‘మార్వాడీ గోబ్యాక్’ జాతి సమస్య కాదు, దోపిడీ సమస్య!

“మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు. కాని, ప్రకృతిలో, సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా ఏమీ రావు. ఎంతోకాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా, పైకి కనబడకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర విస్ఫోటనం జరుగుతుంది. తత్వశాస్త్ర పరిభాషలో పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా మారే ఘటనగా, బిందువుగా దాన్ని గుర్తిస్తారు. నిశితంగా పరిశీలిస్తే ఆ బిందువు మిగిలిన అన్ని బిందువులలాంటిదే అయినా, హఠాత్తుగా ఆ బిందువు దగ్గరే విస్ఫోటనం జరిగినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు నీటిని వేడి చేస్తున్నప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. తొంబై ఎనిమిది డిగ్రీల నుంచి తొంబై తొమ్మిది డిగ్రీలకు ఉష్ణోగ్రత మారినప్పుడు నీరు యథాతథంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. తొంబై తొమ్మిది డిగ్రీల నుంచి వంద డిగ్రీలకు మారడం కూడా అటువంటి మార్పే. అంతకు ముందు జరిగినలాంటి ఒక్క డిగ్రీ పెరుగుదలే. కాని, ఆ ఒక్కడిగ్రీ పెరుగుదలే ఇప్పుడు మాత్రం నీటిని ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మార్చి, ఆవిరికి కారణమవుతుంది.”

telanganardham

రాష్ట్రం పదిహేను రోజులుగా ‘మార్వాడీ గో బ్యాక్’ నినాదంతో అట్టుడుకుతున్నది. ఇందులో ‘మార్వాడీ’ అనే మాట రాజస్థాన్ లోని మార్వార్ ప్రాంతం నుంచి వచ్చినవారు అని మాత్రమే కాదు. రాజస్థాన్ లోని ఇతర ప్రాంతాల నుంచీ, గుజరాత్ నుంచీ, మొత్తంగా ఉత్తరాది నుంచీ తెలంగాణకు చేరి, ప్రధానంగా వ్యాపార రంగంలో ఉన్న అనేక మంది ఈ నినాదానికి లక్ష్యం. ఆ రకంగా “మార్వాడీ” అనేది సర్వనామం. కొంత కాలంగా ఇటువంటి వ్యాపార వర్గాలు తెలంగాణలో కేవలం ఆర్థిక, వ్యాపార రంగాలకు మాత్రమే పరిమితం కాకుండా, సామాజిక,  సాంస్కృతిక, రాజకీయ రంగాలను కూడా ఆక్రమిస్తుండడం ప్రస్తుత ఆగ్రహానికి కారణం. వారివల్ల తమ వ్యాపార, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని మొదట తెలంగాణ వ్యాపార వర్గాలలో మొదలయిన ఆందోళన, క్రమంగా వారి సామాజిక, సాంస్కృతిక, రాజకీయ విస్తరణ వల్ల అన్ని వర్గాలలోకీ ప్రవహించింది. ముఖ్యంగా తెలంగాణ అస్తిత్వ పోరాటంలో పాల్గొన్న అనేక సమూహాలు ఈ ఆగ్రహంలో ప్రధాన పాత్ర వహిస్తున్నాయి. ఉత్తరాది ఆధిపత్యం గురించి, ద్రావిడ అస్తిత్వ ఆత్మాభిమానం గురించి ఎప్పటినుంచో మాట్లాడుతున్న విడుతలై చిరుతైగల్ కచ్చి (విసికె) కూడా ఈ ఉద్యమంలో ఉన్నది. క్రమంగా ఈ ఉద్యమం విస్తరిస్తున్నది.

ఈ నినాదం తెలంగాణలో రాజకీయ విభజనను కూడా పైకి తెచ్చి, తెలంగాణ బిడ్డలలోనే కొందరు, ముఖ్యంగా సంఘ్ పరివార్ భావజాలంలో ఉన్నవారు, ఆర్ఎస్ఎస్, బిజెపి నాయకులు ఈ నినాదాన్ని వ్యతిరేకిస్తూ “మార్వాడీల” తరఫున వకాల్తా తీసుకోవడం కూడా మొదలయింది. మార్వాడీ సంఘాల పెద్దలు కూడా రంగంలోకి దిగి తెలంగాణ ప్రజలకు తమలా కష్టపడే తత్వం లేదనీ, వెయ్యి రెండు వేలు సంపాదించినా తాగి పడుకుంటారనీ అవమానకరంగా మాట్లాడుతున్నారు. కొందరు మరింత ముందుకు వెళ్లి మార్వాడీ గో బ్యాక్ ఉద్యమ నాయకుల మీద బూతుల ప్రయోగం కూడా చేస్తున్నారు. తెలంగాణ గౌపుత్ర సంఘం అనే విచిత్రమైన పేరు గల ఒక మార్వాడీ వ్యాపారి, ఇటువంటి బూతులతో పాటు, “అందరికీ మేం ఫండ్ ఇస్తాం” అని డబ్బు పొగరు కూడా వినిపించాడు. మార్వాడీలు మాత్రమే దోపిడీ చేస్తున్నారా, బహుళజాతి సంస్థల దోపిడీ కనబడడం లేదా అని మరికొందరు పోటీ పెట్టి అసలు సమస్యను తక్కువ చేస్తున్నారు. దేశ పౌరులు ఎవరైనా ఎక్కడికైనా వెళ్లి ఉండవచ్చునని చెప్పే రాజ్యాంగం అమలయ్యే చోట అటువంటి “విభజన నినాదాలు” ఇవ్వవచ్చునా అని ప్రశ్నిస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు చేసిన తప్పుకు జాతినంతటినీ బాధ్యురాలిని చేసి ఆ జాతికి వ్యతిరేకంగా తెలంగాణ జాతిని రెచ్చగొట్టవచ్చునా అని కూడా కొందరు అడుగుతున్నారు. మొన్నటిదాకా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉండి, భాష ఒకటే అయినప్పటికీ ‘ఆంధ్రా గోబ్యాక్’ అని నినాదం ఇచ్చినవాళ్లలో కూడా కొందరు ఈ ‘మార్వాడీ గోబ్యాక్’ నినాదాన్ని తప్పు పడుతున్నారు.

మొత్తం మీద ఈ గందరగోళపు సమస్య చిలికి చిలికి గాలివాన అవుతున్నది. ఎప్పుడైనా ఒక పరిణామం ఒక దశకు వచ్చినప్పుడు అదేదో హఠాత్తుగా జరిగిందని చాలామంది భావిస్తారు. కాని, ప్రకృతిలో, సమాజంలో ఇటువంటి దశలు హఠాత్తుగా ఏమీ రావు. ఎంతోకాలంగా ఆ పరిణామం నిశ్శబ్దంగా, పైకి కనబడకుండా జరుగుతూ జరుగుతూ ఏదో ఒక ఘటన దగ్గర విస్ఫోటనం జరుగుతుంది. తత్వశాస్త్ర పరిభాషలో పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుగా మారే ఘటనగా, బిందువుగా దాన్ని గుర్తిస్తారు. నిశితంగా పరిశీలిస్తే ఆ బిందువు మిగిలిన అన్ని బిందువులలాంటిదే అయినా, హఠాత్తుగా ఆ బిందువు దగ్గరే విస్ఫోటనం జరిగినట్టు అనిపిస్తుంది. ఉదాహరణకు నీటిని వేడి చేస్తున్నప్పుడు ఒక్కొక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరుగుతూ పోతుంది. తొంబై ఎనిమిది డిగ్రీల నుంచి తొంబై తొమ్మిది డిగ్రీలకు ఉష్ణోగ్రత మారినప్పుడు నీరు యథాతథంగానే ఉన్నట్టు అనిపిస్తుంది. తొంబై తొమ్మిది డిగ్రీల నుంచి వంద డిగ్రీలకు మారడం కూడా అటువంటి మార్పే. అంతకు ముందు జరిగినలాంటి ఒక్క డిగ్రీ పెరుగుదలే. కాని, ఆ ఒక్కడిగ్రీ పెరుగుదలే ఇప్పుడు మాత్రం నీటిని ద్రవ స్థితి నుంచి వాయు స్థితికి మార్చి, ఆవిరికి కారణమవుతుంది.

సరిగ్గా అట్లాగే మోండా మార్కెట్ సంఘటన, ఆమనగల్లు పరిణామాలు, తెలంగాణ గాయకుల మీద దాడులు తెలంగాణలో “మార్వాడీల” పట్ల ఎంతో కాలంగా పేరుకుంటూ వస్తున్న వ్యతిరేకత పెటిల్లున ఉద్యమ రూపం తీసుకునే గుణాత్మక మార్పుకు లోను చేశాయి. రోడ్డు మధ్యలో, ట్రాఫిక్ ను అడ్డగిస్తూ ఎవరైనా కారు ఆపితే, దారిన పోయేవాళ్లు కారును పక్కకు తీయమని మర్యాదగానో, విసుగుగానో చెప్పడం నగరంలో రోజుకు వెయ్యి సార్లయినా జరుగుతుండవచ్చు. కాని మోండా మార్కెట్ లో అటువంటి సాధారణమైన హెచ్చరిక చేసినవారి మీద దాడిచేసినా మార్వాడీ, జైన్ వ్యాపారులు పిడిగుద్దులు గుద్దారు, “కమ్ జాత్ వాలే” అని తిట్టారు. ఆ ఘటన తెలంగాణ దళిత, బహుజనులకూ మార్వాడీలకూ మధ్య వైరుధ్యాన్ని బైటికి తీసుకువచ్చింది.

దాదాపుగా అదే సమయంలో రాష్ట్రంలో అనేక చిన్న పట్టణాలలో జరుగుతున్నట్టుగానే, ఆమనగల్లులో “మార్వాడీ” వ్యాపారులకు, స్థానిక వ్యాపారులకు మధ్య ఘర్షణ తలెత్తింది. ఒకరితో ప్రారంభమై ఆరుగురు కావడం, నాణ్యత లేని సరుకులు తక్కువ ధరలకు అమ్ముతూ, స్థానిక వ్యాపారుల వ్యాపారాలు దెబ్బతీయడం, దుకాణాలలో పని చేయడానికి తమవాళ్లనే తెచ్చుకుని స్థానికుల ఉపాధి అవకాశాలు కొల్లగొట్టడం వంటి అనేక సమస్యలను ఆమనగల్లు వ్యాపారస్తులు ఎత్తిచూపారు. నిజానికి ఇవి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి చిన్నా పెద్ద పట్టణాలలో ఉన్నవే. ఆమనగల్లు వ్యాపారస్తులు ఆగస్ట్ 18న బంద్ పిలుపు కూడా ఇవ్వగా, పోలీసులు, సంఘ్ పరివార్ నాయకులు ఒత్తిడి తెచ్చి ఆ బంద్ ను వాయిదా వేయించారు. ఈ ఉద్యమం కళారూపాల్లో, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో పాటల్లో వ్యక్తం కావడంతో గాయకులు గోరేటి రమేష్, తెలంగాణ శ్యామ్ ల మీద మార్వాడీ వ్యాపారస్తులనుంచి, పోలీసుల నుంచి దాడులు జరిగాయి.

“ఈ విస్తృత, సంక్లిష్ట నేపథ్యంలో “మార్వాడీ” సమస్య గురించి ఆలోచించవలసిన లోతైన కోణాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమ నినాదం వల్ల ఇది “మార్వాడీలందరినీ” వెళ్లిపొమ్మంటున్నట్టు అపార్థాలు వచ్చే అవకాశం ఉంది గనుక వివరించాలి. ఈ సమస్య కేవలం స్థానిక వ్యాపారులది మాత్రమేననే అపోహ వల్ల, స్థానిక వ్యాపారులతో మాత్రం తెలంగాణకేమి ఒరిగింది అనే ప్రశ్నతో ఉద్యమాన్ని సందేహించే అవకాశం ఉంది గనుక, ఈ సమస్య ఆర్థిక, వ్యాపార పరిధిని దాటి ఎట్లా సామాజిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలకు, తెలంగాణ అస్తిత్వానికి వ్యాపిస్తున్నదో వివరించాలి. ఈ “మార్వాడీ” సమస్యలో తెలంగాణ వనరుల దోపిడీ, ఉత్తరాది మతోన్మాద సంస్కృతినీ, ఆచారాలనూ తెలంగాణ మీద రుద్ది తెలంగాణ ప్రత్యేక అస్తిత్వాన్ని రద్దు చేసే ప్రయత్నం, తెలంగాణ ప్రజల అవకాశాలు కొల్లగొట్టే ప్రయత్నం, చివరికి దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న స్వీయ రాజకీయ ఆత్మగౌరవ ప్రకటనను కూడా చెరిపేసే ప్రయత్నం ఉన్నాయి.”

మొట్టమొదట గుర్తించవలసిన అంశం ఇది పేద, మధ్యతరగతి మార్వాడీలకు వ్యతిరేకం కాదు. అటువంటి పేద, మధ్యతరగతి మార్వాడీలు,  తమ ఎడారి ప్రాంతంలో బతుకుదెరువు లేక ఒకరకంగా పొట్ట చేతపట్టుకుని దశాబ్దాల కింద తెలంగాణ వచ్చి చిన్న పట్టణాలలో, జిల్లా కేంద్రాలలో, నగరంలో చాట్ భండార్ ల నుంచి స్వీట్ షాపుల దాకా, కిరాణా, బట్టలు, బంగారం, ఆభరణాల దుకాణాల నుంచి తాకట్టు దుకాణాల దాకా పెట్టుకుని స్థిరపడ్డారు. వారివల్ల స్థానిక వ్యాపారులు, చేతివృత్తులు దెబ్బతిన్నాయి గాని వారు ఒకరకంగా తెలంగాణ జనజీవనంలో, సంస్కృతిలో భాగమయ్యారు. అటువంటి వేలాది మందికీ, గత మూడు దశాబ్దాలలో, మరీ ముఖ్యంగా 2014 తర్వాత వచ్చినవారికీ కచ్చితమైన తేడా ఉంది.

ఈ రెండో తరహా వారిలో మార్వార్ ప్రాంతం వారు మాత్రమే లేరు. రాజస్తాన్ లోని మిగిలిన ప్రాంతాల వారు, గుజరాతీలు, సింధీలు, తదితరులు కూడా ఉన్నారు. వీరు ప్రతి సరుకు టోకు వ్యాపారంలో పాతుకుపోయారు. తమ ప్రాంతం నుంచి బంధు మిత్రులను పిలిపించి, పెట్టుబడులు పెట్టి, పరపతి మీద సరుకులు ఇచ్చి చిల్లర వర్తకాన్ని దురాక్రమించడం ప్రారంభించారు. ఉత్పత్తిదారులలో కూడా ఎక్కువమంది “మార్వాడీలే” గనుక సరఫరా గొలుసులో అన్నీ స్థానాలలోనూ తమవారినే నింపుకున్నారు. అలా వ్యాపారాల విస్తరణతో పోగుబడిన విపరీతమైన సంపదను రియల్ ఎస్టేట్ లోకి తరలించారు. తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్ లో చెప్పుకోదగిన ఆస్తులు సమకూర్చుకున్నారు.

అప్పటివరకూ వ్యాపారస్తులందరి లాగే అన్ని రాజకీయ పార్టీలకూ విరాళాలు ఇస్తుండిన వీరి లోపలి సంఘ్ పరివార్ భావజాలం 2014 తర్వాత వెయ్యి పడగలు విప్పడం మొదలయింది. ఆ తర్వాత అక్కడి నుంచి వలసలు కూడా పెరిగాయి. తమ రాజ్యం వచ్చిందన్నట్టుగా ఉత్తరాది పండుగలకూ, మతోన్మాద సందర్భాలకూ ఉత్సవాలు జరపడం, ఏడాదికి కనీసం ఆరు ఏడు బహిరంగ ప్రదర్శనలకు కోట్లాది రూపాయలు వెచ్చించి తమ ప్రభావ పరిధి పెంచుకోవడం, తెలంగాణ సాంస్కృతిక ఉత్సవాలలో కూడా చొరబడడం మొదలుపెట్టారు. ఈ ఉత్సవాల సందర్భంలోనూ, ఇతర పద్ధతులలోనూ మార్వాడీ, ఉత్తరాది, సంఘ్ పరివార్ సంస్కృతి తెలంగాణ సంస్కృతిని ఆక్రమించడం, తోసివేయడం, మింగివేయడం ప్రారంభమయింది.

తెలంగాణకు తెలియని ఎన్నో ఆచార వ్యవహారాలు, ఆహార్యం, మూఢ నమ్మకాలు, ఆడంబరాలు తెలంగాణలో ప్రవేశించాయి. ఇప్పటికే ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలలో ప్రవేశించి, విస్తరిస్తున్న ఈ “మార్వాడీ” ఆధిపత్యం రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇంకా ఒకటి రెండు అడుగులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలకూ, ఉత్సవాలు జరిపే స్థానిక సంఘాలకూ విరాళాలు ఇస్తున్న ఈ మార్వాడీలు రేపు రాజకీయాధికారం చేపట్టినా కాదనలేని స్థితి మెల్లమెల్లగా పెరుగుతున్నది. ఇవాళ్టి “మార్వాడీ” వ్యతిరేకత ఈ చొరబాటునూ, దురాక్రమణనూ వ్యతిరేకించేది మాత్రమే గాని, బతుకుదెరువు కోసం వచ్చి, స్థానిక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ప్రత్యేకతలను గౌరవించి, వాటిలో జోక్యం చేసుకోకుండా ఉంటున్నవారి పట్ల కాదు.

అయితే “మార్వాడీ” అనే పదం ఎందుకు వాడాలనే ప్రశ్న వస్తుంది. “మార్వాడీ” అనే మాటలో కొంత అస్పష్టత ఉన్నమాట నిజమే. మార్వాడీ, గుజరాతీ, సింధీ, ఉత్తరాది, సంఘ్ పరివార్  దోపిడీదారులు, దురాక్రమణదారులు అని వివరంగా అనవలసిన చోట, క్లుప్తత కోసం “మార్వాడీ’ అంటున్నారు. ఒకప్పుడు రాజకీయ, సామాజిక పరిభాషలోకి వచ్చి చేరిన కాబూలీవాలా, తెల్లవాడు, ఆంధ్ర మొదలైన మాటల వంటిదే ఈ మాట కూడా. కాబూల్ నుంచి వచ్చిన వారందరూ వడ్డీ వ్యాపారులూ కాదు, వడ్డీ వ్యాపారులందరూ కాబూలీవాలాలూ కాదు, కాని ఆ మాట వడ్డీ వ్యాపారులకు ప్రతీకగా మారింది. అలాగే తెల్లవాళ్లందరూ మనమీద దోపిడీకి రాలేదు, చివరికి బ్రిటన్ లో కూడా భారతీయులకు మద్దతు ఇచ్చినవాళ్లు ఎందరో ఉన్నారు. మనను దోపిడీ చేసింది ఈస్టిండియా కంపెనీ అనే చిన్న వ్యాపారుల బృందం, తర్వాత కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం. కాని మనం బ్రిటిష్, తెల్లవాళ్లు అని సంబంధం లేని వారిని కూడా కలిపే విశాలమైన మాటలనే ఉపయోగించాం. ఆంధ్ర అనే పదం కూడా సరిగ్గా అట్లాగే తెలంగాణ నీళ్లను, నిధులను, ఉద్యోగాలను, వనరులను, చరిత్రను, భాషను కొల్లగొట్టినవారికి వర్తించే పదమే తప్ప, ఆ జాతిలో ప్రతి ఒక్కరికీ వర్తించేది కాదు.

ఈ వివరణ ఎందుకంటే, మన కళ్ల ముందు జాతి పేరు మీద జరిగిన నెల్లీ, మణిపూర్ వంటి శతృత్వాల, మారణకాండల చరిత్ర ఉంది. ఆ చారిత్రక నేపథ్యంలో “మార్వాడీ” సమస్య జాతి సమస్య కాదు, దోపిడీ పీడనల, వనరుల దురాక్రమణల, సంస్కృతి విధ్వంసాల సమస్య అని స్పష్టంగా అర్థం చేసుకోవలసి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page