‘డిజిటల్‌ వ్యసన’ కట్టడికి ఏకైక మార్గం “డిజిటల్ ఉపవాసమే”‌

“డిజిటల్‌ వ్యసనం మితిమీరితే పిల్లలు మానసిక క్షోభ, క్రియాత్మక బలహీనతలకు దారి తీస్తుందని సర్వే నిర్వచిస్తున్నది. డిజిటల్‌ అడిక్షన్‌ హద్దులు దాటితే ఏకాగ్రత క్షీణించడం, నిద్రలేమా సమస్యలు ఉత్పన్నం కావడం, ఆందోళన/నిరాశ/ఒత్తిడి ప్రమాదకర స్థాయికి పెరగడం, విద్యార్జన కోరిక తగ్గడం, సామాజిక సంబంధాలు తగ్గడం, ఒంటరితనం వేధించడం, చురుకుదనం మాయం కావడం, నైపుణ్యాలు తగ్గడం, పనితీరు క్షీణించడం, ఉత్పాదకత తగ్గడం లాంటి పలు అనర్థాలు జరుగుతున్నట్లు గమనించారు.”

భారతదేశవ్యాప్తంగా బాలలు, కౌమార దశ యువతలో క్రమంగా స్క్రీన్‌ టైమ్‌ పెరుగుతూ, “డిజిటల్‌ వ్యసనం ప(డిజిటల్‌ అడిక్షన్‌)” బారిన పడుతూ, తమ ఆరోగ్యాలను మొగ్గ స్థాయిలోనే కోల్పోతున్నారని 29 జనవరి రోజు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన “2025 – 26 ఆర్థిక సర్వే” హెచ్చరికలు చేయడం గమనార్హం. స్మార్ట్‌ఫోన్లు, సామాజిక మాద్యమాలు, గేమింగ్‌ యాప్‌లు, ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లతో మితిమీరిన వాడకంతో వారి చదువులపైననే కాకుండా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలపై కూడా తీవ్రమైన దుష్ప్రభావాలకు చూపుతున్నట్లు సర్వే పేర్కొంటున్నది. వయస్సు ఆధారిత డిజిటల్‌ పరిమితులను విధించవలసిన సమయం ఆసన్నమైనదని హెచ్చరికలు చేసింది. అపరిమిత డిజిటల్‌ వినియోగదారుల్లో అధికంగా బాలలు, కౌమార దశ పిల్లలు ఉండడంతో రేపటి భారత భవ్య భవిష్యత్తు సంక్షోభంలో పడవచ్చని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. హానికరమైన కంటెంట్‌ ఉన్న యాప్‌ల్లో మునిగి తమ చిరు జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారని పేర్కొనడం చూస్తున్నాం.

డిజిటల్ స్క్రీన్‌టైమ్‌ మితిమీరితే అతి ప్రమాదం:

          డిజిటల్‌ వ్యసనం మితిమీరితే పిల్లలు మానసిక క్షోభ, క్రియాత్మక బలహీనతలకు దారి తీస్తుందని సర్వే నిర్వచిస్తున్నది. డిజిటల్‌ అడిక్షన్‌ హద్దులు దాటితే ఏకాగ్రత క్షీణించడం, నిద్రలేమా సమస్యలు ఉత్పన్నం కావడం, ఆందోళన/నిరాశ/ఒత్తిడి ప్రమాదకర స్థాయికి పెరగడం, విద్యార్జన కోరిక తగ్గడం, సామాజిక సంబంధాలు తగ్గడం, ఒంటరితనం వేధించడం, చురుకుదనం మాయం కావడం, నైపుణ్యాలు తగ్గడం, పనితీరు క్షీణించడం, ఉత్పాదకత తగ్గడం లాంటి పలు అనర్థాలు జరుగుతున్నట్లు గమనించారు. పెద్దల్లో సహితం డిజిటల్‌ స్క్రీన్‌ టైమ్‌ పెరగడంతో సైబర్‌ మోసాలు/బెదిరింపులు పెరగడం, ఆన్‌లైన్‌ ఖర్చులు పెరగడం, ఉపాధి అవకాశాలు తగ్గడం, ఉత్పాదకత పడిపోవడం గమనిస్తున్నాం. పిల్లలు, యువతలో మితిమీరిన స్క్రీన్‌టైమ్‌ ఫలితంగా మానసిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతున్నది. డిజిటల్‌ అడిక్షన్‌ వలలో చిక్కి 3 – 5 గంటలకు పైగా నీలి తెరల ముందు కూర్చున్నా పిల్లల్లో శారీరక శ్రమ తగ్గడం వల్ల ప్రమాదకర జీవనశైలి వ్యాధులు పెరగడం గమనిస్తున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్‌ వ్యసన”‌ కట్టడికి డిజిటల్‌ ఉపవాసమే” ఏకైక మార్గం:

15 నుంచి 24 ఏండ్ల వయస్సు యువభారతం సోషల్‌ మీడియా వ్యసన వలలో చిక్కడం వల్ల ఆందోళన, నిరాశ, ఆత్మగౌరవ సమస్యలు, సైబర్‌ బెదిరింపుల ఒత్తిడి, ఆత్మహత్యల రేటు పెరగడం చూస్తున్నాం. డిజిటల్‌ అడిక్షన్‌ దుష్ప్రభావాలను తగ్గించేందుకు “డిజిటల్‌ ఫాస్టింగ్‌” వ్రతం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి ప్రతి రోజు కొన్ని గంటల పాటు లేదా వారానికి 1 లేదా 2 రోజుల పాటు ‌స్మార్ట్ తెరలకు దూరంగా ఉండడాన్ని డిజిటల్‌ ఫాస్టింగ్‌ (ఉపవాసం) అని పిలుస్తున్నాం. 2024లో భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగదారులు 43 శాతం సామాజిక మాద్యమాలను వాడినట్లు సర్వేలు నిర్థారిస్తున్నాయి. పాఠశాలల్లో శారీరక వ్యాయామం తప్పనిసరి చేయడంతో పాటు స్ర్కీన్‌టైమ్‌ నిర్వహణపై తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వాల్యిన సమయం ఆసన్నమైందని సూచిస్తున్నారు.

దీనితో పాటుగా వయస్సును బట్టి డిజిటల్‌ యాక్సస్‌ విధానాలు, హానికర కంటెణట్‌ హాస్టుల విపరీతాలను అదుపు చేయడం, స్ర్కీన్‌ టైమ్‌ను విధిగా తగ్గించడం జరగాలి. ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్దిష్ట వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు సోషల్‌ మీడియా ఖాతాలపై నిషేధం విధించడం ఇతర దేశాలను మార్గదర్శకం చేయాలి. దక్షిణ కొరియా సహితం “షట్‌డౌన్‌ చట్టం” ద్వారా మైనర్లు గేమింగ్ వెబ్‌సైట్లను వాడకుండా పరిమితులు విధించడం హర్షదాయకం. ఇదే క్రమంలో సింగపూర్‌, ఫ్రాన్స్, స్పెయిన్‌, ఫిన్లాండ్‌, జపాన్‌, బ్రెజిల్‌, కొన్ని యూఎస్ రాష్ట్రాలు కూడా డిజిటల్‌ అడిక్షన్‌ విషయంలో తగు చర్యలను తీసుకోవడం జరిగింది.

డిజిటల్‌ అడిక్షన్‌ మరింత విష ప్రభావాన్ని చూపకముందే భారత ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోని తగు చట్టాలను చేయడం, తల్లితండ్రులు మేల్కొనడం, విద్యాలయాలు శారీరక శ్రమకు పెద్ద పీట వేయడం, పౌర సమాజం కీలక పాత్రలను నిర్వహించడం సత్వరమే జరగాలి. డిజిటల్‌ తెరలు యువభారత భవిష్యత్తును, మానసిక ఆరోగ్యాలను, సామాజిక అభివృద్ధిని దెబ్బతీయకుండా అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆశిద్దాం. రేపటి తరం ఉజ్వల భవితకు డిజిటల్‌ వెలుగులు ఉపయోగపడే విధంగా మార్గదర్శనం చేద్దాం.

 డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి

9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *