•కేంద్రం మా అధికారాలను లాక్కోవాలని చూస్తోంది..
•ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 7 : ఉన్నత విద్యపై రాష్ట్ర అధికారాలను నియంత్రించే యుజిసి నిబంధనల ముసాయిదా-2025 ను ఉపసంహరించుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం పోరాడుతుందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈనెల 5న బెంగళూరులో 6 రాష్ట్రాల విద్యామంత్రుల సమావేశం దీనిపై సంయుక్త తీర్మానం చేసి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు పంపించింది. ఈ అంశంపై త్వరలో కేరళలో మరోసారి సమావేశం కానున్నట్టు శుక్రవారం సచివాలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీధర్ బాబు తెలిపారు. రాహుల్ గాంధీ గురువారం దిల్లీలో డిఎంకె నేతలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ముసాయిదాలో మార్పులు చేయడం లేదా ఉపసంహరించుకునే వరకూ తాము ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యపై రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, అయినా కేంద్రం తమ అధికారాలను లాక్కోవాలని చూడటం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని శ్రీధర్ బాబు ఆక్షేపించారు. జమ్మూ కశ్మీర్ కూడా తమతో కలిసి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేసినట్టు ఆయన వివరించారు.
డిగ్రీ ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఎంట్రన్స్ నిర్వహించాలనుకోవడం విద్యార్థులను కళాశాల విద్యకు దూరం చేసే ప్రయత్నమని ఆయన దుయ్యబట్టారు. డిగ్రీ చదివే వయసున్న యువతలో జాతీయ సరాసరి ప్రకారం నూటికి 28 మంది మాత్రమే కళాశాలల్లో చేరుతున్నారని, రాష్ట్రంలో ఇది 40 శాతం ఉందని తెలిపారు. ఎంట్రెన్స్ లాంటి నిబంధన వల్ల ఉత్తీర్ణులు కాలేమన్న ఆందోళనతో మరింత ఎక్కువ మంది ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. వైస్ ఛాన్సలర్ల నియామకంలో రాష్ట్రాల ప్రాతినిధ్యం లేకుండా అధికారాలను పూర్తిగా తన చేతిలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమని శ్రీధర్ బాబు అన్నారు. ఈ అంశపై రాష్ట్రం నిరసనను తెలియజేస్తూ ముసాయిదాను ఉపసంహరించుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కేంద్ర విద్యామంత్రికి లేఖ రాసారని తెలిపారు. రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి, తమ అభిప్రాయాల ప్రకారం ముసాయిదాలో మార్పులు చేసేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడించారు.



