జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల వెనుక అస‌లు నిజం!!

భార‌తీయ స‌రుకుల‌పై యు.ఎస్‌. విధిస్తున్న 50% టారిఫ్ ప్ర‌భావాన్ని, ఈ జీఎస్టీ స‌వ‌ర‌ణ కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దు. ఎట్లా అంటే, యు.ఎస్‌.కు ఎగుమ‌తి చేస్తున్న వ‌స్తువుల‌ను ఈ త‌గ్గించిన జీఎస్టీ ప్ర‌కారం దేశీయ మార్కెట్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచుతారు. కానీ ఇప్పుడు కేంద్రం చైనాతో సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించ దిశ‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌, ఆ దేశానికి చెందిన వ‌స్తువులు కారుచౌక‌గా మ‌న‌దేశ మార్కెట్‌ను ముంచెత్త‌క మాన‌వు. మ‌ళ్లీ పెద్ద ఎత్తున వాణిజ్య లోటు ఏర్ప‌డ‌ట‌మే కాదు, జీఎస్టీ త‌గ్గింపు ద్వారా ఏ ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ముందుకు పోతున్న‌దో అది పూర్తిగా దెబ్బ‌తింటుంది. చైనా కంటే మ‌న స‌రుకుల ధ‌ర‌లు అధికం కావ‌డంతో, ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు నిన‌దిస్తున్న ”ఆత్మ నిర్భ‌ర్ భార‌త్” ల‌క్ష్యం పూర్తిగా దెబ్బ‌తిన‌డం ఖాయం.

ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నార్థ‌మే ప‌న్నుల వ్య‌వ‌స్థ‌లో సంస్క‌ర‌ణ‌లు తీసుకొస్తున్నామ‌ని ఒక‌ప‌క్క ప్రభుత్వం చెబుతుంటుంది. కానీ వారిపై ఏదోవిధంగా ప‌న్నుల బాదుడును కొన‌సాగిస్తూనే ఉంటుంది . నిజం కాదా? ఇది కేవ‌లం మూర్ఖంగా చెబుతున్న మాట కాదు. నిజం చెప్పాలంటే ప‌న్నుల పేరుతో ప్ర‌జ‌ల జేబుల‌కు చిల్లు పెట్ట‌డం కాక మ‌రేంటి? సంక్లిష్ట‌మైన ప‌రోక్ష ప‌న్ను విధానం జీఎస్టీని పూర్తిగా సంస్క‌రిస్తున్నామంటూ జీఎస్టీ కౌన్సిల్ ప్ర‌క‌టించింది. ముఖ్యంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌పై విధించే జీఎస్టీని త‌గ్గిస్తున్నామ‌న్న‌ది ఆ ప్ర‌క‌ట‌న సారాంశం. వెంట‌నే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్పందిస్తూ, సామాన్యులు, రైతులు, ఎంఎస్ ఎంఈలు, మ‌ధ్య‌త‌ర‌గ‌తివారు, యువ‌కులు, మ‌హిళ‌ల‌కు వీరంద‌రికీ ఈ సంస్క‌ర‌ణ‌లు ఎంతో ప్ర‌యోజ‌న‌కారిగా ఉంటాయ‌ని పేర్కొన్నారు.

ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌టం ఆల‌స్యం, ఇక అధికార పార్టీకి అనుకూల టీవీ యాంక‌ర్లు, మ‌ద్ద‌తుదార్లు, మీడియా సంస్థ‌లు ఒక్క‌సారిగా అత్యుత్సాహాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ, ఇదొక విప్ల‌వాత్మ‌క‌, వివేచ‌నాయుత ఆర్థిక విధాన‌మ‌ని ఊదర కొట్ట‌డ‌మే కాకుండా, ప్ర‌ధానిని ఒక గొప్ప దార్శ‌నికుడిగా చూపించేందుకు నానా హైరానా ప‌డ్డాయి. కానీ ప్ర‌ధాని త‌న ప్ర‌క‌ట‌న ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు జీఎస్టీపై విధిస్తున్న స్లాబులు అసంబద్ధంగా ఉన్నాయ‌ని అంగీక‌రించిన‌ట్టేక‌దా! ఈ నేప‌థ్యంలో ఈ అసంబ‌ద్ధ‌త గురించి తెలుసుకోవ‌డానికి ఎనిమిదేళ్ల కాలం ప‌ట్టిందా? అంటూ విమ‌ర్శ‌కులు దెప్పి పొడ‌వ‌డం స‌హ‌జం. ఇదే స‌మ‌యంలో నిపుణులు కూడా ఈ సంక్లిష్ట ప‌రోక్ష ప‌న్ను విధాన‌మైన జీఎస్టీలో ఎంత‌మాత్రం పార‌ద‌ర్శ‌క‌త లేద‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అదీకాకుండా దీర్ఘ‌కాలంలో దేశానికి ఈ ప‌న్ను విధానం ఎంతో ప్ర‌యోజ‌నం చేకూరుస్తుందంటూ ఇప్ప‌టి వ‌ర‌కు ఊదర కొట్ట‌డంలో నిజం లేద‌ని తేలిపోతున్న‌ది.

అయితే ప్ర‌జ‌ల‌పై ప‌న్నుభారం త‌గ్గించ‌డానికి చేసే ఎటువంటి య‌త్న‌మైనా ఆహ్వానించ‌ద‌గిందే. ఇటువంటి చ‌ర్యను విమ‌ర్శించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. కానీ ఇంత‌కాలం త‌ర్వాత ప్ర‌భుత్వం ఈ చ‌ర్య తీసుకోవ‌డానికి ప్రేర‌ణ క‌లిగించిన ప‌రిస్థితులేంట‌నేవి విమ‌ర్శ‌కులు సంధిస్తున్న ప్ర‌శ్న‌! అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ప్ర‌భుత్వం రెండు క‌ఠిన ఐచ్ఛికాల మ‌ధ్య ఇర‌కాటంలో ప‌డింద‌నేది వారి అంచ‌నా. వీటిల్లో మొద‌టిది ర‌ష్యానుంచి రాయితీతో చ‌మురు కొనుగోలు చేయ‌డాన్ని కొన‌సాగించాలా? లేక ట్రంప్ విధించిన 50% , అనుబంధ సుంకాల‌ను భ‌రిస్తూ ముందుకు కొన‌సాగాలా? అన్న రెండు అంశాలు ప్ర‌భుత్వాన్ని ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి నెట్టాయ‌న్న‌ది వీరి అంచ‌నా. ఇప్పుడు జీఎస్టీ త‌గ్గింపు ఒక‌ర‌కంగా సామాన్యుల‌కు ”మ‌ధ్యాహ్న భోజ‌నం” వంటిద‌ని భావించినా, ఇవి వారికి ఏఏ అంశాల్లో ఎంత‌మేర ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌నే విష‌యంలో ఇంకా స్ప‌ష్ట‌త లేదు.

ఇక త‌యారీదార్లు ప్ర‌భుత్వం జీఎస్టీ రూపేణా క‌లిగిస్తున్న ప్ర‌యోజ‌నాన్ని త‌మ లాభాల‌కు ఎటువంటి ధోకాలేకుండా వినియోగదారులకు చేర‌వేస్తార‌న్న‌ది కూడా ప్ర‌శ్నార్థ‌క‌మే. ఏవిధంగా అనుకున్నా, ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జీఎస్టీ వ్య‌వ‌స్థ‌, ట్రంప్ విధిస్తున్న 50% టారిఫ్ ప్ర‌భావం, మ‌న‌దేశం యు.ఎస్‌.కు ఎగుమ‌తి చేస్తున్న వ‌స్తువు ల‌పై ఎక్కువ‌గా ప‌డ‌కుండా ఉండేందుకే న‌ని భావించాల్సి ఉంటుంది. ఈవిధంగా జీఎస్టీలో చేప‌ట్టిన సంస్క‌ర‌ణ‌ల సాంద్ర‌త‌ ఎంత‌వ‌ర‌కు ఉంటుంద‌నేది ఇప్పుడే చెప్ప‌డం సాధ్యం కాదు. అమెరికా విధించిన టారిఫ్‌ల నేప‌థ్యంలో, అంతర్జాతీయంగా ఎదుర‌వుతున్న స‌వాళ్ల నేథ్యంలో, జాతీయ ఆర్థిక స్థితిస్థాప‌క‌త కోసం ప్ర‌భుత్వం జీఎస్టీ స‌వ‌ర‌ణ‌లు చేప‌ట్టింద‌నుకోవాల్సి వ‌స్తోంది. యు.ఎస్‌. పెంచిన దిగుమ‌తి సుంకాలు, చైనాతో సంబంధాల పున‌రుద్ధ‌ర‌ణ నేప‌థ్యం, అన్నింటికీ మించి బిహార్ ఎన్నిక‌లు, కేంద్ర ప్ర‌భుత్వాన్ని జీఎస్టీ సంస్క‌ర‌ణ మార్గాన్ని ఎంచుకునేలా చేశాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అంటే అంత‌ర్జాతీయ ఆర్థిక రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులు, దేశీయ రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ విధ‌మైన ప్ర‌య‌త్నాలు చేప‌ట్ట‌డానికి మూల‌కార‌ణం.

భార‌తీయ స‌రుకుల‌పై యు.ఎస్‌. విధిస్తున్న 50% టారిఫ్ ప్ర‌భావాన్ని, ఈ జీఎస్టీ స‌వ‌ర‌ణ కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌ల‌దు. ఎట్లా అంటే, యు.ఎస్‌.కు ఎగుమ‌తి చేస్తున్న వ‌స్తువుల‌ను ఈ త‌గ్గించిన జీఎస్టీ ప్ర‌కారం దేశీయ మార్కెట్ల‌లో వినియోగ‌దారుల‌కు అందుబాటులో ఉంచుతారు. కానీ ఇప్పుడు కేంద్రం చైనాతో సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించ దిశ‌గా తీసుకుంటున్న చ‌ర్య‌ల వ‌ల్ల‌, ఆ దేశానికి చెందిన వ‌స్తువులు కారుచౌక‌గా మ‌న‌దేశ మార్కెట్‌ను ముంచెత్త‌క మాన‌వు. మ‌ళ్లీ పెద్ద ఎత్తున వాణిజ్య లోటు ఏర్ప‌డ‌ట‌మే కాదు, జీఎస్టీ త‌గ్గింపు ద్వారా ఏ ల‌క్ష్యంతో ప్ర‌భుత్వం ముందుకు పోతున్న‌దో అది పూర్తిగా దెబ్బ‌తింటుంది. చైనా కంటే మ‌న స‌రుకుల ధ‌ర‌లు అధికం కావ‌డంతో, ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌ర‌కు నిన‌దిస్తున్న ”ఆత్మ నిర్భ‌ర్ భార‌త్” ల‌క్ష్యం పూర్తిగా దెబ్బ‌తిన‌డం ఖాయం. ఫ‌లితంగా భార‌త్‌ను త‌యారీ హ‌బ్‌గా మార్చాల‌న్న ప్ర‌య‌త్నాలు, కొన్ని ట్రిలియ‌న్ డాల‌ర్ల ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా రూపొందించాల‌నుకున్న ల‌క్ష్యాలు పూర్తిగా దెబ్బ‌తింటాయి. ఎప్ప‌టిక‌ప్పుడు వూహించ‌ని రీతిలో అమెరికానుంచి ఎదుర‌య్యే బెదిరింపులు, సూప‌ర్ ప‌వ‌ర్‌గా ఎదగాల‌న్న ల‌క్ష్యంతో చైనా ఆధిప‌త్య ధోర‌ణి, మ‌న‌దేశం అనుకున్న ల‌క్ష్యాల సాధ‌న‌లో ప‌రిమితులు విధిస్తున్నాయ‌న‌డంలో సందేహం లేదు.

అయితే ప్ర‌స్తుతం కేంద్రం తీసుకొస్తున్న జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయ‌న‌డంలో సంశ‌యించాల్సిన ప‌నిలేదు. కేంద్రం ఇప్ప‌టికిప్పుడు తీసుకొచ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌లు సామాన్యుల‌కు ఎంత‌వ‌ర‌కు మేలు చేస్తాయ‌న్న‌ది ప‌క్క‌న పెడితే, ట్రంప్ తీసుకున్న‌ చ‌ర్య ఎంత‌టి వికృత‌మైన‌దైనా, ప్ర‌భుత్వ వీర స‌మ‌ర్థ‌కులు మాత్రం కేంద్రం జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల దిశ‌గా చ‌ర్య‌లు తీసుకునేలా తొంద‌రపెడుతున్నార‌న‌డంలో ఎంత‌మాత్రం సందేహం లేదు. మ‌రి ఈ చ‌ర్య ద్వారా దేశీయ మార్కెట్లు పుంజుకుంటాయా? చైనా నుంచి వ‌చ్చే చౌక వ‌స్తువుల‌ను మ‌న దేశీయ ఉత్ప‌త్తులు త‌ట్టుకొని నిల‌బ‌డ‌గ‌లుగుతాయా? ఆర్థిక వ్య‌వ‌స్థ స్వ‌యం స‌మృద్ధ‌త సాధిస్తుందా? అనే ప్ర‌శ్న‌ల‌కు కాలం మాత్ర‌మే స‌మాధానం చెప్ప‌గ‌ల‌దు. ప‌న్నుల సంస్క‌ర‌ణ‌లు, మ‌రే ఇత‌ర ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు దేశీయ రాజ‌కీయ ల‌క్ష్యాల‌ను సాధించ‌డానికి, రైట్ వింగ్ మీడియా ట్రంప్‌ను ట్రోల్ చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డొచ్చేమో కానీ, ప్రపంచ ఆర్థిక వ్య‌వ‌స్థ నుంచి ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డానికి ఎంత‌మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌వు.

-శామ్ సుందర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *