మానవుడా.. అభినవ దానవుడా
ఈ వింతల విశ్వాన్ని వీక్షిస్తున్న సంబరం
నీరుగారుతోంది నిద్దుర లే
ఏం చెప్పనయ్యా ఇప్పుడు బ్రతుకు
రెప్పలేని కన్నయ్యింది
గరగరల గరళం కన్ను దిగుతోంది
చూశావా నీ రెటీనా చాటున దాగిన దృశ్యాన్ని
బజారున బహిరంగ పరుస్తున్నారెవరో
హ్యాకింగ్ హుక్స్ ఒళ్లంతా పొడుస్తున్నాయి
భద్రతగా వాల్చుకున్న రెప్పల్ని కత్తిరిస్తున్నారెవరో
వ్యక్తిస్వేచ్ఛకు వ్యవస్థకు చిల్లు పెట్టారు చూడు
సాంప్రదాయంగా అన్నీ సర్దుకున్నాననుకోకు
నీ దేహాన్ని నగ్నంగా నిలబెడుతున్నారెవరో
కర్ణాకర్ణిగ దొర్లిన నిషిద్ధ సంభాషణల్ని
మూడో మనిషెడో ముద్రిస్తున్నాడు
నీ హక్కులపై అదృశ్య సంకెళ్లను విసురుతున్నాడు
నీ అంతరంగిక ముచ్చట్లు విని చప్పట్లు కొడుతున్నాడు
పెద్దోడా! ఈ కథ చాలా పెద్దది ముసుగు తీయాలి
మనసుల మధ్య ముసలకం మంట పెడుతోంది
దేశరక్షణ సమాచారమో దేశీయ భక్షణ సమాచారమో
రాజకీయ వెన్నుదన్నుతో రాజ్యమేలుతోంది
ఊర్ధ్వరేఖల మధ్య ఊగిసలాడుతున్న
సగటుమనిషి స్వాతంత్ర్యానికి
కొంగ్రొత్త భావాలు ఊయలలూపాలి
నరుడా జాగ్రత్తపడు
రహస్యాలు రెక్కలు తొడుగుతున్నాయి
నిర్డాక్షణ్యంగా నీ బ్రతుకు ఒలికి పోకుండా చూసుకో
ఇపుడు బ్రతుకుభద్రతకు అభేద్య కవచమొకటి కావాలి
జీవితం ఎప్పుడూ రెప్పలేనీ కన్నవ్వద్దూ





