అమెరికా సుంకాలు

అమెరికా ఇటీవల భారత్ నుండి దిగుమతి చేసుకునే  కొన్ని ఉత్పత్తులపై 25 శాతం వరకు అదనపు సుంకాలు విధించింది. “టారిఫ్ వార్” రూపంలో ఇది జరిగిన తాజా చర్య కాగా, దీని ప్రభావం కేవలం ఆర్థిక పరంగా మాత్రమే కాక, వ్యూహాత్మకంగా, రాజకీయంగా కూడా ఉండే అవకాశముంది. ఇలాంటి దాడుల ధోరణి ఇంకా  విస్తరిస్తే రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల్లో ఉద్రిక్తత పెరగడం ఖాయం.

ఈ నిర్ణయం వెనుక ఉన్న నేపథ్యం గమనిస్తే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  ఎన్నికల ప్రచారంలో “అమెరికా ఫస్ట్” అనే నినాదాన్ని ప్రధానంగా వినిపించారు . దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడమే లక్ష్యంగా, విదేశాల నుండి వొచ్చే ఉత్పత్తులపై భారీ టారిఫ్‌లు విధించడం ద్వారా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలనే ఉద్దేశం. చైనా తరువాత, భారత్ అమెరికాకు రెండవ అతిపెద్ద దిగుమతి దేశంగా మారడంతో, ఇప్పుడు భారత్ కూడా ఈ ఆర్థిక దాడికి లక్ష్యంగా మారింది. ఈ సుంకాలు ప్రధానంగా స్టీల్, అల్యూమినియం, ఆటోపార్ట్‌లు, కెమికల్స్, వస్త్ర ఉత్పత్తులు, ఫార్మా మొదలైన రంగాలపై ప్రభావం చూపుతాయి.

అమెరికాలో ఇప్పటికే   స్టీల్, అల్యూమినియం   రంగాల్లో స్థానిక కంపెనీలు గట్టిగా పోటీ పడుతున్నాయి. భారత్ నుంచి వొచ్చే దిగుమతులపై అధిక సుంకం విధించడం వల్ల భారత కంపెనీలకు మార్కెట్ పోటీలో నష్టమే మిగులుతుంది. ఫార్మా రంగంలో  అమెరికా  ఎక్కువగా భారత్ నుండి జనరిక్ ఔషధాలను దిగుమతి చేస్తుంది. టారిఫ్ పెరిగితే ధరలు పెరుగుతాయి, ఫలితంగా అక్కడి వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది. పది లక్షల మందికి పైగా ఉపాధిని కలిగించే  వస్త్ర పరిశ్రమ   రంగం ఇప్పటికే గ్లోబల్ పోటీలో నెమ్మదిగా ఉంది. ఇప్పుడు అదనపు సుంకం విధించడంతో, అమెరికా మార్కెట్‌లో భారత ఉత్పత్తులకు పోటీ మరింత కష్టంగా మారుతుంది.

US Tariffs on GCCs: Impact on India’s Global Capability Centers and Future Outlook
US Tariffs on GCCs: Impact on India’s Global Capability Centers and Future Outlook

టారిఫ్ కారణంగా అమెరికా కొనుగోళ్లు తగ్గిస్తే, భారత ఎగుమతులు దాదాపు 3–5 బిలియన్ డాలర్ల వరకు పడిపోవొచ్చని అంచనా. ఎగుమతులు తగ్గిపోతే, పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతింటాయి. దిగుమతులపై ఆధారపడే కొన్ని లోపలి రంగాల్లో ధరల పెరుగుదల జరిగి  ద్రవ్యోల్బణానికి అవకాశం ఉంది   ఎగుమతుల ఆదాయం తగ్గిపోవడంతో దేశానికి వొచ్చే విదేశీ మారకద్రవ్య పరిమితమవుతుంది.భారతదేశం తక్షణం ప్రతిస్పందన చర్యలకు పాల్పడకపోయినా, దీన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కొనవలసిన అవసరం ఉంది. అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా  భారత కంపెనీలు యూరప్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి మార్కెట్లలో తమ ఉత్పత్తుల కోసం అవకాశాలను వెతకాలి. యూరోపియన్ యూనియన్, యూ ఏ ఈ , ఆస్ట్రేలియా వంటి దేశాలతో వాణిజ్య ఒప్పందాలను మరింతగా బలపర్చాలి.

అమెరికాతో సత్సంబంధాలు ఉన్న భారత్,  వ్యూహాలను అతి వేగంగా కాక, ఆచితూచి అమలు చేయాలి. అమెరికా-భారత్ సంబంధాలు గత రెండు దశాబ్దాలలో గణనీయంగా అభివృద్ధి చెందాయి. కానీ వాణిజ్య పరంగా జరిగే ఈ బలపరీక్షా చర్యలు అవి భవిష్యత్‌లో ముప్పు కలిగించవొచ్చు . అమెరికా ఇండియా వలె అభివృద్ధి చెందుతున్న భాగస్వామిని నిర్లక్ష్యం చేస్తే, దీని ప్రభావం వ్యూహాత్మక మరియు రక్షణ పరంగా కూడా ప్రతిబింబించవొచ్చు.

దీర్ఘకాల పరిణామాలను ఉహించి భారత్  పటిష్ట ప్రణాళికలను రూపొందించుకోవలసిన అవసరముంది. ఇది ఒక ‘జాగ్రత్త సంకేతం’ గా గుర్తించి . ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పరస్పర ఆధారత ఉన్నప్పటికీ, “ఆత్మనిర్భర భారత్” లక్ష్యం వాస్తవంగా  ఆచరణలోకి రావాలి. భారత పరిశ్రమలు ఒకే దేశంపై ఆధారపడకుండా, విభిన్న మార్కెట్లను లక్ష్యంగా చేసుకోవాలి. దేశీయంగా ఉత్పత్తులను నాణ్యత పరంగా మెరుగుపరచడం ద్వారా ప్రపంచ మార్కెట్లను ఆకర్షించగలగాలి. భారత్‌పై అమెరికా విధించిన ఈ 25శాతం  టారిఫ్‌లు తాత్కాలికంగా నష్టాలు కలిగించవొచ్చు గానీ, దీన్ని ఒక అవకాశం గా భావించి , దేశీయ పరిశ్రమలు స్వయం సమృద్ధికి పునాది వేయాల్సిన అవసరం ఉంది. భారతదేశం మార్కెట్ శక్తిగా మారాలంటే, రాజకీయ స్థిరత్వంతో పాటు, వ్యూహాత్మక ఆర్థిక చొరవలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *