ఉగాది ప్రగతి పునాది కావాలి

“నేడు ప్రారంభమవుతున్నది పరాభవ నామ సంవత్సరమైన పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పంచాంగ సంప్రదాయంలో సంవత్సరాల పేర్లు ప్రతీకాత్మకాలు మాత్రమే అవి పూర్తిగా మంచి చెడు నిర్ణయించవు. పరాభవ అనే పదానికి ఓడిపోవడం అనే అర్థం ఉన్నప్పటికీ లోతుగా చూస్తే  మనం చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం అని కూడా భావించవచ్చు..”

దుప్పటి మొగిలి 
8466827118

ఉగాది అనేది కాల చక్రంలో కొత్త సంవత్సర ఆరంభం మాత్రమే కాదు అది మన సంస్కృతి, మన చరిత్ర, మన జీవన విధానాల సమ్మేళనం. కాలగమనంలో కొత్త అధ్యాయం తెరుస్తున్న ఈ శుభసందర్భం, ప్రతి మనిషికి ఒక కొత్త ఆశ, కొత్త దిశ, కొత్త ఆలోచనలను అందిస్తుంది. అందుకే ఉగాది పండుగను యుగాది అని కూడ పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో ప్రతి పండుగకు ఒక ఆధ్యాత్మికత, ఒక శాస్త్రీయత, ఒక సామాజికత ఉంటుంది. చైత్ర మాస శుక్ల పక్ష పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగ, ప్రకృతి మేల్కొనే సమయం. చెట్లు కొత్త కొమ్మలు తొడుగుతాయి, పూలు పరిమళిస్తాయి, గాలి సుగంధ భరితమవుతుంది. ప్రకృతి తల్లి కొత్త వస్త్రాలు ధరించినట్లుగా కనిపిస్తుంది. ఈ దృశ్యం మనిషికి  పాతది వదిలి కొత్తదాన్ని ఆహ్వానించు అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది.

ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రతీక. చేదు, తీపి, పులుపు, ఉప్పు, కారం ఈ ఆరు రుచులు మన జీవితంలోని అనుభవాలను సూచిస్తాయి. సంతోషం, దుఃఖం, కోపం, భయం, ఆశ్చర్యం, అసహ్యం ఈ భావాలన్నీ కలిసి జీవితం అనే మహాకావ్యాన్ని నిర్మిస్తాయి. ఉగాది పచ్చడి తినడం ద్వారా జీవితం అన్ని రుచుల సమ్మేళనమనే సత్యాన్ని అంగీకరిస్తున్నట్లు ఒకప్పుడు కుటుంబ సభ్యులు కలిసి పండుగను ఆనందంగా జరుపుకునే వారు. పెద్దలు పంచాంగ శ్రవణం వినిపించి, చిన్నవారికి ఆశీస్సులు ఇచ్చే వారు. ఇప్పుడు ఆచారాలు క్రమంగా కనుమరుగవుతూ ఉగాది పండుగ రూపం మారిపోతోంది. పండుగ అంటే సెలవు రోజు, షాపింగ్, సోషల్ మీడియా పోస్టులు అన్న భావన పెరిగి మన సంప్రదాయాల వెనుక ఉన్న తాత్వికతను మర్చిపోతున్నాం.కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్ మార్పు కాదు ఆలోచనల మార్పు. సమాజంలో పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, పర్యావరణ కాలుష్యం, విలువల పతనం ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొనే సంకల్పం మనం ఈ రోజు పొందుకోవాలి. మనిషి తన అహంకారాన్ని విడిచిపెట్టి, ప్రకృతితో సఖ్యతగా జీవించాలి.
నేడు ప్రారంభమవుతున్నది పరాభవ నామ సంవత్సరమైన పేరు చూసి భయపడాల్సిన అవసరం లేదు. మన పంచాంగ సంప్రదాయంలో సంవత్సరాల పేర్లు ప్రతీకాత్మకాలు మాత్రమే అవి పూర్తిగా మంచి చెడు నిర్ణయించవు. పరాభవ అనే పదానికి ఓడిపోవడం అనే అర్థం ఉన్నప్పటికీ లోతుగా చూస్తే  మనం చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం అని కూడా భావించవచ్చు. కుటుంబాలలో, సమాజంలో సంబంధాలు దూరమవుతున్నాయి. ఆత్మీయత క్షీణించి  మనుషుల మధ్య ప్రేమ, గౌరవం, అనుబంధం కోల్పోవడమే అసలు పరాభవం.
గత కొన్ని సంవత్సరాలను వెనక్కి చూసినప్పుడు, వ్యక్తిగతంగా గానీ, సామాజికంగా గానీ, దేశంగా గానీ ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. ఆర్థిక అసమానతలు, యువతలో నిరుద్యోగం, పర్యావరణ సంక్షోభం, విలువల పతనం మనుషుల మధ్య కులమత భేదాలు, ఇర్ష్య, ద్వేషం,కోపం,స్వార్థం మరియు దోపిడీ మన సమాజాన్ని వేధిస్తున్న వాస్తవాలు. ఈ సమస్యలన్నీ మనకు పరాభవాలే. కానీ వాటిని దాచిపెట్టడం కాదు, ఎదుర్కోని నవ సమసమాజాన్ని నెలకొల్పడమే మన లక్ష్యం కావాలి. ఇది పాలకులకు కూడా ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో పరాభవం అంటే కేవలం ఎన్నికల్లో ఓటమి కాదు ప్రజల నమ్మకాన్ని, విశ్వాసం కోల్పోవడం కూడా ఒక పరాభవమే. కాబట్టి ఈ సంవత్సరం పాలనలో పారదర్శకత, బాధ్యత మరింత పెరగాలి.పోటీ ప్రపంచంలో ఓటములు సహజమని యువత గ్రహించి  ఆ ఓటములే భవిష్యత్తు విజయాలకు పునాది వేసుకోవాలి. ప్రతి పరాభవం ఒక పాఠం, ప్రతి పాఠం ఒక మార్గదర్శిగా మార్పు చెందాలి.
ఈ పరాభవ నామ సంవత్సరం మనకు చేసే హెచ్చరిక ను అవకాశంగా మల్చుకొని, గతంలో జరిగిన వైఫల్యాలను అంగీకరించాలి, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి, మనల్ని మనం మార్చుకుని, తిరిగి నిలబడి తప్పులను సరిదిద్దుకొని ,కొత్త దిశగా పయనించి విజయాన్ని సాధించడమే మన సంకల్పం కావాలి. దేశంగా, సమాజంగా, వ్యక్తిగతంగా ఎక్కడైనా ఉన్న లోపాలను సరిదిద్దుకోవడం ఈ సంవత్సరానికి అసలు అర్ధం.ఉగాది పచ్చడి మనకు నేర్పేది ఇదే. చేదు అనుభవాలు కూడా జీవితంలో భాగమే. వాటినుండే  తీపి క్షణాలు మనకు ఆశను ఇస్తాయి. ఈ రెండింటి మధ్య సమతౌల్యం నేర్చుకోవడమే నిజమైన జీవన జ్ఞానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *