టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం 21 డిమాండ్ల జాబితాను ప్రభుత్వానికి అందజేయడం తాజా పరిణామం. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు తమకు చెల్లించాల్సిన ఆర్థిక బకాయిల చెల్లించాలన్నది సిబ్బంది చేస్తున్న ప్రధాన డిమాండ్. గత ఏడాది మొదట్లో కూడా ఆర్టీసీ సిబ్బంది తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తెచ్చి అమలు చేయకపోతే 2025 మే 7 నుంచి సమ్మెకు దిగుతామని హెచ్చరించగా, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చిన హామీ మేరకు సమ్మె ప్రతిపాదనను విరమించారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎటువంటి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలు మరోసారి ప్రభుత్వానికి తమ డిమాండ్ల జాబితాను సమర్పించి అమలుకు మార్చి 13 డెడ్‌లైన్ విధించడం తాజా పరిణామం. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, పీఆర్‌సీ అమలు, క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీలకు చెల్లించాల్సిన మొత్తంతో పాటు ప్రావిడెంట్ ఫండ్ బకాయిలు రూ.2700కోట్లు చెల్లించడం, సంస్థ సొంతంగా విద్యుత్ బస్సులు కొనుగోలు చేసి నడపడం (ప్రస్తుతం ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్నారు), ట్రేడ్ యూనియన్ ఎన్నికలు జరుపుకోవడానికి అనుమతించడం, ఖాలీలను భర్తీచేయడం, మహిళలకు “జీరో టికెట్ల” స్థానంలో స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టడం, 2019 సమ్మె సందర్భంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లు ఇందులో ఉన్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో 3% ఆర్టీసీ కేటాయించాలని కూడా వారు కోరుతున్నారు.
ఈ డిమాండ్లకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పటి మాదిరిగానే సంస్థ ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ, సంయమనం పాటించాలని, తమ ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి కట్టుబడి వున్నదని మళ్లీ పాత పాటే పాడారు. ఎందుకంటే గత ఏడాది సమ్మె నోటీసు ఇచ్చినప్పుడు కూడా ఆయన ఇదే మాట చెప్పారు. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాల గుర్తింపు అంశాలు ప్రస్తుతం పరిశీలన లో ఉన్నాయని అధికార్లు చెబుతున్నారు. సంస్థ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రభుత్వంలో విలీనం చేయడం ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదన్నది అధికార్ల వివరణ. కార్మికులు డిమాండ్ చేస్తున్న పీఎఫ్ బకాయిలను క్రమంగా చెల్లిస్తూ రావడం వల్ల గతంలో రూ.1355.4 కోట్ల నుంచి రూ.660.5 కోట్లకు, అదేవిధంగా క్రెడిట్ కొఆపరేటివ్ సొసైటీ బకాయిలను రూ.664.5 కోట్ల నుంచి రూ.364.1 కోట్లకు తగ్గిన అంశాన్ని ప్రభుత్వం వెల్లడిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం నెలవారీగా పీఎఫ్ బకాయిలు రూ.45 కోట్లు, సీసీఎస్ రూ.25 కోట్ల చొప్పున చెల్లిస్తున్న సంగతిని గుర్తు చేస్తున్నది. 2024 మార్చిలో 21% పేస్కేల్ ను పెంచగా, 3036 కొత్త పోస్టుల భర్తీకి అనుమతించిన విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తుచేసారు. బస్సుల ఆధునికీకరణ కింద గత నెలలో 1085 కొత్త విద్యుత్ బస్సులకోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింద న్నారు. డ్రైవర్ అర్హతలు, టిక్కెట్ జారీ యాప్‌కు సంబంధించి తప్పుడు ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కూడా.
ఇన్ని హామీలిచ్చినప్పటికీ, తమను అధికారిక చర్చలకు ఆహ్వానించకపోవడమేంటనేది జేఏసీ నాయకుల వాదన. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన వివరణలను టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నాయకులు పట్టించుకోకుండా మార్చి 13 తర్వాత సమ్మెకు దిగితే ప్రత్యామ్నాయాల కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. రద్దీ మార్గాల్లో ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతులిచ్చి అద్దె బస్సులను నడపాలని యోచిస్తోంది. ఇదే సమయంలో రోజువారీ చెల్లింపుల కింద తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి కూడా ప్రభుత్వం ఉద్యుక్తమవు తోంది. గతంలో సమ్మె సందర్భాల్లో సంస్థ ఈ చర్య ద్వారా 75% బస్సులను నడపగలిగింది. అంతేకాదు గతంలో వందలాది స్కూల్, కాలేజీ బస్సులను ఆర్టీసీ స్థానంలో ఆర్టీఏ విజయవంతంగా రంగంలోకి దించింది. సీనియర్ ఐఏఎస్ అధికార్లతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, ఈ సమస్యను ఎదుర్కొనే బాధ్యతను అప్పగించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూనే మరోపక్క ప్రభుత్వం తెరవెనుక చర్చలు కొనసాగిస్తోంది.
అంతేకాదు లేబర్ కమిషనర్ ఈ సమ్మెను పారిశ్రామిక వివాదాల చట్టం కింద చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించే అవకాశాలున్నాయి. ఇక ఉద్యోగులు తప్పనిసరిగా విధుల్లో చేరే విధంగా ఎస్మాను కూడా ప్రయోగించడానికి వెనుకాడకపోవొచ్చు. కాగా మార్చి 18 నుంచి పూర్తిస్థాయి సమ్మెలోకి వెళతామని ప్రకటించిన కార్మిక సంఘాలు, ప్రైవేటు లేదా అద్డె బస్సులను నడిపేందుకు యాజమాన్యం సిద్ధపడితే తాము అభ్యంతరం చెప్పబోమని ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న విధంగా సంస్థను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, ఆర్టీసీకి చెందిన 40వేల మంది ఉద్యోగులకు అవసరమైన ప్రయోజనాలు చెల్లించేందుకు నెలకు రూ.500 కోట్లు అదనంగా చెల్లించాల్సి వొస్తుంది. ఇది తలకు మించిన భారం కనుక ప్రభుత్వం ఆదిశగా అడుగులు ముందుకు వేయడంలేదు. సంస్థ “విలీన బిల్లు-2023” ఆమోదం పొందినప్పటికీ, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి విలీనం చేసే “అపాయింటెడ్ డే” ఇప్పటికీ ప్రకటించకపోవడానికి ఆర్థిక భారమే కారణమన్నది సుస్పష్టం. దీనికి తోడు ఈ విలీన ప్రకియ నిబంధనల రూపకల్పనకోసం గత ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్లతో ఒక కమిటీని వేసింది.
ప్రభుత్వం మారడంతో ఈ కమిటీలోని ఐఏఎస్ ఆఫీసర్లను బదిలీ చేయడంతో ఈ ప్రక్రియ మూలనపడింది. ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసుకుంటే, మిగిలిన 57 కార్పొరేషన్ ఉద్యోగులనుంచి కూడా ఇదేమాదిరి డిమాండ్లు వొచ్చే అవకాశముంది. దీన్ని నివారించే విధంగా విధివిధానాల రూపకల్పన ఇప్పటివరకు జరగలేదు. కాగా మహాలక్ష్మి పథకం వల్ల సంస్థకు నెలకు రూ.350 కోట్ల మేర భారం పడుతోంది. ఈ మొత్తం రీయింబర్స్ మెంట్ ప్రభుత్వం నుంచి జమ కావడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. సంస్థను విలీనం చేసుకున్న తర్వాత ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం అమ్మేయడమో లేక ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వడమో చేస్తుందన్న భయం కార్మిక సంఘాల నాయకుల్లో ఉంది . దీనికి తోడు ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఆస్తుల పంపకాల విషయంలో కూడా చాలా అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం విలీన ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, అపాయింటెడ్ డేకు మాత్రం నిర్దిష్ట కాలావధి లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక సంస్థ ఆర్థిక పరిస్థితి చూస్తే “ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్” అన్న చందంగా వుంది. రోజువారీ బస్సులు నడపడంలో సంస్థకు లాభాలు కనిపిస్తున్నా బ్యాలన్స్ షీట్లు మాత్రం ” రెడ్ సిగ్నల్ ” చూపుతున్నాయి. మొత్తంమీద వొచ్చే నష్టాలు, బ్యాంకు అప్పులు సంస్థను కుదేలు చేయడమే ఇందుకు కారణం. పైకి గంభీరంగా ఉన్నా విలీన ప్రతిపాదన వొచ్చేసరికి సంస్థ అప్పులు ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో రోజువారీ ప్రయాణించేవారి సంఖ్య 45 లక్షనుంచి 60 లక్షలకు పెరిగింది.
ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి 97%కు ఎగబాకింది. మహాలక్ష్మి పథకానికి ముందు మహిళా ప్రయాణికుల సంఖ్య 40% ఉండగా ఇప్పుడది 66.74%కు చేరింది. ఈ లెక్కలన్నీ పైకి బాగానే కనిపిస్తున్నా సంస్థ అప్పుల ఊబిలోనే ఉండటం ఒక విషాదం . ఈ లోపాలు కనిపెట్టి సరిజేస్తేనే సంస్థ మనుగడ సరిగ్గా ఉంటుంది . అవగాహన లేకుండా అడ్డగోలుగా తెచ్చిన విలీన ప్రతిపాదన రాజకీయ పార్టీలకు తాత్కాలికంగా వోట్లు పడేలా చేసినా, వాస్తవానికి వొచ్చేసరికి ప్రభుత్వం చేతులెత్తేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. రాజకీయ పార్టీల నిర్వాకానికి ఇప్పుడు టీఎస్ ఆర్టీసీ స్వతంత్ర సంస్థగాను లేదు, ప్రభుత్వంలో విలీనమూ కాలేదు. త్రిశంకు స్వర్గంలో ఉంది ! ఈ స్థితినుంచి బయపడేదెలా? పార్టీల రాజకీయ మాయాజాలంలో సంస్థ, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నది వర్తమాన చరిత్ర చెబుతున్న నిష్టుర సత్యం.





