మేలుకోనంత కాలం

దేశమంతటా కులం కంపు, మతం రొచ్చు

మూఢనమ్మకాల మురికికాలువలో

విచ్చలవిడిగా దొర్లుతోందీ దేశం

మానవతా వస్త్రాలను విప్పేసుకొని

అమానవీయతను అంటించుకొని

ఊరేగుతోందీ దేశం

ఓ వైపు

విషంలా వ్యాపిస్తున్నది కులమతాల పిచ్చి

పేట్రేగిపోతున్నది ఉన్మాదం

మరోవైపు

మనమేమో ఉగాది ఉత్సవాలంటున్నాం

ప్రభుత్వాలేమో ఊదరగొట్టు ఉపన్యాసాలిస్తున్నాయి

మామిడి పిందెల్ని కాదు

పొత్తికడుపులోనే కరిగిపోతున్న పిండాల్ని చూడండి

కోకిల కూతల్ని కాదు

నలిగిపోతున్న మగువల ఆర్తనాదాల్ని వినండి

చెరుకుగడల్ని కాదు

చేదెక్కుతున్న బాల్య జీవిత చిగుర్లని పరికించండి

వేపపువ్వుల్ని కాదు

లేతనవ్వులు చిదిమేయబడుతున్న దృశ్యాన్ని గమనించండి

భక్ష్యాల్ని భుజించడం కాదు

మన బతుకుల్ని భక్షిస్తున్న బకాసురులెవరో గ్రహించండి

మేలుకోనంత కాలం

పెను నిద్దుర వదులుకోనంత కాలం

చైతన్యవంతమవనంత కాలం

అసలైన ఉగాదులుండవు

ఆ నవయుగమెంతో దూరమే!

చేరుకోలేని గమ్యస్థానమే

కార్తీక రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *