హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : సిద్దిపేట జిల్లా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌లో పడి హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం దిగ్భ్రాంతికరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. . మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పాను. చేతికి అందొచ్చిన పిల్లలు.. ఇలా అకాల మరణం చెందడం ఆ కుటుంబాలకు తీరని లోటు. ఈ దుర్ఘటనపై గురించి సమాచారం తెలియగానే.. సిద్దిపేట పోలీస్ కమిషనర్, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడాను. గల్లంతైన యువకుల మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాన్ని వేగవంతం చేయాలని సూచించానని తెలిపారు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.
గల్లంతై మృతి చెందడం పట్ల ఎమ్మెల్యే హరీష్‌రావు దిగ్భ్రాంతి
రూ.15లక్షల చొప్పున ఎక్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండు
సిద్ధిపేట జిల్లా కొండపోచమ్మసాగర్‌లో హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన ఐదుగురు యువకులు గల్లంతై మృతి చెందడం పట్ల మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారమిక్కడ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేస్తూ…ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు అకాల మరణం చెందటం మనస్సును కలచి వేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హరీష్‌రావు కోరారు. పండుగ వేళ బిడ్డల్ని కోల్పోయి బాధలో ఉన్న కుటుంబాలకు రూ. 15లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని హరీష్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





