బిజెపి ర్యాలీలో దుండగులు చేరారు

వారిని వొదిలిపెట్టే ప్రసక్తే లేదు
ఎంపి ఈటల రాజేందర్‌ ‌హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 22: ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సికింద్రాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించామ‌ని బిజెపి కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారు. పారిపోతున్న వారిని పట్టుకుని మరీ పోలీసులు చితకబాదారు. కాషాయ పార్టీ ఎప్పుడూ ప్రజల రక్షణ, శాంతిని మాత్రమే కాంక్షిస్తుంది. ప్రతీకారం అనేది మా పార్టీలో ఉండదు. కాంగ్రెస్‌ ‌పార్టీ పేరుకే లౌకికవాదం కానీ.. మతోన్మాదులను ప్రోత్సహిస్తోంది.

కాంగ్రెస్ ‌హ‌యాంలో హైదరాబాద్‌లో అనేక సందర్భాల్లో బాంబులు పేలాయి. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్రంలో మోదీ సర్కార్‌ ‌వచ్చాక ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపుతోందని  ఈటల అన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం జరుగుతుందని గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మను కలిశామని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడుల వెనుక ఎవరున్నారో బయటపెట్టలేదని.. ఎవరు ఎందుకు దాడి చేశారో చెప్పలేదన్నారు. ముత్యాలమ్మ ఆలయంలో దాడి చేసిన వారు పక్కనే హోటల్‌లో ఉన్నవారని స్థానికులు చెబుతున్నారన్నారు. హిందువులు జరిపిన ర్యాలీలో బయటివారు కావాలని చేసిన పనికి భక్తులను చితకబాదారని మండిపడ్డారు.

ప్రజలను కొట్టిన పోలీసులకే ప్రమోషన్‌ ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. దీంతో తమపై కూడా హత్యాయత్నం కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు చేసిన వారిని పట్టుకోరంటూ మండిపడ్డారు. సీఎంలను మార్చేందుకు మతకలహాలు సృష్టించిన నీచ చరిత్ర కాంగ్రెస్‌ ‌ది అంటూ విరుచుకుపడ్డారు. మర్రి చెన్నారెడ్డిని దించాలని మతకలహాలు సృష్టించారని.. వందల మంది శవాలపై రాజకీయాలు చేసే పార్టీ కాంగ్రెస్‌ అం‌టూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలో ఉన్న నాడు అనేక ప్రాంతాల్లో బాంబులు పేలాయని గుర్తుచేశారు.

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో శాంతి నెలకొల్పిన పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. ఆలయాలపై దాడులు చేస్తున్న వారిని వదిలిపెట్టి.. శాంతియుత ర్యాలీ నిర్వహించిన తమపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంఐఎం పార్టీ కోసం కాకుండా ప్రజాపాలనపై దృష్టి సారించాలని హితువుపలికారు. రక్తపాతాన్ని ఏ మత పెద్దలు ప్రోత్సహించరన్నారు. ఇప్పటికైనా తమపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. లేదంటే జరిగే పరిణామాలకు సీఎం రేవంత్‌ ‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. కేసీఆర్‌ ‌హయాంలో హక్కులను కాలరాశారని.. పోలీసులతో అణ‌చివేస్తే అన్ని సమస్యలు పరిష్కారం కావని ఎంపీ ఈటల రాజేందర్‌ ‌వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *