సామాజిక పరివర్తనలో ఉపాధ్యాయుల పాత్ర

_ పుల్లెంల గణేష్ 
(ధర్మ సమాజ్ పార్టీ, స్టడీ & రీసెర్చ్ టీం రాష్ట్ర ఇంచార్జ్)

భారతీయ సంస్కృతిలో గురువుకి ఇచ్చే ప్రాధాన్యత ఏంటో జగమెరిగిన సత్యం. తల్లిదండ్రుల తర్వాత తమ జీవితంలో గురువుని దేవుడిగా పూజిస్తారు. అందువల్లనే భారతీయ సంస్కృతి ప్రపంచ దేశాలకు ఆదర్శవంతమైనది, గురువు లేని విద్య గుడ్డి విద్యగా భారతీయ ప్రజలలో సామెతలుగా చెప్పుకుంటారు. అది ఏ రంగమైనా గురువు లేకుండా విద్యను అభ్యసించడం సాధ్యం కాని పని, అందుచేతనే సమాజంలో అద్భుతమైన మార్పులకి పునాది రాళ్లుగా ఉండే గురువు స్థానానికి అంతటి ప్రాధాన్యత ఉన్నది, అది ప్రాచీన భారతీయ సంస్కృతి నుండి నేటి ఆధునిక సమాజం వరకు కొనసాగుతూ ఉన్నది.

నేటి సమాజంలో శిష్యులు, గురువుల ముందు సందర్భం బట్టి గౌరవం భక్తి శ్రద్ధలు చూయించకపోయినా విద్య నేర్పిన గురువుల పైన, ఉపాధ్యాయ వృత్తి పైన చులకన భావనతో ఉండటం అనేది సమాజంలో గురు శిష్యుల మధ్య ఒకనాటి మానవ నైతిక సంబంధాలు క్షీణిస్తున్నాయి అని చెప్పడానికి నిదర్శనం. ఒక వ్యక్తి ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానంలోకి వెళ్లడానికి తల్లిదండ్రుల తర్వాత గురువు చెప్పే బోధనలే అత్యంత ప్రాధాన్యమైనవి. కాబట్టి ఉపాధ్యాయ వృత్తి అంటే సమాజంలో సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే బోధనల పైనే ఆధారపడి ఉంటది.
గురు శిష్యుల సామాజిక బంధనాల్లో భాగంగా ఆధునిక భారతదేశంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబరు 5 న జరుపుకోవడం అనేది గమనార్హం. భారతదేశానికి  రెండు సార్లు ఉపరాష్ట్రపతిగా, ఒకసారి రాష్ట్రపతిగా పని చేసిన ఉపాధ్యాయ వృత్తి నుండి వచ్చిన సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినన్ని పురస్కరించుకొని ఆయన జన్మదినం ఐన సెప్టెంబర్ 5 ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం . ఒక సందర్భంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అనవసర పొగడ్తలతో, అవార్డులతో తనని సత్కరించడం కంటే, తన జన్మదిన ఉత్సవాన్ని ఉపాధ్యాయ వృత్తికి గౌరవ స్థానం దక్కేలా, ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని కోరడం అది తన మరణనంతరం ప్రభుత్వాలు అమలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.
కానీ కొంత చరిత్ర మూలాల్లోకి వెళితే శూద్ర సామాజిక వర్గానికి చెందిన బరోడా సంస్థన రాజు ఐన శాయాజీరావు గైక్వాడ్ ఆర్దిక సహాయంతో చదువుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్, తన బయోగ్రఫీలో శుద్ర, అతి శూద్రులకి విద్య నిరాకరించడం అది వేదల్లోని పురుష సూక్తలో పేర్కొనడం గొప్ప పని అని సర్వేపల్లి రాధాకృష్ణన్ అభివర్ణించడం తనలో ఉన్న అప్రజాస్వామ్య, అసమానత్వ లక్షణానికి నిదర్శనంగా చెప్పుకోక తప్పదు. కానీ సమాజం నుండి ఏమి ఆశించకుండా సంఘం కోసమే తమ జీవితాన్ని త్యాగం చేసి, పిల్లల్ని కూడా కనకుండా సమాజమే తమ పిల్లలుగా భావించిన మహాత్మా జ్యోతిరావు పూలే దంపతులని నేటి కేంద్ర ప్రభుత్వాలు వారి జన్మదిననికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, బీసీ సామాజిక వర్గానికి చెందిన పూలే దంపతుల పట్ల నేటి కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చిన్న చూపుకి నిదర్శనం.
కాబట్టి భారతీయ వ్యవస్థలో సామాజిక రాజకీయ సాంస్కృతిక పరివర్తన కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఫూలే దంపతులలో సావిత్రిబాయి పూలే జన్మదినం ఐన జనవరి 3 ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని కుల,మతాలకతీతంగా పీడిత కులాల మరియు అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు సావిత్రిబాయి జన్మదిన ఉత్సవాన్ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలని కోరడం మానవత్వంతో, నైతిక విలువలతో కూడిన న్యాయబద్ధమైన అంశం. ఎందుకంటే భారతీయ సామాజిక వ్యవస్థలో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఉపాధ్యాయ దినోత్సవం పేరుతో గుర్తుచేసుకొని సామాజిక గౌరవం ఇవ్వడం అయితే అణగారిన వర్గాలకు చెందిన పూలే దంపతులకు నేటి కేంద్ర ప్రభుత్వాలు తగిన గౌరవం ఇవ్వడం లేదని పీడిత కులాల మేధావులు, ప్రజాస్వామ్యవాదులు భావిస్తున్న అంశం.
అదే విధంగా విద్య వ్యవస్థతో ఎలాంటి సంబంధం లేని సరస్వతి దేవిని చదువుల తల్లిగా భావించడం కంటే, అక్షరం ముక్క రాకున్న తన భర్త ఐన మహాత్మా జ్యోతిరావు పూలే ప్రోత్సాహంతో చదువుకొని సంఘ పరివర్తన కోసం, సమ సమాజ స్థాపన కోసం పాటుపడిన సావిత్రిబాయి పూలేని చదువుల తల్లిగా గుర్తించి, ఆమె జన్మదిన ఉత్సవాన్ని ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలని నేటి సమకాలీన మేధావులు, విద్యావంతులు, ప్రజాస్వామ్యవాదుల డిమాండ్. కాబట్టి నేటి కేంద్ర ప్రభుత్వం మారుతున్న కాలానికి అనుగుణంగా సమాజంలో మెజార్టీ ప్రజల ఆలోచనలకు అనుకూలంగా, సామాజిక ప్రయోజనం చేకూర్చే కార్యక్రమాలు చేపట్టడం నేటి ప్రభుత్వాలపై ఉన్న బాధ్యత. అంతేకాకుండా ప్రజల ఇష్టాల మేరకే పథకాలు ఏర్పాటు చేయించుకోవడం ప్రజాస్వామ్యానికి నిదర్శనంగా చెప్పుకుంటాం.
అంతిమంగా విద్య అంటే గురువు సహకారంతో సత్యాన్ని సత్యంగా, అసత్యన్ని అసత్యంగా గ్రహించడమే నిజమైన విద్య అని గౌతమ బుద్ధుడు రుజువు చేశాడు. కాబట్టి నేటి ఆధునిక ప్రపంచంలో ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తమకు ప్రభుత్వల నుండి రావలసిన సౌకర్యాలు, ఆర్థిక అంశాల కోసం ఏ విధంగా అయితే పోరాటం చేస్తారో, అంతే స్థాయిలో విద్యార్థులకి కావాల్సిన మౌలిక సౌకర్యల కోసం, విద్యార్థుల సమస్యలు స్వల్ప వ్యవధిలో పరిష్కారమయ్యేలా ప్రభుత్వాలను తగిన విధంగా సామాజిక పరివర్తన కోసం పనిచేసేలాగా నేటి ఉపాధ్యాయ లోకం కృషి చేయాలి. అంతే కాకుండా మూడత్వంతో, సామాజిక అంధత్వంతో ఏ విషయాన్ని కూడా విద్యార్థులు నమ్మి చదువుకొని అజ్ఞానంలో ఉండకుండా, విచక్షణ జ్ఞానంతో, మనోనేత్రం తో ప్రతి అంశంలో సత్యాన్ని మాత్రమే విద్యార్థులు చూడగలిగే శక్తిని ఉపాధ్యాయులు బోధించాలి. అంతే స్థాయిలో గురు_శిష్యుల మధ్య సామాజిక గౌరవం, భక్తి,శ్రద్ధలు ఉండేలా విద్యార్థులకి తల్లిదండ్రులు నేర్పించాలి. అంతే కాకుండా గురువుతో ఏ విధంగా నడుచుకొని తమకు కావలసిన జ్ఞానాన్ని స్వీకరించాలో గురు శిష్యుల బంధం ఆరోగ్యవంతంగా ఉండేలా తమ పిల్లలకి ఆయా మానవత్వ, నైతిక విలువలు తల్లిదండ్రులు పెంపొందించాలి. అదే నేటి తల్లిదండ్రుల పై ఉన్న సామాజిక కర్తవ్యం, సామాజిక బాధ్యత అని ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన చారిత్రక సత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *