ప్రతి ఇంటికి ఐఐటీ కలలను సాకారం చేసిన గురువు

“ప్రస్తుతం 101 సంవత్సరాల వయస్సులో ఆయన పడకగదికే పరిమితమైనా, ఆలోచనా శక్తి మాత్రం తగ్గలేదు. రోజూ వార్తలు, భక్తి కార్యక్రమాలు వీక్షిస్తూ, ప్రస్తుత విద్యా విధానం, పాఠ్యాంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.”

స్వాతంత్య్ర  సమరయోధుడు, దూరదృష్టి గల ఉపాధ్యాయుడు, ప్రఖ్యాత విద్యావేత్త   చుక్కా రామయ్య, “ఐఐటీ రామయ్య”గా ప్రసిద్ధి చెందారు. దేశంలోనే అత్యంత కఠినమైన ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష  ఐఐటీ-జేఈఈను అన్ని వర్గాల విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు.  1925 నవంబర్ 20న తెలంగాణలో వరంగల్ జిల్లా గూడూరు గ్రామంలో జన్మించిన రామయ్య, ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీ లో  చేరారు. ఆయన విద్యార్థి దశలోనే స్వాతంత్రోద్యమ  ప్రభావం చూపి, సామాజిక అసమానతలు, ఫ్యూడలిజం వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నారు. ఈ పోరాటాల్లో పాల్గొన్నందుకు ఆయన ఔరంగాబాద్ సెంట్రల్ జైలులో కూడా శిక్ష అనుభవించారు.

స్వాతంత్య్ర సమరయోధుడి నుంచి గురువుగా

లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిజ్ డాటర్ అనేది జవహర్‌లాల్ నెహ్రూ తన కూతురు ఇందిరా నెహ్రూకి రాసిన ఉత్తరాల సమాహారం, ది  డిస్కవరీ ఆఫ్ ఇండియా  వంటి పుస్తకాల ప్రభావంతో విద్య  శక్తిని ఆయన లోతుగా గ్రహించారు. ఉపాధ్యాయ వృత్తినే అత్యున్నత సేవగా భావించి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. అనంతరం నాగార్జునసాగర్‌లోని ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలలో సేవలందించి పదవీ విరమణ పొందారు.  అయితే, పదవీ విరమణ తర్వాతే ఆయన జీవితంలో అత్యంత ప్రభావవంతమైన అధ్యాయం ప్రారంభమైంది.

విద్యలో ఒక విప్లవానికి నాంది

1985లో కొంతమంది విద్యార్థుల అభ్యర్థనతో హైదరాబాద్‌లోని నల్లకుంటలో రామయ్య ఐఐటీ స్టడీ సర్కిల్‌ను స్థాపించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన ఈ సంస్థ, క్రమంగా దేశంలోనే ప్రముఖ ఐఐటీ కోచింగ్ కేంద్రంగా ఎదిగింది.ఈ సంస్థ ప్రత్యేకత ఉదయం 4 గంటలకే తరగతులు ప్రారంభించడం. విద్యార్థుల స్కూల్ సమయాలను దృష్టిలో ఉంచుకుని ఈ విధానం అమలు చేశారు. ప్రతి ఏడాది ఏప్రిల్‌లో ప్రవేశాలు ప్రారంభమై, కఠినమైన ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు.

భావనాత్మక విద్యకు ప్రాధాన్యం

రామయ్య బోధనా విధానం కేవలం సూత్రాల జ్ఞాపకశక్తిపై ఆధారపడేది కాదు. భావనాత్మక అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సంభాషణాత్మక బోధనకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు. ఐఐటీ ప్రశ్నలు జ్ఞాపకశక్తిని కాదు, ఆలోచనా సామర్థ్యాన్ని పరీక్షిస్తాయని ఆయన నమ్మకం. విద్యార్థులే తనకు గురువులని భావించిన ఆయన, వారి కొత్త ఆలోచనలను ప్రోత్సహించారు. ఆయన మార్గదర్శకత్వంలో వేలాది మంది విద్యార్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షలో విజయాలు సాధించారు.

ఫలితాలకు మించిన వారసత్వం

రామయ్య ఐఐటీ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లో ఐఐటీ విజయం అనే పదానికి ప్రతీకగా నిలిచింది. ఆయన పదహారు కి పైగా తెలుగు విద్యా గ్రంథాలను రచించారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి కూడా ఆయన బలమైన మద్దతుదారుడిగా నిలిచారు. బోధన నుండి విరమణ పొందిన తరువాత కూడా  చుక్కా రామయ్య  విద్యా రంగంపై తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, సృజనాత్మకతను పెంపొందించాల్సిన అవసరాన్ని ఎత్తిచూపుతున్నారు.

ప్రస్తుతం 101 సంవత్సరాల వయస్సులో ఆయన పడకగదికే పరిమితమైనా, ఆలోచనా శక్తి మాత్రం తగ్గలేదు. రోజూ వార్తలు, భక్తి కార్యక్రమాలు వీక్షిస్తూ, ప్రస్తుత విద్యా విధానం, పాఠ్యాంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

చుక్కా  రామయ్య  జీవిత ప్రయాణం విద్య ద్వారా సమాజాన్ని మార్చగల శక్తికి ఒక శాశ్వత సాక్ష్యంగా నిలిచింది.

ఫోటో : చుక్కా రామయ్య గారితో వ్యాసకర్త సురేష్ బాబు 

డా.  ముచ్చుకోట . సురేష్ బాబు,  
మొబైల్ : 9989988912

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *