టు లవ్ విత్ పార్థసారథి సర్ – కన్నీటి వీడ్కోలు

“మొన్న మార్చి మూడున ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చారని తెలిసినప్పటినుంచి – విషాదాలు విడిగా ఒక వేగులవాని వలె రావు, సైనికులుగా బెటాలియన్లుగా వస్తాయి అన్నట్లుగా, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఆక్రమణ దాడులు, తెలంగాణలో లొంగుబాట్లు, ఖమ్మంలో గ్రామీణ పేదల గుడిసెల మీదికి భూ ఆక్రమణదారుల ప్రభుత్వ బుల్డోజర్ లు, మత దురహంకార దుర్మార్గుడి పాదాల కింద పసి పాప మరణం – చైతన్యం లో భాగమైన తుఫానుగా చుట్టుముడుతుంటే, ఈ చైతన్యం లోనే భాగమైన ఆయన స్నేహం నిరంతరం గుండెకోత పెడుతున్నది..”
నేను 1960 లో ఎమ్ఏ లో చేరిన కొత్తలోనే చలం గారు మీరిపుడు హైదరాబాదులో ఉంటున్నారు కదా, మీ ఉస్మానియా యూనివర్సిటీ కి ఇసామియా బజారు ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు గానీ ఒకసారి వెళ్లి ఆయనను పలకరించండి, ఆయన నాకు కార్డు రాయడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నట్లున్నాడు అని రాసాడు. అప్పుడు పార్థసారధి ఉద్యోగం వెతుక్కోవడానికి హైదరాబాదుకు వచ్చి తల్లితోపాటు చిన్నగదిలో ఉంటున్నాడు. అట్లా చలం గారిచ్చిన మిత్రుడు పార్థసారథి 65 సంవత్సరాలకు పైగా ప్రాణస్నేహితుడు, భౌతికంగా నా జీవితంలోకి ఆయా కాలాల్లో వచ్చి కొనసాగిన అనుబంధం విచిత్రమైనది. ఆ జీవితం గురించి రాసిన ‘శూన్యం’ నవలకు ఆయన నాతో ముందు మాట రాయించాడు. ఆ తల్లిని మొదట పోస్టల్ ఉద్యోగంలో ఉండగా, ఆ తర్వాత రిజర్వు బ్యాంకు లో ఉద్యోగం వచ్చాక విజయనగర్ కాలనీ ప్రభాత కర్ అపార్ట్మెంట్స్ లో తన అరచేతుల్లో అవసానదశ దాకా చూసుకున్నాడు.
ఓయూలో ఉన్న నాలుగేళ్లూ ఆయనను కలుస్తూనే ఉన్నాను. ఆయన నిరుద్యోగం లోని దారిద్య్రం అనుభవించిన కాలం దుర్భరమే కావచ్చు కానీ, ఆయన పుస్తకాల చదువు దాహం, ఆ చదివింది నలుగురికి చెప్పాలని, రాయాలని వెంటాడిన తపన, ఆయన దగ్గరికి ఎపుడు వీలయినా పోవాలనే స్నేహాన్ని నిలబెట్టింది. 1965 జనవరిలో ఢిల్లీలో డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజ్ మెంట్ అండ్ విజువల్ పబ్లిసిటీ లో ఉద్యోగం వచ్చి ఏడు నెలలకు తిరిగి వచ్చాక హైదరాబాదులో కలిసినప్పటికి ఆయన పోస్టల్ డిపార్టుమెంటులో పని చేస్తున్నాడు. ‘మీ ఉత్తరాలు సెన్సార్ అవుతున్నాయి, మీరు ఎవరైనా కమ్యూనిస్టు నాయకులకు ఉత్తరాలు రాస్తారా’ అని అడిగాడు. అవును, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు సిపిఐ ఎమ్మెల్యే గా రాఘవాచారి గారి ద్వారా పరిచయమయ్యాడు. నేను డిఏవీపీలో చేరానని తెలిసి ‘విశాలాంధ్ర’ కు ప్రకటన ఇప్పించగలనా అని రాశాడు. ఇంత సర్క్యులేషన్ ఉండాలని నిబంధన ఉంది అని జవాబిచ్చాను అంతే, అన్నాను. అట్లా 1965 నుంచే నాకు వచ్చే ఉత్తరాలే కాదు, నేను రాసే ఉత్తరాలు నక్సల్బరీ కన్నా ముందే సెన్సార్ కావడం ప్రారంభమైందని పార్థసారథి గారి హెచ్చరికతో నే అర్థమైంది.
ఇంక 1966 జడ్చర్లలో సృజన ప్రారంభించి తిలక్, బుచ్చిబాబు, చలం సంచికల నాటికే ఈ ముగ్గురు రచయితలను ఆయన క్షుణ్నంగా చదివి ఉండడమే కాకుండా, చలం సంచిక సందర్భంగా శ్రీపతి గారితో కలిసి, ఆ సంచిక హైదరాబాదులో అచ్చయినందున ఆ ఎండాకాలం సెలవుల్లోనూ కలుస్తుండేవాళ్ళం. మా పరిచయం చలం దగ్గర, శ్రీ శ్రీ దగ్గర ప్రారంభమైన మా మార్గాలు కూడా ఒకటే కావడం, ఆయన విషయంలో మార్క్సిజం ఒక మార్పు తత్త్వశాస్త్రంగా ఆయన ఆలోచనా స్రవంతిలో భాగంగా కావడం, దానిని ఒక సైన్స్ గా కూడా ఆయన విశ్వసించడం మమ్మల్ని ఒక ప్రవాహం లో భాగం చేసింది. వేణు విజయనగర్ కాలనీ లో ఉన్న రోజుల్లో మళ్లీ ఆయనను ఇంటికి వెళ్లి కలిసే సందర్భాలు మొదలయ్యాయి అప్పటికింక ఆయన ఒక జ్ఞాన వృక్షం అయ్యారు. 1970లలో జాక్ లండన్, ‘ఐరన్ హీల్’ ను’ ఉక్కుపాదం’ పేరుతో అనువదించి విరసం పాఠకులకు, విప్లవాభిమానులకు కొత్త ఉత్తేజాన్నిచ్చారు.
అక్కడి నుంచి పార్థసారథి గారే కాదు, ఆయన సహచరి వసంత గారు పరిచయమయ్యారు. నిన్న వసంత గారు తన ఫేస్ బుక్ లో’ ‘పార్థసారధి సర్ ఈజ్ నో మోర్’ అని రాశారు. ‘అవునమ్మా వసంత గారు మీతో పాటు మా అందరికీ పార్థసారథి ‘సర్’. టూ సర్ విత్ లవ్. కన్నీటి వీడ్కోలు’ అని రాసాను. అట్లా ఆమె పరిచయమయ్యి 30 ఏళ్లు పైనే అయింది. ఆమె ఆర్టిస్టు. ఆమె పార్థసారథి గారి జీవితాన్ని కళామయం చేసింది. మొన్న మార్చి మూడున ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆసుపత్రిలో చేర్చారని తెలిసినప్పటినుంచి – విషాదాలు విడిగా ఒక వేగులవాని వలె రావు, సైనికులుగా బెటాలియన్లుగా వస్తాయి అన్నట్లుగా, ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా ఆక్రమణ దాడులు, తెలంగాణలో లొంగుబాట్లు, ఖమ్మంలో గ్రామీణ పేదల గుడిసెల మీదికి భూ ఆక్రమణదారుల ప్రభుత్వ బుల్డోజర్ లు, మత దురహంకార దుర్మార్గుడి పాదాల కింద పసి పాప మరణం – చైతన్యం లో భాగమైన తుఫానుగా చుట్టుముడుతుంటే, ఈ చైతన్యం లోనే భాగమైన ఆయన స్నేహం నిరంతరం గుండెకోత పెడుతున్నది. అందులోనూ ఈ మానసిక స్థితి నేను ఒక పొరపాటు చేశానని గుర్తు చేసింది.
నేను అరెస్టయ్యే కాలానికి ముందు దాకా విజయనగర్ కాలనీ కి వాళ్ల అపార్ట్ మెంట్ కు పోయేవాణ్ని. ఆ ఆపార్టుమెంట్ లోనే మా అన్నయ్య బిడ్డ వెంకటలక్ష్మి ఉంటుంది. ఆమె ఎదురు పడినప్పుడల్లా మిమ్మల్ని కలవడానికయినా ఒక సారి వి.వి రావచ్చు కదా అనేవాడట. ‘పార్థసారధి గారి కోసమైనా మీరు మా దగ్గరికి రావచ్చు కదా’ అని ఆమె మాకు ఫోన్ చేసేది. ఏడాదికోసారైనా అట్లా పోయిన వాళ్ళమే. ఆ విధంగా ఆయన మా కుటుంబ సభ్యుడయ్యాడు. కానీ ఆమెకు పార్థసారథి గారు కన్నుమూసే దాకా తెలియజేయాలనే విషయమే మా మానసిక స్థితిలో మాకు తోచలేదు. ముఖ్యంగా విజయనగర్ కాలనీ ప్రభాతకర్ అపార్ట్ మెంట్ లో ఈ కలయిక వసంత గారిని మా కుటుంబ సభ్యురాలిని చేసింది.
మళ్లీ ఇసామియా బజార్ లోని ఆయన తొలి పరిచయం రోజుల్లోకి పోతే అటు చాదర్ ఘాట్ లో కమల్ టాకీస్ పక్కన ఉండే ఇళ్ల వరుసలో మా చిన్నక్కయ్య రాధమ్మ ఉండేది. సెలవు రోజు అక్కడికి వెళ్తే , 60- 62 ఎంఏ రోజుల్లో పార్థసారధి గారిని ముందు, వెనుక కలవడం ఒక అదనపు బోనస్. ఎంఏ చదువుతున్న రోజుల్లో మా మిత్రుడు పార్థసారధిని కలిసి వస్తున్నాననో, ఇక్కడి నుంచి వెళ్లి కలుస్తాననో చెప్పిన రోజులు ఇప్పుడు గుర్తొచ్చి – హైదరాబాదులో కొడుకుల దగ్గర ఆమె కూడా ఇప్పుడు జీవిత చరమాంకంలో ఉంది కదా – ఆమెకు 65 ఏళ్ల కింద విన్న పార్థసారథి పేరు ధ్యాస ఉంటుందా. దాదాపు ముప్పై సంవత్సరాలుగా అరుణతార వర్కింగ్ ఎడిటర్ రాంకీ ద్వారా పార్థసారథి విరసం కుటుంబీకుడు కూడా అయ్యాడు. తన పుస్తకాలు అరసవెల్లి కృష్ణ,’అనేక’ బుక్ స్టాల్ కు తీసుకుంటానన్నాడని ఒకసారి చెప్పాడు. అరుణతారలో ఫాసిజం గురించి రాసిన రోజుల్లో, బాల్జాక్ గురించి రాసిన రోజుల్లో నాతో ఫోన్లో చెప్తూనే ఉన్నాడు. అవి పుస్తక రూపంలో వచ్చి నాకిక్కడ చేరాయి కూడా. సెర్వాంటిస్  గురించి రాసిన రోజుల్లో నాతో ఎక్కువసార్లు మాట్లాడాడు. 1986 లో సికింద్రాబాద్ – ముషీరాబాద్ జైల్లో గంజ్ లో ‘డాన్ క్విక్సాట్’ చదువుతూ, నాకు మా మేనల్లుడు రాజు – పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చాడని జైలు ములాఖతు కాగితం వచ్చినా మర్చిపోయానని, జైలు వార్డన్ వచ్చినా తొందర పడలేదని చెప్తే – ఇది నా పుస్తకం అట్ట వెనుక వేయతగ్గ కాంప్లిమెంట్ ఆ పుస్తకానికి అన్నాడు. ఆయన చదివింది రాశులుగా మనకొరకు రాసి వెళ్ళిపోయాడు. ఆయన మాటలు మాత్రం ఆగిపోయాయి.
– వి వి
05.03.2026

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *