్నాయి. ఫ్రాన్స్ యుద్ధం తర్వాత అదే మాడల్ లో ఇటీవల కాలంలో నిర్మించారని గైడ్ చెప్పాడు. ఆ వాతావరణంలో ఆ నిర్మాణాల మధ్య ఆ వీధులలో తిరుగుతుంటే కాసేపు ఫ్రాన్స్ లో ఉన్న ఫీలింగ్ కలిగింది.

తర్వాత ట్రైన్ లో మరో కొండమీదకు వెళ్ళి బుద్ధుడి ఆలయానికి వెళ్ళాము. ఏడు నిమిషాలు, పదకొండు నిమిషాల నిడివిగల రెండు సినిమాలు చూసాము. సీటుకు ముందున్న రాడ్ ను గట్టిగా పట్టుకొని కూర్చోవాలి. ఏడు నిమిషాలలో యూరప్ లోని ప్రసిద్ధమైన పది దేశాలను వర్చువల్ గా దర్శించి వచ్చాము. రెండోది త్రీ డి కళ్ళజోడు పట్టుకొని చూసిన ఒక కార్టూన్ సినిమా. చిన్న దేశమైన వియత్నాం సాధించిన సాంకేతిక అభివృద్ధికి కేబుల్ కార్ నిర్వహణ, రైల్వే ట్రాక్, ఈ సినిమాలు నిదర్శనం.

ఆర్చిడ్ గార్డెన్, లీ జార్డిన్ డా మౌర్ అనేవి పూల తోటలు. వర్షం కారణంగా మేము అక్కడి వెళ్ళలేదు. వియత్నాం దేశానికి ఐకాన్ గా ఉన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జి మీదకు కూడా బలంగా వీస్తున్న ఈదురు గాలిలో, వర్షంలోనే వెల్లవలసి వచ్చింది. రెండు బలమైన చేతుల మధ్యలో ఈ వంతెన ఉంటుంది. దేవుని హస్తాల నడుమ దేశం సురక్షితంగా ‘ఉందని స్థానికుల నమ్మకం అని గైడ్ చెప్పాడు. నమ్మకాలు ఏవైనా చాలా అందమైన ప్రదేశం. తిరుగు ప్రయాణంలో డిన్నర్ ముగించి హోటల్ కు రాత్రి పది గంటలకు చేరుకున్నాం. తెల్లారి హోచిమన్ నగరానికి ప్రయాణం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *