వాళ్ళ గుండెల్లో మంట ఉంది

కాళ్ళూ రెక్కలూ లేని తరం మొలిచిందని కలతపడ్డా

కన్నీటి పొరలు ఒక్కొక్కటీ ఆవిరవుతున్నాయి

అలా గాలిలో తేలుతున్న ఒక చిన్న నినాదం

వేసవి రోడ్ల పొగమంచులో

నిన్నటి జ్ఞాపకంలా వినిపించింది

ఆ నినాదం ఎవరిదీ ఎవరి కోసం ఎందుకోసం దేనికోసం

ఆ చిన్న నినాదం విన్నప్పుడు తెలియలేదు

కానీ ఏదో ఒకమార్పు చిన్నగా గుండెల్లో కొట్టుకుంది.

ఇన్నాళ్లకి నేను మళ్ళీ వింటున్నాను

అలాంటి ఓ చిన్న నినాదం

ఇప్పుడు దేశాలు దాటి

ఖండాల మీదుగా పరుగెత్తుతోంది

ప్రతి యువ కంఠధ్వనిలో

తమ హృదయాల్లోని చీకటిని ఆర్పి

వెలుగుల్ని నింపాలన్న సంకల్పమే ధ్వనిస్తోంది

అసమానతల పెద్దగోడలు చిక్కటినీడల్ని పొడిగించాయి

ఆ నీడల్లో నిలబడిన ఇవ్వాల్టి తరం

మౌనాన్ని వీడి, శబ్దం అవ్వాలని

ఒక నిర్ణయం తీసుకుంది

జీవన వ్యయం పెరిగిన ప్రతిరాత్రికి

ఒక కలను కోల్పోయిన ప్రతి ఉదయానికి

పెదవులపై దుమ్ము పట్టిన ఆశలకు

వారు సమాధానం అడిగారు అడుగుతున్నారు

నేపాల్ కొండల్లో గర్జనగా,

ఢాకా వీధుల్లో దూకుడు వానగా,

శ్రీలంక చౌరస్తాల్లో మండే నిప్పులా,

ప్రపంచ యువత గుండెల ధ్వనితో నిండిపోయింది.

వాళ్లకు నాయకులు లేరు, ప్రత్యేక జెండాలు లేవు,

కానీ వాళ్ళ గుండెల్లో మంట ఉంది

“ఇక ఇలా సాగదు” అని కాలానికి

ఎదురు చెప్పే ధైర్యం ఉంది

జీవన వ్యయం పెరుగుతోంది

భవిష్యత్తు తుఫానులో చిరుగుతోంది

అసమానత పెద్ద గోడలా పెరుగుతోంది

ఈ బరువులనూ భారాలనూ

వయసు కన్నా వేగంగా

తమ భుజాలపై మోస్తున్న తరం ఇది

ఒకే ఒక్క భారీ వర్షం

ఓ కుటుంబాన్ని పేదరికంలోకి

నెట్టివేయగల ఇలాంటి కాలంలో

యువత మాత్రమే నిలబడుతున్నారు

తమ కోసం కాదు, రేపటి కోసం.

జీవితం యాభైఏళ్ల క్రితం కంటే ఇవ్వాళ చీకటిగా ఉందని

ప్రపంచంలో చాలామంది చెబుతున్నారు

అయినా, వీధుల్లో నిలబడ్డ యువత ముఖాల్లో

అదే చీకటి నూతన దీపం వెలిగిస్తున్నట్టు కనిపిస్తోంది.

ప్రతి నిరసనలో వారు తమకాలపు

రక్తచరిత్రను రాస్తున్నారు.

ప్రతి నినాదంలో తమ శ్వాసలో దాగిన

భవిష్యత్తును వెదజల్లుతున్నారు

అవి కేవలం ర్యాలీలు కాదు

అవి వర్తమాన యుగపు ఊరేగింపు

ప్రపంచం వెన్నంటే నడుస్తున్న

యువత అడుగులు ఇవ్వాళ

ఒకేమాటను ధ్వనిస్తున్నాయి ప్రతిధ్వనిస్తున్నాయి

“మేమే మార్పు మేమే రేపు”

“ఇక ఇలా సాగదు”

( బాంగ్లా, నేపాల్, శ్రీలంక దేశాల యువతకు ప్రేమతో )

వారాల ఆనంద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *