విద్యార్ది జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయం.

  ( సెప్టెంబర్ 5, గురు పూజోత్సవం)

sunkavalli sathibabuచదువుకోవడానికి అనేక సదుపాయాలు లభిస్తున్న ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలను అక్షరాయుధాలుగా తీర్చిదిద్దాలి.బూజుపట్టిన విధానాలకు తిలోదకాలిచ్చి, నాణ్యమైన విద్యకు ప్రాధాన్యత నివ్వాలి. సమాజంలో ప్రతీ ఒక్కరూ విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించాలి. అలంకార సాధనంగా విద్యను వినియోగించుకుంటున్న నేపథ్యంలో నిజమైన విద్యాగుణసంపన్నుల శాతం తరిగిపోయింది. రాశి పెరిగి,వాసి తగ్గిన విద్యల వలన దేశానికి ఒరిగేదేమీ ఉండదు. ఒకప్పుడు విద్య అనేది విలువలతో, వినయవిధేయతలతో,సంస్కార సుశోభితమై వర్ధిల్లింది. కాలానుగుణమైన మార్పులతో చదువులు నాణ్యత కోల్పోయి, ప్రహసనప్రాయంగా రూపాంతరం చెందాయి. దీనికి ఉపాధ్యాయులను నిందించి ప్రయోజనం లేదు. లోపభూయిష్టమైన విద్యా వ్యవస్థను సరిదిద్ది, విద్య యొక్క ప్రాధాన్యతను పెంచే విధంగా సంస్కరణలు రావాలి. నిజమైన విద్యకోసం పాటుపడాలి. తల్లిదండ్రుల దృక్పథంలో కూడా మార్పు రావాలి. విద్యాసేద్యం లో కాసుల పంట పండాలని కరెన్సీ కట్టలే జీవితానికి పరమార్ధమని భావించి విద్యార్థులను ఇంటి వాతావరణానికి దూరం చేసి, ప్రేమాప్యాయతలకు దూరంగా దూరప్రాంతాల్లోని చదువుల కర్మాగారాల్లో యంత్రాల్లా తయారు చేస్తున్న తల్లిదండ్రులకు ప్రతిఫలంగా ఎదిగొచ్చిన బిడ్డలు వార్ధక్యంలో వృద్ధాశ్రమాలకు సాగనంపుతున్న వైనం విదితమే. అందుకే తల్లిదండ్రులు ఒక స్థాయి వరకు తమ పిల్లలను తమ వద్దే పెరిగేటట్టు చూడాలి. నైతిక ప్రవర్తన ఆవశ్యకత గురించి నేర్పించాలి. ఉపాధ్యాయులు కూడా తమ వృత్తి పట్ల అంకితభావం ప్రదర్శించాలి.

ఉపాధ్యాయులంటే జ్ఞాన ప్రధాతలు. భావితరాన్ని మేథాశక్తి సుసంపన్నులుగా తయారు చేయడంలో వారి పట్ల గురుతరమైన బాధ్యత ఉంది.”విద్యాలయం” అనే ఉద్యానవనంలో విజ్ఞానంతో విరబూసిన పువ్వులే విద్యార్థులు. ఉషః కాంతుల్లో వికసించే పూల వంటి విద్యార్థులను ఆర్ధిక కారణాలతో విద్యకు దూరం చేసి, వారి జీవితాలను వాడిపోయేటట్టు చేయడం క్షంతవ్యం కాదు. ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రుల ఆలోచనా సరళిలో మార్పు తీసుకు రావాలి. శూన్యంలో నుంచి శక్తి జనించదు, ఉపాధ్యాయుల ఆలోచనల్లోనే నిజమైన శక్తి ఉద్భవిస్తుంది. ఆ శక్తి సాధనకై ఉపాధ్యాయులు నిరంతర విద్యార్ధులై శ్రమించాలి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలి. ఉపాధ్యాయుల ధ్యాసంతా విద్యార్థులపై కేంద్రీకరించినప్పుడే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ఉత్తమ ఫలితాలంటే నిష్ఫ్రయోజనమైన మార్కులు,గ్రేడులు, పనికిమాలిన పట్టాలు కానేకావు.

విద్యార్ధులను నాణ్యమైన విద్యాబోధనతోనే విద్య కు వన్నె చేకూరుతుంది. అన్నిరంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దడం… విలువలతో ఉత్తమ పౌరులుగా తయారు చేయడం ఉపాధ్యాయుల విధి.ఏదేశమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే ప్రజలకు సజావుగా జీవించడానికి మౌలిక సదుపాయాలు అందుతాయి.జీవనోపాధి లభిస్తుంది. ప్రజలంతా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా జీవించగలిగినప్ఫుడే అలజడులు,అరాచకాలు తగ్గి ప్రశాంత వాతావరణం ఏర్పడి, శాంతి భద్రతలు నెలకొని, దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. వీటన్నింటికీ మూలాధారం విద్య. విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధం. విద్య ద్వారా సాధించలేని దంటూ ఏదీ లేదు.

అలాంటి నాణ్యమైన విద్య దేశంలో ప్రతీ ఒక్కరికీ అందాలి.సక్రమమైన విద్యల వలన విద్యావంతులు విభిన్న రంగాల్లో తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించి దేశాభివృద్ధిని శిఖరాగ్ర భాగంలో నిలబెట్టగలరు. దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించి నప్పుడే వాటి ఫలాలు కూడా ప్రజలకు దక్కుతాయి.కూడు- గూడు- గుడ్డ వంటి ప్రాథమిక అవసరాలతో పాటు విద్య,వైద్య,ఆరోగ్య సదుపాయాలు చేకూరి, దేశం “మూడు పువ్వలు… ఆరుకాయలు” అన్న రీతిలో వికాసం చెందుతుంది. ఇంతటి మహత్తరమైన శక్తి కేవలం విద్యకే ఉంది. ఆర్ధిక అసమానతలు కూడా కొంతమందిని నాణ్యమైన ఉన్నత విద్యలకు దూరం చేయడం గమనార్హం. యుద్ధాల వలన సాధ్యం కాని మార్పు విద్య అనే ఆయుధం వలన సిద్ధిస్తుంది.మనిషి పరిపక్వత కు విద్య అవసరం. కుల,మత,లింగవయోబేధం లేకుండా ప్రతీ ఒక్కరూ నిరంతరం విద్యను అభ్యసించాలి. మనం ఎంత చదివినా మన జ్ఞానం సంపూర్ణం కాదు. చదివేకొద్దీ మన అజ్ఞానం బయట పడుతూనే ఉంటుంది. అది మన విజ్ఞానానికి బాటలు వేస్తుంది. మనకున్న జ్ఞానం ఆవగింజంత. తెలుసుకోవలసింది సముద్రమంత. మనం మానవ మాత్రులం. జ్ఞాన సంపన్నులమని విర్రవీగడమే నిజమైన అజ్ఞానం. ప్రతీ మనిషి తనకు తాను అజ్ఞానిగానే అంగీకరించాలి. అహం ప్రదర్శించే వారు నిజమైన అజ్ఞానులే. మూర్ఖులు విద్య వలన విజయాన్ని సాధించవచ్చునేమో గాని, యోగ్యులు మాత్రం విజ్ఞానం వలనే కీర్తిని పొందుతారు.

ధనకనక వస్తువాహనాలకంటే సర్వోత్కృష్టమైన సంపద విద్య. విద్య అనేది వెలకట్టలేని ఆభరణం. నీడలా మన వెంటే ఉండే నిజమైన నేస్తం. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మనకు వెన్నదన్నుగా నిలబడేది కేవలం విద్య మాత్రమే.విద్యను పొందడం వేరు.వివేకం వేరు. విద్యావంతులంతా వివేకవంతులు కారు. సంస్కారవంతులసలేకాదు. వివేకం, సంస్కారం,వినయం లేని విద్యలు నిరర్ధకం.సంస్కారమనే సుగుణమే సమాజంలో కీర్తిని పెంచుతుంది. విజ్ఞానం కొరవడిన చదువులు, వివేకం లేని పట్టాలు ఎడారిలోని ఎండమావుల వంటివి. విద్య వలన వినయం పెరగాలి. వినయం వలనే యోగ్యత లభిస్తుంది. విద్యా ధనము అలంకారప్రాయం కాదు. విద్యవలన అహం పెరగరాదు. ఆకలి తీర్చేది అన్నదానమైతే, అక్షరదానం అజ్ఞాన తిమిరాంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగిస్తుంది.చదువు చోరుల హస్తగతం కాదు.

పంచేకొద్దీ తరిగేది సంపదైతే,పెంచేకొద్దీ పెరిగేది జ్ఞానసంపద. నిజాయితీని, నమ్మకాన్ని, విలువలను, వివేకాన్ని, సంస్కారమనే సంపదను పెంచని విద్యలు సమాజానికి గుదిబండలు. సద్గుణాలు కొరవడిన విద్యవంతుల వలన అనర్ధాలే జరుగుతాయి. విద్య పెద్దరికాన్ని, వ్యక్తిత్వాన్ని పెంచాలి. వ్యక్తిత్వం లేని చదువులు అలంకారానికి, అహంకారానికే తప్ప దేనికీ పనికిరావు.”విద్వాన్ సర్వత్ర పూజ్యతే” అన్నారు. ఇది ముమ్మాటికీ నిజం. నిజమైన వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం గా విద్యలు దోహదం చేయాలి. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మాభిమానానికి, ఆత్మవిశ్వాసానికి, సంయమనానికి చదువులు ఆలంబన కావాలి. విద్యార్దులకు చేదోడు వాదోడులా ఆర్ధికంగా ఆసరా కల్పిస్తున్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని విద్యా వికాసం తో ఉత్తమ పౌరులుగా ఎదగాలి.ఈ గురుతరమైన బాధ్యత ఉపాధ్యాయుల భుజస్కందాలపై ఎంతైనా ఉంది.విద్యార్ది జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అనిర్వచనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *