ప్రస్తుత అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రపంచాన్ని ఒక అనిశ్చిత స్థితిలోకి నెట్టివేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాత్మక వెనకడుగు, అదే సమయంలో ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని 4000 కిలోమీటర్ల మేర పెంచుకుంటూ దూకుడు ప్రదర్శించడం గల్ఫ్ ప్రాంతాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రధానమంత్రి పార్లమెంటులో చేసిన ప్రసంగం, రాష్ట్రాలకు ఇచ్చిన హెచ్చరికలు రాబోయే “మహా సంక్షోభానికి” సూచికలుగా కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ రాజకీయ యవనికపై శత్రువు ఎవరో, మిత్రుడు ఎవరో తెలియని ఒక అయోమయ స్థితి నెలకొంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా తన పాత ప్రాభవాన్ని నిలబెట్టుకోవడంలో తడబడుతుంటే, మరోవైపు ప్రాంతీయ శక్తులు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి యుద్ధ తంత్రాన్ని ఎంచుకుంటున్నాయి. ఇరాన్ ప్రయోగించిన 4000 కి.మీ పరిధి గల క్షిపణులు కేవలం గల్ఫ్ దేశాలకే కాదు, ఐరోపా సరిహద్దులకు కూడా సవాలు విసురుతున్నాయి.
గతంలో “అమెరికా ఫస్ట్” నినాదంతో కఠిన నిర్ణయాలు తీసుకున్న డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉద్రిక్తతల వేళ కొంత వెనక్కి తగ్గడం ఆశ్చర్యకరంగా మారింది. ఇది యుద్ధాన్ని నివారించే ప్రయత్నమా లేక అంతర్గత రాజకీయ ఒత్తిడి వల్ల తీసుకున్న నిర్ణయమా అన్నది చర్చనీయాంశం. అమెరికా వంటి అగ్రరాజ్యం మధ్యప్రాచ్యం నుండి తన పట్టు సడలించుకోవడం వల్ల ఏర్పడిన “శూన్యం” ఇరాన్ వంటి దేశాలకు వరంగా మారింది. ట్రంప్ అనుసరిస్తున్న ఈ మౌనం లేదా వెనకడుగు మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాలను రక్షణ పరంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉంది.
ఇరాన్ తాజాగా ప్రకటించిన 4000 కి.మీ లక్ష్యిత క్షిపణులు గల్ఫ్ సహా ఆసియా, ఐరోపాలోని ప్రధాన నగరాలను తాకగలవు. గల్ఫ్ ప్రాంతం ప్రపంచానికి వెన్నెముక వంటిది. ఇక్కడ యుద్ధం సంభవిస్తే ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతాయి. హార్ముజ్ జలసంధి వంటి కీలక మార్గాల్లో వాణిజ్యం స్తంభించిపోతే అంతర్జాతీయ సరఫరా గొలుసు విచ్ఛిన్నమవుతుంది. ఇరాన్ తన క్షిపణి పరీక్షలతో అగ్రరాజ్యాలకు హెచ్చరికలు పంపుతోంది. దీనివల్ల గల్ఫ్ దేశాల మధ్య ఆయుధ పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.ఇది కేవలం ఇరాన్-అమెరికా లేదా ఇరాన్-ఇజ్రాయెల్ సమస్యగా మిగిలిపోవడం లేదు. లెబనాన్, యెమెన్, సిరియా వంటి దేశాల్లోని సాయుధ గ్రూపుల ద్వారా ఈ యుద్ధం పరోక్షంగా ఇతర ప్రాంతాలకు వ్యాపిస్తోంది. ఐరోపా దేశాలు ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆర్థికంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు గల్ఫ్ ఉద్రిక్తతలు తోడైతే ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి వెళ్లడం ఖాయం.
భారత ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రసంగం భారత్ ఎంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతుందో స్పష్టం చేసింది. “ప్రపంచం ఒక అగ్నిపర్వతం మీద కూర్చుని ఉంది. గల్ఫ్ లో రేగే మంటలు మన ఇళ్ల వరకు రావొచ్చు. మనం దీర్ఘకాలిక ఇబ్బందులకు సిద్ధంగా ఉండాలి.” ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రవాస భారతీయుల భద్రత: గల్ఫ్ దేశాలలో లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు. యుద్ధం తీవ్రతరం అయితే వారిని స్వదేశానికి తరలించడం పెను సవాలు.భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా గల్ఫ్ పైనే ఆధారపడి ఉంది. చమురు ధరలు పెరిగితే సామాన్యుడిపై భారం పెరుగుతుంది, రూపాయి విలువ పడిపోతుంది.
కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాకుండా, రాష్ట్రాలు కూడా రాబోయే ఆర్థిక మరియు వనరుల కొరతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారిస్తూ . అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే రాష్ట్ర బడ్జెట్లపై పడే ప్రభావాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలని పేర్కొంటూ సరఫరా గొలుసు దెబ్బతింటే నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
నేడు ప్రపంచం ఒక కుగ్రామం .. ఎక్కడ చిన్న నిప్పు రగిలినా దాని ప్రభావం ఖండాతరాలకు వ్యాపిస్తుంది. అమెరికా వెనకడుగు, ఇరాన్ దూకుడు ప్రపంచాన్ని ఒక కొత్త ప్రచ్ఛన్న యుద్ధం వైపు నడిపిస్తున్నాయి. భారత ప్రధాని ఇచ్చిన పిలుపు కేవలం రాజకీయ ప్రకటన కాదు, అది ఒక వాస్తవిక హెచ్చరిక. ముంచుకొస్తున్న ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఐక్యత, దౌత్యనీతి మరియు సంసిద్ధత మాత్రమే మనకున్న ఆయుధాలు.





