- నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలి
- వ్యవసాయ, మార్కెటింగ్, శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం/సత్తుపల్లి, ప్రజాతంత్ర, జనవరి 10: రైతాంగ సంక్షేమమే తొలి ప్రాధాన్యంగా ప్రజాప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. శుక్రవారం మంత్రి సత్తుపల్లి మండలంలో పర్యటించి సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి పలు రోడ్డు నిర్మాణ, సింగరేణి వ్యవసాయ గోదాం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, కో ఆపరేటివ్ సొసైటీ, జిపి. భవనాలను ప్రారంభించారు. బుగ్గపాడు గ్రామంలో బుగ్గపాడు నుంచి నాగుపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులకు, కాకర్లపల్లి గ్రామంలో బిటి, సిసి. రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కాకర్లపల్లి గ్రామంలో నిర్మించిన కోపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ .. కొత్తగూడెం- పాల్వంచ ప్రాంతంలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఈ నెలలో బృందం పర్యటన కూడా ఉంటుందని అన్నారు. పొలాలకు నీరు, పిల్లలకు చదువు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అందించిందన్నారు.
బేతుపల్లి కాలువ తన హయాంలో పూర్తి చేశామని, వేంసూరు మండలం నేడు పచ్చగా తయారైందని తెలిపారు. ఆ మండలంలో యువత అమెరికాలో సంపాదించి నేడు హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ కంపెనీలు ప్రారంభించారని, 40 ఏళ్ళ క్రితం తాగునీరు లేని గ్రామాలు నేడు పంటలమయం చేశామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కొత్త వ్యవసాయ సహకార సంఘాలు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేతో సమన్వయం చేసుకుని ప్రతిపాదనలు పంపాలని మంత్రి సూచించారు. సహకార సొసైటీలను బలోపేతం చేయడం ద్వారా ఎరువులు, గోదాములే కాకుండా యంత్ర సామాగ్రి కూడా అందించే కార్యక్రమం శ్రీకారం చుడుతున్నామని అన్నారు.
రైతుల ముఖాలలో చిరునవ్వు ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారని, రైతు బీమా క్రింద రూ.3 వేల కోట్లు, రైతు బంధు కింద రూ.7600 కోట్లు అందించారని చెప్పారు. జనవరి 26 నుంచి రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో దాదాపు రూ.10 వేల కోట్లు జమ చేయబోతున్నామన్నారు. రాబోయే పంట సీజన్ నుంచి రైతులకు పూర్తి స్థాయిలో పంట బీమా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ రైతుల సంక్షేమం కోసం దాదాపు మొదటి సంవత్సరం 40 వేల కోట్లు ఖర్చు చేశామని, మార్చిలోపు మరో 10 వేల కోట్లు రైతాంగ పథకాల కోసం ఖర్చు పెడతామన్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయు దయానంద్ మాట్లాడుతూ.. కాకర్లపల్లి గ్రామంలో బీటి రోడ్డు, సహకార సంఘం భవనం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సహకార సంఘం ద్వారా రైతులు లబ్ధి పొందాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మన వ్యవసాయ శాఖ మంత్రి స్వయంగా రైతు గనుక, రైతుల కష్టనష్టాలు తెలుసుకొని దానికి అనుగుణంగా పథకాలను ప్రవేశపెడుతున్నారని అన్నారు. సన్న రకం వడ్లకు బోనస్ అందించడం వల్ల ప్రతి రైతుకు ఎకరానికి 10 నుంచి 15 వేల వరకు లాభం వొచ్చిందని అన్నారు. రైతులు పండించే పంటకు బీమా కల్పించే దిశగా ప్రభుత్వం పూర్తి ప్రీమియం చెల్లిస్తూ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు.
పెండింగ్ లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం పనులకు నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారని, త్వరలో యాతాలకుంట వద్ద టన్నెల్ పూర్తి చేసుకుని సత్తుపల్లి, వేంసూరు మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి పనుల కోసం డిఎంఎఫ్‌టి నిధులు, రైతులకు ఉపయోగపడే చెక్ డాం, పొలాలకు వెళ్లే దారులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం సత్తుపల్లి మండలానికి చెందిన 59 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మిషాదీముబారక్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమాలలో డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు, కల్లూరు ఆర్డీవో ఎల్.రాజేందర్, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి మండల తహసీల్దార్ యోగేశ్వర రావు, సొసైటీ అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.



