విప్లవోద్యమంలో నష్టాలు మనకు మాత్రమే పరిమితం కావు

విప్లవోద్యమంలో నష్టాలు భారత దేశం కు మాత్రమే పరిమితం అయినవేమీ కాదు… జ్యురిచ్ నుండి లెనిన్ రష్యాలో అడుగు పెట్టేనాటికి సగం పొలిట్ బ్యూరో తుడిచి పెట్టబడ్డది.. చైనాలో లాంగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు లక్షల్లో ఉన్న సైన్యం వేల మందికి పడిపోయింది… కేంద్ర కమిటీ సభ్యులు అమరులు కావడం విప్లవోద్యమ చరిత్రలో గతంలో జరిగినవే… భారత దేశం కానీ, మరే దేశం కానీ మినహాయింపు కాదు అనే విషయం మర్చిపోకూడదు…

ప్రపంచంలోని పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజకీయాలకు , కమ్యూనిస్ట్ రాజకీయాలకు  ఉన్న ప్రధానమైన తేడా ఏమిటి? ప్రజాస్వామ్యం పేరుకే అందరూ సమానమే అని అంటూనే భూమికి, ఆకాశానికి ఉన్నంత తారతమ్యాలు ఉండే  వర్గాలను సృష్టిస్తుంది… కమ్యూనిస్ట్ పార్టీ సరిగ్గా ఈ వర్గాలు లేని సమాజాన్ని ఏర్పాటు చేసే రాజకీయాలను నిర్మిస్తుంది…

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం 2026 మార్చ్ వరకు నక్సలైట్లు లేకుండా చేస్తానని ప్రకటించి నక్సలైట్లను ఎన్కౌంటర్ ల  పేరుతో హతమారుస్తున్నది . నక్సలైట్ల తో పాటు దండకారణ్యం లో ఉన్న ఆదివాసీలను కూడా చంపేస్తున్నారు. ఈ రకంగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడే వారిని చంపేయడం ఆధునిక ప్రజాస్వామిక ప్రభుత్వాలలో కొత్తేమీ కాదు. ముఖ్యంగా మానవుల పుట్టుక నుండి అన్యాయాలకు వ్యతిరేకంగా, పోరాడిన వారిని గణ సమాజాలలో, రాచరికాలలో, ఫ్యూడల్ ప్రభువుల కాలంలో కూడా కొనసాగింది. అయితే ప్రజాస్వామిక ప్రభుత్వాలు పార్లమెంట్లు అసెంబ్లీలు వచ్చిన తర్వాత ఒక మనిషిని చంపే క్రమంలో కొన్ని పద్ధతులు పాటిస్తామని చెప్పి రాజ్యాంగాలలో రాసుకొని రాజ్యాంగ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

ప్రపంచ వ్యాప్తంగా  ఈరోజు అంతటా పార్లమెంటరీ ప్రభుత్వాలే నోటికి 90% పైగా కొనసాగుతున్నాయి.. మానవుడు పుట్టినప్పటి నుండి అప్పుడున్న జీవితం కన్నా మరింత మంచి జీవితం కోసం రాజుల కాలం నుండి ప్రశ్న రూపంలో పోరాడుతూనే ఉన్నాడు. ఇది క్రీస్తు పూర్వం సోక్రటీస్ నుండి చార్వాకులు లోకాయతులు పోరాడిన కాలం నుండి రాజులు విషం  ఇచ్చి రకరకాల పద్ధతులలో రాజ్యాలకు వ్యతిరేకంగా హక్కుల కోసం పోరాడిన వాళ్ళను అంతమొందిస్తునే  ఉన్నారు.. ముఖ్యంగా భారతదేశ విషయానికి వస్తే ఆదిమ కాలం నుండి ఈ దేశ మూలవాసులైన  గిరిజనులు, ఆదివాసీలు అన్ని రకాల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నేలపై   తమ అస్తిత్వం కోసం జల్ జంగిల్ జమీన్ పేరుతో పోరాడుతూనే ఉన్నారు

అడవి బిడ్డలు ఆదివాసీ నాయకులు రాంజీ గోండు, బిర్సా ముండా, వీరనారాయణ సింగ్, అల్లూరి సీతారామరాజు, కుమ్రం భీమ్, గుండా దుర్, చరిత్రలో తమ ప్రాంతం కోసం, న్యాయం కోసం, తమ ముందు తరాల కోసం పోరాడి ఉరిశిక్షలకు గురై తుపాకీ గుళ్ళకు బలైన వాళ్ళు చరిత్రలో మనకు తెలిసిన కొన్ని పేర్లు మాత్రమే. ఈ పోరాటంలో పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా పాల్గొని పోరాటంలో నేలకొరిగిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు.  రాచరికనికి వ్యతిరేకంగా పోరాడిన జల్కరి భాయ్, సమ్మక్క సారక్క నుండి మొదలుకొని ఈ ఆధునిక స్వాతంత్ర దేశంలో కూడా వేలాది మంది మహిళలు పురుషులతో పాటు పోరాడిన చరిత్ర మనకు కనబడుతుంది.. బ్రిటిష్ కాలంలో కూడా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రకరకాలుగా పోరాడిన వీరులు మనకు కనబడతారు. అట్లా పోరాడిన వాళ్ళను కాల్చి చంపడం , ఉరి తీయడం లేదా  కుట్ర కేసులు పెట్టి వందలాది మందిని  వేల మైళ్ళ దూరంలో ఉన్న జైళ్లకు పంపిన చరిత్ర బ్రిటిష్ ప్రభుత్వంలో మనం చూసాం.  అంతేకాదు లాహోర్ కుట్ర కేసు, మీరట్ కుట్ర కేసు, కాన్పూర్ కుట్ర కేసులు, భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్ దేవ్ తదితరులను ఉరి తీసిన చరిత్ర కూడా మన కళ్ళముందే జరిగింది. వీళ్లే కాకుండా గదర్ వీరులను, ఇంకా స్వాతంత్ర కాలంలో పోరాడిన వేలాది మందిని చంపేసిన చరిత్ర మనం చూసాం. అయితే ఇదంతా క్రీస్తు పూర్వం నుండి మనకు స్వాతంత్ర్యం రాకముందు నాటి చరిత్ర…

స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మేధావుల పై యూరప్ లో పార్లమెంట్ లు ఏర్పడడానికి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం,మానవ హక్కుల కోసం … ఫ్రాన్సిస్ బేకన్, రూసో,జాన్ లాక్ మాంటెస్క్యూ, అబ్రహం లింకన్, జె ఎస్ మిల్, లూథర్ కింగ్, తదితరులు పాదు కొల్పిన ప్రజాస్వామిక భావనలకు ప్రేరేపితమై ఈ దేశం లో స్వాతంత్ర్య పోరాటం కొనసాగి, లక్షలాది మంది ప్రజల అనన్య  త్యాగాలతో, అంబేడ్కర్ ఆలోచనలతో మన దేశ రాజ్యాంగం రూపొంది,బూర్జువాల నాయకత్వంలో స్వాతంత్య్రం వచ్చింది… 1848 లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడినప్పటికీ, మన దేశంలో 1925 లో సీపీఐ  పార్టీ ఆవిర్భవించింది… 1946 నాటికి తెలంగాణ లో సాయుధ పోరాటాన్ని నిర్మించి 1951 నాటికి విరమించి పార్లమెంటరీ పంథా లోకి మారిపోయింది.. ఈ కాలంలోనే పునప్రా వాయలార్, తేబాగా పోరాటాలు వెల్లువత్తాయి.. అప్పటినుండి 1969 వరకు దేశంలో సమరశీల పోరాటలాను నిర్మించ లేకపోయింది.. సరిగ్గా ఈ సమయం లోనే చారు మజుందార్ నాయకత్వంలో  సీపీఐ  ,  సీపీఎం  ల కొనసాగింపుగా  సీపీఐ  (ఎంఎల్) ఏర్పడి, ఇప్పటి మావోయిస్టు పార్టీ కొనసాగుతున్న క్రమంలోనే ఈ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడుకోవాలి…

ఈ నగ్జల్బరీ పోరాటాన్ని కొండపల్లి సీతారామయ్య తన సహచర నాయకులతో 1980 లో   సీపీఐ  (ఎంఎల్)  పీపుల్స్ వార్ ను ఏర్పాటు చేశారు. 2004 లో ఇప్పటి సీపీఐ  (ఎంఎల్) (మావోయిస్టు) ఏర్పాటుకు పునాదులు వేసి భారత దేశ విప్లవోద్యమాన్ని అటు సాయుధ పోరాటం.. ఇటు ప్రజా సంఘాలను అన్ని రంగాలలో ఏర్పాటు చేసి భారత దేశ విప్లవోద్యమాన్ని రెండు పట్టాల పైకి ఎక్కించి ముందుకు నడిపించారు. ఆయన  నిర్మించి అందించిన నాయకత్వమే ఈనాటి మావోయిస్టు పార్టీ…

బౌద్ధిక రంగంలో రష్యా చైనా నిర్మించిన సాహిత్య సాంస్కృతిక రంగాలను మనదేశంలో కూడా చూడవచ్చు.. గణనీయమైన సాహిత్యాన్ని కళలను నిర్మించింది అందులో ప్రధాన భాగంగా విరసం తదితర సాహితీ సంస్థలతో పాటు సాంస్కృతిక రంగంలో జననాట్యమండలి.. హక్కుల రంగంలో పౌర హక్కుల సంఘం లాంటి తదితర సోదర సంస్థలు ఈ దేశంలో గణనీయమైన ప్రభావాన్ని వేశాయి. రష్యా, చైనా లాంటి దేశాలలో వచ్చిన సాహిత్యానికి కొనసాగింపుగా ఈ దేశంలో ఘణనీయమైన సాహిత్యం ఈ ఐదు దశాబ్దాలలో చైనా రష్యాలో వచ్చిన సాహిత్యం కన్నా ఏమాత్రం తీసిపోదని చెప్పవచ్చు. ఆ దేశాలలో వచ్చిన సాహిత్యంలో మహిళలు సృష్టించిన సాహిత్యం లాగానే ఈ దేశంలో కూడా విప్లవ రచయిత్రులు సృష్టించిన సాహిత్యం, సాంస్కృతికంగా జననాట్యమండలి తదితర సంస్థలు భావజాల రంగంలో నిర్మించిన పాత్ర తక్కువదేమీ కాదు. సాంస్కృతిక రంగంలో తాము నమ్మిన కమ్యూనిస్టు రాజకీయాల కోసం తీవ్రమైన నిర్బంధాలను ఎదుర్కొని అనేకసార్లు జైలు జీవితం గడిపి జూలియాస్ ఫ్యూజిక్ లాంటి వాళ్ళను ఈ దేశంలో కూడా, మనం చూడవచ్చు.  రష్యా, చైనా లాంటి దేశాలలో వచ్చిన సాహిత్యంలో పురుషులే కాకుండా స్త్రీలు కూడా యుద్ధరంగంలో ఉండి గణనీయమైన సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు అది మనం వియ్యుక్క, మిడ్కో లాంటి సాహితీవేత్తలను చూడవచ్చు

హక్కుల రంగంలో తాము నమ్మిన రాజకీయాలకు అనుగుణంగా ప్రాణాలు ఇచ్చిన డాక్టర్ రామనాథం, పురుషోత్తం, కన్నాభిరాన్ తదితర నాయకులను చూడవచ్చు. సాంస్కృతిక రంగంలో గద్దర్, సంజీవ్, మాభూమి సంధ్యక్క తదితరుల పాటలు పాటల రూపంలో తమ ప్రభావాన్ని అంతర్జాతీయ రంగంలోని బాబ్ డిలాన్, జరా,తదితరుల తో సరి సమానమైన పాత్రను ఈ దేశంలోని విప్లవంలో మనం చూడవచ్చు.. పోరాట రంగంలో మహిళల గురించి చెప్పుకోవాలంటే ఈ దేశంలో వందల సంవత్సరాల నుండి గిరిజనులు పల్లెలు పట్టణాలలో మహిళల పాత్ర తక్కువదేమీ కాదు మనకు నిత్యం కనబడే సంధ్యక్క, విమలక్క, పద్మ కుమారి, అనితా లే , కాదు..వియ్యుక్క లు మిడ్కోలను కూడా చూడాలి..పోరాటంలో మహిళల పాత్ర గురించి వి. గార్గీ, తదితరులు రాసిన సాహిత్యాన్ని కూడా మనం చూడాలి..

చివరిగా విప్లవం విందు భోజనం కాదు…ఈ పోరాట క్రమంలో అనేకమైన త్యాగాలు మన కళ్ళముందే తమ సహచరులు, బిడ్డలు నేలకొరుగుతుంటే ఒక చేతితో కన్నీరు తుడుచుకుంటూ మరొక చేత్తో పిడికిలి పైకి ఎత్తుతూ చెరబండ రాజు చెప్పినట్టు ముంజేటి చేతిని నరికినా ఎత్తిన పిడికిలిని వదలను అన్నారు.. ఆ రకంగా విప్లవం అనేది ప్రయాణించే ఒక రైలు లాంటిది ఈ ప్రయాణంలో అనేక స్టేషన్లు ఉంటాయి. ఈ స్టేషన్లో దిగిపోయే వారిని మాత్రమే చూడకండి.. మరొక స్టేషన్ లో ఎక్కేవారిని కూడా చూడండి, ఆ రకంగా 1969 లో లేచిన ఒక నిప్పురవ్వ మహా అగ్ని జ్వాల ను సృష్టించి దావానలమై, ప్రభుత్వాలే చెప్తున్నట్టు 17 రాష్ట్రాలకు విస్తరించింది…

విప్లవోద్యమంలో నష్టాలు భారత దేశం కు మాత్రమే పరిమితం అయినవేమీ కాదు… జ్యురిచ్ నుండి లెనిన్ రష్యాలో అడుగు పెట్టేనాటికి సగం పొలిట్ బ్యూరో తుడిచి పెట్టబడ్డది.. చైనాలో లాంగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు లక్షల్లో ఉన్న సైన్యం వేల మందికి పడిపోయింది… కేంద్ర కమిటీ సభ్యులు అమరులు కావడం విప్లవోద్యమ చరిత్రలో గతంలో జరిగినవే… భారత దేశం కానీ, మరే దేశం కానీ మినహాయింపు కాదు అనే విషయం మర్చిపోకూడదు…

చివరిగా ఈ ఒక్క పాటను గుర్తు పెట్టుకోండి కామ్రేడ్స్.. కమ్యూనిస్ట్‌లు కేవలం అధికారంలోకి రావడం మాత్రమే కాదు.. దోపిడీ.. పీడన.. అణచివేత లేని సమ సమాజాన్ని, స్త్రీ పురుష సమానత్వాన్ని నెలకొల్పి సంపద అంతా సమానంగా పంచబడి .. జ్ఞానమే నిలిచి వెలిగే దాకా ఈ నావ కొనసాగుతూనే ఉంటుంది… అందుకే ఈ పాటను ఎప్పుడూ మనసులో ఉంచుకుని ముందుకు సాగాలి అంటోంది… ఆ పాట…”గిచ్చన్న గిరి మల్లెలో నక్సల్ బరి నావ సాగుతున్నదో కష్టాలు దాటుకుంటూ.. ఈ నావ గమ్యానికి సాగుతున్నదో, అంతరాలు లేని సమ రాజ్యం కై…. జ్ఞానమే భూమిలో నిలిచి వెలిగేదాకా ఈ నావ కొనసాగుతూనే ఉంటుంది. ఆఖరి తీరం చేరే దాకా…!

 – సూర్యం 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *