దశాబ్ది తెలంగాణ కథ – గిరిజన జీవనం

ప్రపంచీకరణ నేపథ్యంలో అడవితల్లి బిడ్డలైన గిరిజనులు అనివార్యంగా మైదానప్రాంతవాసులతో సహవాసం చేయాల్సి వచ్చింది. పాశ్చాత్యసంస్కృతి ప్రభావం మారుమూల తండాలకు, గూడేలకు విస్తరించి, ఆదివాసుల జీవనసంస్కృతిని కలుషితం చేసింది. ప్రత్యేకమైన భాషాసంస్కృతులు, వేషధారణ, జీవనవిధానాన్ని నేటితరం కాపాడుకోలేకపోతున్నారు. తెలంగాణ జనాభాలో దాదాపు 10% వరకు గిరిజనులు బంజారాలు, కోయలు, గోండులు, చెంచులు, కొండరెడ్లు, కోలం, తోటి తెగలవారున్నారు. చాలాకాలం మౌలిక సదుపాయాలు లేక విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాలు కొరవడి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయారు. అడవి ఉత్పత్తులను అతితక్కువ ధరకు కాజేసిన దళారులు వారిని బయటి ప్రపంచంతో సంబంధం పెట్టుకోకుండా అడ్డుకున్నారు. వాళ్ళ శ్రమను దోచుకొని ధనవంతులయ్యారు. గిరిజనజనం విద్యకు దూరంగా ఉండిపోవడంతో గిరిజన ఆవాసాల్లో చైతన్యం లేకుండా పోయింది. విప్లవోద్యమాల వ్యాప్తి తర్వాత గిరిజనులలో కొందరు చదువుకొని ఎదగడం, ప్రపంచీకరణ ప్రభావం గిరిజనులలో ఆలోచనను రేపింది. తమ ఉనికిని చాటుకోవడానికి దోహదం చేసింది.

స్వరాష్ట్రపాలనలో ఐదువందల జనాభా కలిగిన గిరిజనగూడేలని, తండాలను, పెంటలని ప్రభుత్వం ప్రత్యేక పంచాయితీలుగా ఏర్పాటు చేసింది. ఐటీడిఏ ద్వారా మౌలిక సదుపాయాలకు పూనుకున్నది. ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాధాన్యమిస్తూ, వారి పండుగలను అధికారికంగా నిర్వహిస్తూ, 25 కోట్ల రూపాయలతో జోడెఘాట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తూ, హైదరాబాద్‌లో గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా ఆదివాసీ, బంజారా భవనాలు నిర్మించి, ఆదివాసుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రకటించుకుంది. అడవిని ఆశ్రయిస్తూ బతికిన ఆదివాసులతో పాటు, మైదానప్రాంతాలైన పల్లెలు, పట్టణాలలో నివాసముంటున్న ఎరుకల పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నోపథకాలు ప్రవేశపెట్టినా, అవి కార్యరూపం దాల్చకపోవడం, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికార్ల అవినీతి పెరిగిపోవడంతో గిరిజనులకు సమన్యాయం జరగడంలేదు.

ఈ నేపథ్యంలో గత దశాబ్దిలో వచ్చిన తెలంగాణ కథలు పరిశీలిస్తే గిరిజనులు ప్రత్యేకంగా రిజర్వేషన్లు పొంది కూడా ఇంకా జీవన ప్రమాణాలు మెరుగ్గవ్వకపోవడం, సామాజిక హోదా లభించక పోవడం కనిపిస్తుంది. స్వరాష్ట్రంలో గిరిజన సంక్షేమ పథకాలు అమలుకోసం బడ్జెట్‌ కేటాయింపులు జరుగుతున్నా వారి సమగ్రాభివృద్ధి అంతంత మాత్రమే ఉండటం, ‘మా ఊళ్ళో మా రాజ్యం’ పేరిట జరుగుతున్న పాలనలో పెత్తనమంతా అగ్రవర్ణుల నిర్ణయాలపైననే కొనసాగుతూ ఉండటం వల్ల గిరిజనాభివృద్ధి కుంటుపడుతూ వస్తున్నది.

దిలావర్‌ రాసిన ‘1/7 I420’ (2015) కథ భూ సమస్యను చిత్రించింది. గిరిజన ప్రాంతాలలో 1/70 చట్టాన్ని అతిక్రమించి గిరిజనుల భూమిని దొరలు ఆక్రమించుకుంటారు. చట్టాలు డబ్బున్న వాళ్ళకు చుట్టాలుగా మారినవైనాన్ని ఈ కథ తెలుపుతుంది. దొర బంధువులను తోడ్కొని అడవిలో ఉన్న భూమిని చూపిస్తూ… ‘‘చూడండి యి పండ్ల తోటలు వందల ఎకరాల నల్లరేగడి చేలు అన్నీ అన్నీ… మనవే మన సొంతమే’’ అంటూ నవ్వుతాడు. ఒకేసారి యివ్వన్నీ గిరిజన చట్టాలు మనలను ఏమి చేయలేవు అని అంటాడు. డబ్బు నాగస్వరం వంటిదని, అది వూదితే ఎలాంటి ఆఫీసు పాములైనా పడగలెత్తి ఆడాల్సిందేనని దొర దర్పాన్ని ప్రదర్శిస్తాడు. ఆదివాసీలంటే అమాయకులని, వాళ్ళను నోరులేని జీవాలుగా చేసి ప్రభుత్వం గిరిజనుల రక్షణ కోసం చేసిన చట్టాలను ప్రభుత్వ అధికారులను చేతిలో పెట్టుకొని, చట్టాలను చుట్టాలుగా మార్చుకుంటున్న దొర ఆగడాలను నిలదీయడానికి సింగన్న సిద్ధపడతాడు. తమ భూములను అన్యాయంగా కాజేసిన దొరను నిలదీయడానికి సింగన్న వెళ్తాడు. అతనితో పాటు గిరిజన గూడెంలోని యువతీ, యువకులు విల్లంబులు ఎక్కుపెట్టి పోరాటానికి సిద్ధపడుతాడు. ఇట్లా గిరిజనులు పోడు చేస్తున్న భూములను అగ్రవర్ణాల వాళ్ళు ప్రభుత్వ అధికారుల అండతో దురాక్రమణ చేస్తున్న వైనం బోధపడుతుంది ఈ కథలో.

దిలావర్‌ రాసిన ‘బొందల గడ్డ’ (2015) కథ గిరిజనుల భూముల్లో బొగ్గు నిక్షేపాల త్రవ్వకాల కోసం ఫ్యాక్టరీలు, కంపెనీలు కట్టించి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తామని మాట ఇచ్చిన యాజమాన్యం ఆ తర్వాత వాళ్ళను మోసగించిన వైనాన్ని తెలుపుతుంది. ఈ కథలో కోయల భూముల్ని ఓపెన్‌ కాస్ట్‌ గనులను ఇస్తామని చెప్పినా, ఆ తరువాత ఎకరానికి మూడు లక్షలు ఇస్తామంటారు. ఒక్కొక్క కుటుంబంలో ఒకరికి చొప్పున ఉద్యోగాలు ఇస్తామని, ఇల్లుకట్టి ఇస్తామని, వైద్యం చేయిస్తామని మాటలు చెప్తూ కాలయాపన చేస్తూ వస్తుంది యాజమాన్యం. వాళ్ళు చెప్పే మాటలు నమ్మని కోయలు యాజమాన్యాన్ని నిలదీస్తారు. దీంతో యాజమాన్యం కొందరికి స్వీపర్లుగా, ఇంకొందరికి సెక్యూరిటీ గార్డులుగా, మరి కొందరికి తట్ట మోసే కార్మికులుగా, టిప్పర్లు, ట్రక్కులు, వ్యాన్లకు డ్రైవర్లుగా ఉద్యోగాలిస్తుంది.

కంపెనీ పడితే మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని, తమకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఆశపడిన గిరిజనులకు నిరాశే ఎదురవుతుంది. నాల్గవ తరగతి ఉద్యోగులకంటే పై స్థాయీ ఉద్యోగాలు ఇవ్వక పోవడంతో మరో దారిలేక ఆ ఉద్యోగాలే చేస్తూ కంపెనీ కట్టించిన గూళ్లలాంటి ఇండ్లలో రోగాలతో అలమటిస్తూ కోయలు బ్రతకాల్సి వస్తుంది. పచ్చని ప్రకృతి నడుమ, పంటపోలాలలో, గలగల పారే వాగులు, వంకలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే కోయలు, దుమ్ము ధూళి నిండిన గాలిని పీలుస్తూ తమ ఉనికిని కోల్పోతారు. సమ్మెట ఉమాదేవి రాసిన ‘చాంది’ (2014) కథ లంబాడీలు తాగుడుకు అలవాటుపడి తమ కుటుంబాలను నిర్లక్ష్యం చేయడంవల్ల కలిగే ఇబ్బందుల్ని, కుటుంబాలు అస్తవ్యస్తమవ్వడాన్ని సూచిస్తుంది. ఈ కథలో చాంది తండ్రి పచ్చి తాగుబోతు. ఇరవైనాలుగు గంటలు తాగి తందనాలాడుతుంటాడు. కన్ను మిన్ను కాన రాకుండా చాంది తల్లిని కొట్టుతుంటాడు. తల్లి ఒక్కతే పిల్లల బాగోగులు చూసేది. యాభై రూపాయల అప్పు దొరకక తల్లి ఎంతో బాధపడుతుంది. ఆమెకు సహాయం చేయడానికి తండాలో ఏ ఒక్కరు ముందుకు రారు.

ఆమెను కొట్టినప్పుడు ఇట్లా కొడుతుంటే, ఆమె ఎలా తట్టుకుంటుంది అని కూడా తండ్రిని నిలదీయడానికి ఎవరూ రారు. ఇంట్లో ఏమి తినకుండ పస్తున్న రోజున ఏ బంధువు వచ్చి ఒకముద్ద పెట్టలేదు. ఆమె అనారోగ్యంతో మంచం పడితే అప్పు ఇవ్వడానికి గాని, వైద్యం చేయించడానికి గాని రాని బంధువులు తల్లి మరణించగానే, చాందికి పెళ్లిచేసి అత్తవారింటికి పంపి, తండ్రికి మరోపెళ్ళి చేయాలని బంధువులు నిర్ణయానికి రావడం చాందిని ఆశ్చర్యపరుస్తుంది. తప్ప తాగుతూ తల్లిని పట్టించుకోక, ఆమె చావుకు కారకుడైన తండ్రికి మళ్ళీ పెళ్ళి చేయించాలని ప్రయత్నిస్తున్న బంధువులను, కష్టంచేసి సొంతపిల్లలను పోషించని వాడు, ఇంకో ఆమెను ఎలా పోషిస్తాడని ప్రశ్నిస్తుంది. అదే మీ నిర్ణయమైతే మేము వేరే ఇంట్లో ఉంటామని, మమ్మల్ని ఎవరూ పోషించాల్సిన అవసరం లేదని, నేనే కూలికి వెళ్ళి చెల్లిని, తమ్ముడిని చదివిస్తానని చెప్పడంతో, పెద్దలు కిక్కురమనకుండా ఉండిపోతారు.
(రాబోయే మూడు వారాల్లో తరువాయి భాగాలు)

-ప్రొఫెసర్‌ బన్న అయిలయ్య

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *