కాగల కార్య గంధర్వ బబ్లూ!

 “ఇంకో మాట చెప్పు” అంది అనసూయ. మాలతి మాట్లాడలేదు. “అంతేలే, యెవరైనా ఆరుమాసాలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, అలాంటిది ఆరేళ్ళు సంసారం చేస్తే?” నవ్వింది అనసూయ. మాలతి నవ్వలేదు. “కానీ, భార్యాభర్తల్లో యెక్కువ మంది భర్తల్నే అనుసరిస్తారు భార్యలు” చివరి పదం వొత్తి పలుకుతూ అంది అనసూయ, ఆమాటలో ‘నువ్వు కూడా అంతే, అందర్లానే’ అనే దెప్పకనే దెప్పిన దెప్పిపొడుపు వుంది. మాలతి తలెత్తి యెటో చూసింది, కాని కళ్ళలో కళ్ళు కలపలేదు. “మీ ఆయనకు పెట్స్ అంటే యిష్టం. చిన్న కుక్కపిల్లని పెంచుకోవాలని పెళ్ళి చూపులప్పుడే చెప్పాడు కదా?” గుర్తుచేసింది చేసింది అనసూయ, పెళ్ళి చూపులప్పుడు మాలతి తనతో పంచుకున్న మాటలే అవి. మాలతి మూగగా చూసింది.
“అప్పుడు నువ్వేమన్నావ్? ‘నో నాకు పెట్స్ అంటే పడదు. భయం. నా చిన్నప్పుడు కుక్క కరిచింది, చాలా యింజక్షన్లు వేసుకున్నాను… సో…’ అన్నావ్. తనూ ‘వోకే, నో ప్రాబ్లెమ్’ అన్నాడు. అప్పుడు కాదన్న నువ్వే యిప్పుడు మళ్ళీ అవునని తెచ్చి యింట్లో కుక్కని పెట్టావ్…” అనసూయ అర్థంకానట్టు చూసింది. మాలతి తలూపింది.
“తను  నిన్ను  అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకున్నావ్. తన యిష్టాన్ని కన్సిడర్ చేశావ్… యిదేనేమో ప్రేమంటే?” చిన్నగా నవ్వింది అనసూయ.
“ప్రేమా గాడిద గుడ్డా? వర్క్ ఫ్రమ్ హోమ్ అని కనీసం కదలకుండా నెలకు మూడేసి కేజీలు పెరుక్కుంటూ పోతున్నాడు. పెళ్ళికి ముందు జిమ్ చేసి కండలు చూపించాడు. పెళ్ళయ్యాక జిమ్ మానేసి తుంబ పెంచాడు. చల్లగాలికి డాబా మీదకు వెళదామని అంటే కూడా రెండు ఫ్లోర్లు యెక్కడానికి కూడా అలసి ఆయాసపడిపోతున్నాడు…” మాలతి చెపుతుంటే అనసూయ అడ్డం పడింది.
“దానికీ దీనికీ సంబంధం యేమిటి? కుక్కని పెంచడం యేమిటి?” “మా ఆయన సిస్టమ్ ముందు కూర్చొని కూర్చొని పాస్‌కు కూడా వెళ్ళడు. మధ్యలో పాస్‌కు వస్తే లేచి వెళ్లాలని స్కూల్లో పిల్లాడిలా నీళ్ళు కూడా తాగడం మానేస్తున్నాడు. అదే మా బబ్లూకి… కుక్కకి పాస్‌కి వస్తే, టూకి వస్తే…” మాలతి ఆగి చూసింది. “లేచి బయటకు తీసుకువెళ్ళాలి కదా? రెండుపూటలూ తిప్పి రావాలి కదా?” అంది అనసూయ అర్థం చేసుకుంటున్నట్టు. “యెస్… మా ఆయన చేత జిమ్ కాదు కదా, వాకింగు కూడా చేయించలేను, కాని మా బబ్లూగాడు ఆపని యీజీగా చేయిస్తున్నాడు… వాకింగ్ చిన్న రన్నింగ్…” మాలతి కళ్ళలో ఆనందానికి రెప్పలు టపటపమని తప్పట్లుకొట్టడం చూసి అనసూయకు మరే అనుమానమూ రాలేదు!
-బమ్మిడి జగదీశ్వరరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page