రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణం..

అన్న‌దాత‌ల‌ కష్టాలపై ప్రభుత్వం మొద్దు నిద్ర
మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : రాష్ట్రంలో రైతుల కష్టాలు చూస్తుంటే బాధ కలుగుతుందని మాజీ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న మహబూబాబాద్‌ ‌జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్‌ ‌బుక్కులు, ఆధార్‌ ‌కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ‌పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ ‌పాలనలో రైతే రాజుగా ఉన్న తెలంగాణలో రైతన్నను నట్టేట ముంచి, నడి రోడ్డు మీదకు తెచ్చిన ఘనత రేవంత్‌ ‌రెడ్డికే దక్కుతుందని హరీష్‌ ‌రావు విమర్శించారు.

రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. యూరియా కోసం రైతులు మండుటెండల్లో తంటాలు పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిక్లరేషన్‌ అని దగా చేసి, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్‌ ‌పేరుతో మోసం చేశారని కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంపై హరీష్‌ ‌రావు మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను కంట నీరు పెట్టిస్తున్నరని అన్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియాను సరఫరా చేయాలని డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *