తెల్ల కాకులు!

            -బమ్మిడి జగదీశ్వరరావు

“ఆ యింటిమీది కాకి ఈ యింటిమీద వాలకూడదు అంటారు కదా?, మరి నువ్వేంటమ్మా ఆ యింటిమీదా యీ యింటిమీదా అన్ని చోట్లా వాలుతున్నావ్?” పిల్లకాకి అడిగింది.

“ఈ యిల్లూ ఆ యిల్లూ వొకప్పుడు వొకటే యిల్లు…” తల్లికాకి తన తాతలు తండ్రులు చెప్పింది తలపోసినట్టు ఆగిపోయింది.

“ఒక కుటుంబం రెండు కుటుంబాలు అయింది సరే, అక్కడి కాకి యిక్కడ వాలకూడదు అని మనమీద పడ్డారేం?” తిరిగి అడిగింది అర్థం కాని పిల్లకాకి.

“రెండు కుటుంబాలమధ్య వైరాన్ని విరోధాన్ని యింకా చెప్పాలంటే శత్రుత్వాన్ని చెప్పడానికి అలా ఆ యింటిమీది కాకి…” అమ్మ చెప్పడం పూర్తికాలేదు. “యీ యింటిమీద వాలకూడదు- అని చెప్పడానికి- మన కాకులే దొరికాయా?” అంది పిల్లకాకి.

“నువ్వు వినలేదా? ఇంటిముందు కాకి అరిస్తే చుట్టాలు వస్తారని యీ మనుషులు అనుకుంటారా? లేదా?” తల్లికాకి చెప్పబోతూ అడిగింది. “ఊ… అనుకుంటారు. శుభ శకునం అని కూడా అనుకుంటారు…” అంది పిల్లకాకి.

“ఈ యింటికి చుట్టాలు ఆ యింటికీ చుట్టాలు అవుతారు కదా?” అడిగింది తల్లికాకి.

“అవుతారు” అంది వూకొడుతూ పిల్లకాకి.

“ఆ యింటికి వచ్చిన చుట్టాలు యీ యింటికి రాకూడదని! మా మధ్య చుట్టరికాలు కలపవద్దని! ఎక్కడివాళ్ళని అక్కడే వుండమని! ఎలాంటి సంబంధ బాంధవ్యాలు వుండకూడదని! ఆఖరికి అక్కడి కాకి యిక్కడ వాలకూడదని!” తల్లికాకి విడమర్చి చెప్పింది.

“చివరికి కాకికి కూడా కన్సిడరేషన్ యివ్వలేదన్నమాట” తనలో తను అనుకున్నట్టుగా పైకే అంది పిల్లకాకి.

“ఆ యింటిమీది కాకి ఈ యింటిమీద వాలుతుంది. నోరున్నందుకు అరుస్తుంది. అరిస్తే?” తల్లికాకి ప్రశ్నించింది.

“కాకి అరిస్తే, శుభమే కదా?” అంది పిల్లకాకి.

“ఆ… ఆ యింట్లో శుభం జరక్కూడదు… అంటే కాకి అరవకూడదు. అరవడం అటుంచి అసలు కాకే వాలేకూడదు…” చెప్పింది తల్లికాకి.

పిల్లకాకి నోరెళ్ళబెట్టి “యీ మనుషుల్ని చూస్తే భయమేస్తోంది” అంది.

తల్లికాకి నవ్వింది.

“నేను మనిషిని కాదు. కాకిని. మా అమ్మలా గొప్ప కాకిని” అంటూ పిల్లకాకి రెండు యిళ్ళమధ్య మొలిచిన సరిహద్దు కంచెను రెక్కలకిందికి తొక్కిమరీ పైకి యెగిరింది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *