భరతమాత ముద్దు బిడ్డ ఆధ్యాత్మిక సాధువు, యువతకు మార్గదర్శి, తత్వవేత్త, అపరజ్ఞాని, పాశ్చాత్య ప్రపంచం ముందు భారతీయ హృదయాన్ని ఆసాంతం ఆవిష్కరించిన ప్రఖ్యాత ప్రవచన వేత్త, రచయిత స్వామి వివేకానంద వారి జీవితం నుంచి ప్రేరణలను పొందుతూ దేశాభివృద్ధి దిశగా మరో అడుగు ముందుకు వేయడానికి పునరంకితం కావడమే నేటి భారత యువత ప్రధాన కర్తవ్యం అని గుర్తించాలి.వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనకు ప్రతిబంధకాలు:
ప్రపంచానికే యువ కేంద్రంగా నిలిచి భాసిల్లుతున్న భారత్‌కే సొంతమైన అపార యువశక్తి రెక్కలు విచ్చుకొని ఆకాశమే హద్దుగా ముందుకు సాగితే 2047 వందేళ్ల స్వతంత్ర దినోత్సవ వేడుక నాటికి ‘వికసిత్ భారత్-2047”గా ఎదిగి అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి సగర్వంగా చేరుతుందని ఆశ పడుతున్న వేళ నేటి డిజిటల్ యువభారతాన్ని కొన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. భారత్‌లో 35 ఏండ్ల లోపు వయస్సు కలిగిన జనాభా 65 శాతం (దాదాపు 80 కోట్లు) ఉండడం ఒక విశేషంగా చెప్పవచ్చు.
ఏ దేశమైనా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించడానికి ఆ దేశ యువత చొరవ అనివార్యం. యువత ఆలోచనలు, శక్తియుక్తులతో పాటు సృజన, విలక్షణ భావనలు పురుడు పోసుకోవడానికి యువత ప్రధాన పాత్రను నిర్వహించాలి. నేటి అత్యాధునిక భారత యువతకు అల్లంతో దూరాన అనేక అవకాశాలు కనిపిస్తున్నప్పటికీ వారిని ముందుకు సాగనివ్వకుండా కొన్ని ప్రధాన సమస్యలు వెనక్కి లాగుతున్నాయని నిపుణులు గుర్తించారు.
యువతను వెంటాడుతున్న నిరుద్యోగ భూతం:
యువభారతాన్ని పట్టి పీడిస్తున్న అత్యంత ప్రధాన సమస్య నిరుద్యోగం అని మనకు తెలుసు. భారతదేశ జనాభాలో 15 – 34 ఏండ్ల లోపు వయస్సు కలిగిన యువత 36% ఉన్నారని, ఇది దేశానికి ఒక అమూల్య వనరు అని గుర్తించబడింది. నేడు ఐఐటి ముంబాయిలో చదివిన 36 శాతం యువతకు అర్హతకు తగిన ఉద్యోగాలు రాలేదని, ఉద్యోగాలకు ఎంపికైన కొందరు యువతకు రూ 10 లక్షల వార్షిక వేతనం మాత్రమే లభించిదనే విషయం తెలిస్తే మన దేశంలో ఎంత వరకు నిరుద్యోగ సమస్య ఉందో అర్థం అవుతున్నది.
భారత్‌లో ఉన్న శ్రామిక శక్తిలో 80 శాతం వరకు యువత మాత్రమే నిరుద్యోగులుగా లేదా అర్హతకు తగిన ఉద్యోగం దొరక్క సమస్యలకు ఎదుర్కొంటున్నారని తెలుస్తున్నది. గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో యువత నిరుద్యోగ రేటు 5.7 శాతం నుంచి 17.5 శాతానికి పెరిగినట్లు గమనించారు. దేశ యువతలో 90 శాతం వరకు అసంఘటిత రంగాల్లోనే మగ్గుతున్నారని వివరించబడుతున్నది. అధిక శాతం శ్రామిక శక్తి వ్యవసాయ/వ్యవసాయ అనుబంధ రంగాల్లో పని చేస్తున్నారని తెలుస్తున్నది.
విద్య ప్రమాణాల లోటు, నైపుణ్యాల కొరత:
కాలానుగుణంగా మన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయడం మరిచి పోయాం. మూస పద్దతిలో పాత పాఠాలే బోధిస్తున్నాం. ప్రయోగశాల సమయం సన్నపూస అవుతున్నది. పరిశోధన స్ఫూర్తిని నింపలేదు పోతున్నాం. విద్యకు తగిన నైపుణ్యాలను అందించలేక పోతున్నాం. నేడు అంతర్జాతీయ విద్య ప్రమాణాలు కలిగిన యువతకు ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఆహ్వానిస్తున్నాయి. పరిశ్రమల అవసరాలకు విశ్వవిద్యాలయాల బోధనలకు పొంతన కుదరడం లేదు. డిగ్రీలు కాగితాలకే పరిమితం అవుతున్నాయి.
విద్యకు నైపుణ్యం తోడు అవడం లేదు. నైపుణ్య విద్య కలిగిన యువతకు గిరాకీ పెరుగుతోంది. పరిశ్రమల్లో ఉద్యోగాలు ఉన్నాయి. మార్కెట్‌లో నైపుణ్య యువత కనిపించడం లేదు. మన “యువభారతాన్ని” “నైపుణ్య భారతం”గా తయారు చేయగల నూతన విద్యా విధానం కావాలి. విద్యకు నైపుణ్యం తోడవ్వాలి. విద్య, నైపుణ్యం అనబడే రెక్కలు తొడిగిన యువతకు ప్రపంచమే ఆహ్వానం పలుకుతోంది. నేటి డిజిటల్ ప్రపంచంలో ఆత్మవిశ్వాసంతో యువత నిలబడడానికి మన విద్యా వ్యవస్థకు సత్వరమే శస్త్రచికిత్స చేసి ప్రమాణాలతో కూడిన విద్య, విద్యార్హతలకు తగిన నైపుణ్యాల ఔషధాలను అందించాలి. మన యువభారతం నైపుణ్యభారతంగా మారిన క్షణం “వికసిత్
మోయలేనంతగా ద్రవ్యోల్బణ భారం:
గోరు చుట్టలపై రోకలి పోటు వలె నిరుద్యోగ సమస్య పెరుగుతున్న వేళ నిత్యావసరాల ధరలు పెరగడంతో బడుగుల బతుకులు భారం కావడం, యువతలో నిరాశల సెగలు ఎగిసిపడడం చూస్తున్నాం. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరగడంతో పాటుగా వస్తువులు, వస్తు సేవల డిమాండ్ తగ్గడం వల్ల వ్యాపారాలు, ఉద్యోగ ఉపాధులు తగ్గుతున్నాయని తెలుసుకోవాలి. ధరలు పెరగడంతో యువతలో పునర్వినియోగపరచలేని ఆదాయం తగ్గడం చూస్తున్నాం. ఆహారం నుంచి ఇంధనం వరకు, పండ్ల నుంచి దినసరి సరుకుల వరకు, గుండు సూది నుంచి పిండి గిరిని వరకు అన్ని ధరలు పెరగడంతో నిరుద్యోగ యువత నివ్వెరపోతూ, అశాంతికి లోనవుతున్నారు.
యువతలో పెరిగిన మాదక ద్రవ్యాల దుర్వినియోగం:
దేశవ్యాప్తంగా 1.58 కోట్ల 10 – 17 ఏండ్ల పిల్లలు మాదక ద్రవ్యాల దురలవాటు కోరల్లో చిక్కారని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దాదాపు 16 కోట్ల యువత ఆల్కహాల్ సేవనానికి అలవాటు పడ్డారని, 5.7 కోట్ల మంది ఆల్కహాల్ సేవనంతో తీవ్ర అనారోగ్యాలపాలు అవుతూ చావుకు దగ్గరయ్యారని తెలుస్తున్నది. మాదక ద్రవ్యాల దురలవాటు చికిత్స పొందిన వారితో 63.6 శాతం మందికి 15 ఏండ్ల లోపే ఈ దురలవాటు బారిన పడ్డారు. ఆల్కహాల్, కన్నాబిస్, ఓపియం దురలవాటు ఉన్న వారిలో 18 ఏండ్ల లోపు వారే అధికంగా ఉండడం బాధాకరం.
సామాజిక మాద్యమాల తెరల దురలవాటు:
నేటి డిజిటల్ పిల్లలు, యువత నుండి వృద్ధుల వరకు అన్ని వర్గాల ప్రజలు స్మార్ట్‌ఫోన్/ఐప్యాడ్/ల్యాబ్ టాప్/టివీ తెరలకు అతుక్కుపోతూ మరో అనారోగ్య విపత్తుకు ‘స్క్రీన్ అడిక్షన్’కు ఆజ్యం పోస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ నీలి తెరలపై దృష్టిని కేంద్రీకరించి రోజుకు 10 గంటల వరకు కూర్చుంటున్న యువత మన ముందే కనిపిస్తున్నారు. వాట్స్‌యాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ లాంటి సామాజిక మాద్యమాల్లో దూరకుండా గంటైనా గడవని దుస్థితిలో యువత ఉండడం విచారకరం. ఈ దురలవాటుతో పలు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో పాటు ఏకాగ్రత లోపించడం, ఒంటరితనపు భావనలు, మానసిక స్థిరత్వం తగ్గడం, ఆందోళనలు, ఒత్తిడులు పెరగడంతో చదువులు కుంటుపడడం జరుగుతున్నది.
యువత మానసిక సమస్యలు – ఆత్మహత్యలు:
18 – 24 ఏండ్ల భారత యువతలో 50 శాతం మంది మానసిక ఆరోగ్య సమస్యల విషవలయంలో చిక్కారని, అంతర్జాల వేదికలు కూడా మానసిక సమస్యలకు ఆజ్యం పోస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కరోనా తర్వాత కాలంలో యువత మానసిక సమస్యలు పెరిగినట్లు కూడా తెలుస్తున్నది. దేశంలో జరుగుతున్న ఆత్మహత్యల్లో 41 శాతం ఆత్మహత్యలు 30 ఏండ్ల లోపు యువత చేసుకుంటున్నారని తేలింది. భారతీయ యువతుల్లో అధిక మరణాలకు కారణం ఆత్మహత్యలే అని తెలుస్తున్నది. ఆత్మహత్యలు దేశంలో అతి ప్రమాదకర ప్రజారోగ్య సమస్యగా పెరుగుతున్నది. ప్రతి రోజు దేశవ్యాప్తంగా 35 మంది విద్యార్థినివిద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 2019 నుండి 2022 వరకు ఆత్మహత్యల రేటు 9.9 శాతం నుంచి 12.4 శాతానికి పెరగడం గమనించారు. నేటి పోటీ ప్రపంచంలో కోటా కోచింగ్ కారాగారాల్లో పలువురు యువత ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం.
యువతలో స్థూలకాయ సమస్య:
ప్రపంచ ఒబేసిటీ ఇండెక్స్ – 2022 ఆధారంగా తయారు చేసిన 197 దేశాల జాబితాలో భారత్ 180 ర్యాంకులో ఉండగా, భారత మహిళలకు 182వ స్థానం, పురుషులకు 180వ స్థానం లభించడం గమనించాలి. 2022 వివరాల ప్రకారం దేశంలో అధిక బరువు కలిగిన 5 – 19 ఏండ్ల లోపు పిల్లలు 12.5 మిలియన్లు ఉన్నారని, 20 ఏండ్లు దాటిన మహిళల్లో 44 మిలియన్లు, పురుషులు 26 మిలియన్లు స్థూలకాయ సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తున్నది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 2022 వివరాల ప్రకారం 33.33 శాతం యువతీయువకుల జనాభా అధిక బరువు సమస్యతో సతమతం అవుతున్నారని తేలింది.
యువతలో అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, కొవ్వులు/షుగర్స్ కలిగిన ఫాస్ట్ ప్సాకేజ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్‌ను లొట్టలేసుకుంటూ నడి బజారులో తినడం, కూర్చొని పని చేయడం, శీతల పానీయాలనా చప్పరించడం, శారీర క్రమ లోపించడం, వేళపాళ లేకుండా నెమరేయడం ఓ వింత కొత్త పోకడ అయిన వేళ స్థూలకాయమే శాశ్వత బహుమతిగా తిరిగి వస్తున్నదని నేటి యువత తెలుసు కోవాలి. స్థూలకాయంతో అధిక రక్తపోటు, అధిక మధుమేహం, గుండె జబ్బులు వస్తాయని మన యువతకు తెలుసు. ప్రపంచానికే యువశక్తి కేంద్రంగా నిలుస్తున్న యువభారతం రానున్న రోజుల్లో అగ్ర దేశాల సరసన నిలవడానికి భరతమాత పళ్లకి మోయడానికి దేశ నైపుణ్య యువతీయువకులు బోయలు కావాలని కోరుకుందాం, ప్రపంచానికి మన శక్తియుక్తులను రుచి చూపుదాం.





