“ఈ వివరాలను పరిశీలిస్తే ఏ ప్రజాస్వామిక సమాజమైనా తగిన అవకాశాలు కల్పించకపోతే, ఎదుగుదల సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఇరుకు రోడ్డుపై ప్రయాణించే కార్లు, తమ ముందు వాటిని దాటి ముందుకె ళ్లే సామర్థ్యాన్ని కలిగివుండాలి. అంతేకాని వంశపారంపర్యత నిర్ధారించిన స్థాయిల్లోనే కొట్టుమిట్టాడ కూడదు. ఇక్కడ వెనుక వున్న కారు, తన ముందు దాన్ని దాటి వెళ్లాలంటే రోడ్డును వెడల్పు చేయాలి. అప్పుడే అది తేలిగ్గా ముందుకు దూసుకెళ్లగలదు. కింది తరాలవారు ముందుకెళ్లడానికి ప్రజాస్వామిక సమాజం కల్పించే అవకాశాలు సరిగ్గా ఈ రోడ్డు వెడల్పు చేయడం వంటివే! అంటే అందరికీ సమాన విద్యను అందుబాటులోకి తేవడం, నిర్ణయాత్మక చర్యలు, ఉద్యోగాల కల్పన, దేశంలోని మరింత గతిశీలత కలిగిన ప్రాంతాలకు వలస వెళ్లడం, కొత్త సంస్థల ఏర్పాటుకు అడ్డంకులను చాలావరకు తొలగించడం వంటివే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించే అవకాశాలు..”
సమ్మిళిత ఆర్థికాభివృద్ధి ప్రస్థావన మరోసారి వెలుగులోకి వచ్చింది. గత జూన్ తొలినాళ్లలో ప్రపంచ బ్యాంకు వెల్లడించిన ప్రకారం భారత్‌లో పూర్తి స్థాయి పేదరికంలో మగ్గుతున్నవారు లేదా రోజుకు కేవలం మూడు డాలర్లు మాత్రమే సంపాదించగలుగుతున్నవారి సంఖ్య 2011-12లో 206 మిలియన్లుండగా 2022-23 నాటికి 75 మిలియన్లకు తగ్గిపోయింది. పేదరికానికి ప్రపంచబ్యాంకు నిర్దేశించిన పరిమితిని పెంచినప్పటికీ, దేశంలో పేదల సంఖ్య చాలా వేగంగా తగ్గిపోవడం ఇక్కడ గుర్తించాల్సిన అంశం. మనదేశంలో పేదరికం 16.22% నుంచి ఏకంగా 5.25% కు పడిపోవడం గమనార్హం.
ప్రపంచంలో అత్యధిక పేదరికంతో బాధపడుతున్న 28 అల్పాదాయ దేశాల సగటు పేదరికం ఆధారంగా ఈ దారిద్య్రరేఖను నిర్ధారిస్తారు. అయితే అల్పాదాయ దేశంగా భారత్ ఇంకా ఎంతోకాలం వుండబోదు. వచ్చే దశాబ్ద కాలంలో మనదేశం మధ్యాదాయ దేశం స్థాయి నుంచి ఉన్నతమధ్య ఆదాయ స్థాయికి చేరుకోనుంది. అంటే ఈ రెండు గ్రూపులకు దారిద్య్రరేఖతో పోలిస్తే సహజంగానే అధికాదాయం నమోదవుతుంది. అంటే మధ్యాదాయ దేశంలో సగటు రోజువారీ సంపాదన 4.20 డాలర్లుగా వుంటే, ఉన్నత మధ్య ఆదాయ దేశంలో ఇది 8.30 డాలర్లుగా వుంటుంది. మనదేశంలో పేదరికం ఏ స్థాయిలో వున్నదీ తెలుసుకునేందుకు ఇది సరైన కొలమానంగా పరిగణించాలి.
ఇక రెండో చర్చ అసమానతలపై జరుగుతోంది. అంటే అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందుతున్నాయా లేదా అన్న అంశంపై ఈ చర్చ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది. ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం 2011-12 నుంచి 2022-23 మధ్యకాలంలో దేశంలో అసమానతలు గణనీయంగా తగ్గాయి. దీన్ని సాధారణంగా గినీ స్థిరాంకం ఆధారంగా గణిస్తారు. ఈ స్థిరాంకం విలువ సున్నాగా వున్నప్పుడు దేశంలో అసమానతలు పూర్తిగా సమసిపోయాయని అర్థం. కానీ దీని విలువ 100గా నమోదైన దేశంలో అసమానతలు గరిష్టస్థాయిలో వున్నాయని స్పష్టమవుతుంది. ఇక భారత్ విషయానికి వస్తే ఈ గినీ స్థిరాంకం విలువ 28.8 నుంచి 25.5కు పడిపోయింది. అంటే ఆర్థికాభివృద్ధి ఫలాలు మరింత ఎక్కువ మందికి అందుతున్నాయని అర్థం.
మనదేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఈ పోకడ ఆహ్వానించదగిందే. ఇదే సమయంలో అంతర్జాతీయంగా సరిపోల్చే సమయంలో మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత ప్రభుత్వం చేపట్టిన సర్వేలు ఆదాయ స్థాయి కంటే వినియోగ స్థాయిపైనే దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం దేశంలో అసంఘటితరంగం చాలా విస్తృతంగా వుండటం, ఆదాయపు పన్ను చెల్లింపుదార్ల సంఖ్య తక్కువగా వుండటం వల్ల సరైన అంచనాలు వేయడంలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.మనదేశంలో అసమాన స్థాయిలను వినియోగ స్థాయిని బట్టి అంచనా వేయడానికి ఇదే ప్రధాన కారణం. అమెరికా వంటి దేశాలకు ఇటువంటి సమాచార సమస్య లేదు. అందువల్ల ఈ దేశాల్లో ఆదాయాన్ని బట్టి అసమానతలను అంచనా వేస్తున్నారు. మరి ఈ రెండు రకాల అంచనాలు పూర్తి భిన్నం! ఎందుకంటే ఆదాయం కంటే వినియోగం కోసం చేసే ఖర్చే సమానంగా పంపిణీ అవుతుంది. ఇక్కడపేదవారితో పోల్చినప్పుడు, అధికాదాయం కలిగినవారు ఎక్కువగా పొదుపు చేయడానికే మొగ్గు చూపుతారు. అందువల్ల భారత్‌లోని అసమానతలను ఇతర దేశాలతో పోల్చడమంటే, యాపిల్స్ ను బత్తాయిలతో పోల్చడం వంటిదే!
పేదరిక విస్తృతి, పంపిణీ జరుగుతున్న విధానంపై చర్చ ఆహ్వానించదగిందే. అయితే ఇక్కడ పెద్దగా గుర్తించని మూడో అంశం కూడా వుంది. దీనికి మనదేశంలో పెద్దగా ప్రాధాన్యతనివ్వడంలేదు. అదే ఒక తరం నుంచి మరోతరానికి బదిలీ అవుతున్న స్థాయీ అంతరం! అంటే ఒక తరంలో కొనసాగే ఆర్థిక మరియు సామాజిక స్థాయి కింది తరానికి ఎంతమేర బదిలీ అవుతున్నదనేది ఇక్కడ ప్రధానాంశం. మనదేశంలో దశాబ్దాలుగా ఇది కొనసాగుతోంది. ఒక ప్రత్యేక సమయంలో వ్యక్తుల పేదరికం లేదా అససమానతలను గుర్తించడానికి ఈ స్థాయీ అంతరం ప్రధాన అడ్డంకిగా వుంటోంది. ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి చాలక సాదృశ్యత (సారూప్యత) ఉపయోగపడుతుంది.
ఎట్లా అంటే, వ్యక్తులు తమ జీవన ప్రమాణాలను ఎంతవేగంగా పెంచుకుంటూ ముందుకెళుతున్నారనేది, ఒక ఇరుకైన రోడ్డుపై పెద్ద సంఖ్యలో వరుసగా ప్రయాణిస్తున్న కార్ల వేగాన్ని గమనిస్తే అర్థమవుతుంది. అంటే ఇక్కడ కార్లు ఒక నిర్దిష్ట వేగంలో మాత్రమే వెళ్లగలవు. వ్యక్తుల జీవన ప్రమాణాల పెరుగుదల కూడా సరిగ్గా ఈ కార్ల వేగం మాదిరిగానే వుంటుంది. ఇక్కడ కార్లమధ్య వున్న దూరాన్ని అసమానతలుగా భావించి నప్పుడు, అన్నింటికంటే ముందుగా వెళుతున్న కార్లు మరింత వేగంగా వెళుతూ, తమ వెనుక వున్న కార్లకు మరింత దూరం కాగలవా? ఇప్పుడు తరాల మధ్య స్థాయి అంతరాల విషయానికి వద్దాం. వరుసగా వెళుతున్నప్పుడు, వెనుక వున్న కారు, తన ముందున్నదాన్ని దాటి వెళ్లడం కష్టం. అంటే తన పైతరంతో పోల్చినప్పడు ఒక వ్యక్తి తన స్థాయిని పెంచుకోవడం కూడా అంతే కష్టం.
చారిత్రక కారణాలవల్ల వెనుకబాటుకు, ముందు కెళ్లకుండా నిరోధానికి గురైనవారు కూడా తమ జీవన ప్రమాణాల స్థాయిని పెంచుకోవడానికి అవరోధాలు తప్పవు. మనదేశంలో తరాల మధ్య కొనసాగే ఈ చలనశీలతనను పెద్దగా పట్టించుకోలేదన్న అంశాన్ని ఎన్నో అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక, సామాజిక వెనుకబాటులో మగ్గుతున్నవారు ముందుకెళ్లడం చాలా కష్టం. ఇటీవల ప్రపంచ బ్యాంకు ఒక సూచికను విడుదల చేసింది. ఒక బాలుడు/ బాలిక ఆదాయం తన తల్లిదండ్రుల ఆదాయంపై ఏవిధంగా ఆధారపడివుంటుందనేది ఈ సూచిక వెల్లడించింది. దీని ప్రకారం ప్రపంచ బ్యాంకు మొత్తం ఐదు కేటగిరీలుగా విభజించింది. భారత్ వీటిల్లో చిట్టచివరిదైన ఐదో కేటగిరీకిందికి వచ్చింది. అత్యంత తక్కువ స్థాయిలో తరాల మధ్య ఆదాయ చలనశీలత వుండే కేటగిరీ ఇది!
తరాల మధ్య చలనశీలతను గణించడానికి ఇతర మార్గాలు కూడా వున్నాయి. ఉదాహరణకు విద్యను తీసుకుంటే, ఈ రంగంపై ప్రముఖ ఆర్థిక వేత్తలు శామ్ ఆషర్, పౌల్ నోవోసాద్, ఛార్లీ రఫ్ కిన్‌లు దిగువ నుంచి సగం స్థాయి వరకు వున్న వర్గాలకు చెందిన పిల్లల్లో విద్యా ర్యాంక్‌లు ఎట్లా వున్నదీ పరిశీలించారు. ఈ రంగంలో కూడా మనదేశంలో తరాల మధ్య చలనశీలత తక్కువగా వున్నట్టు వీరి అధ్యయనాలు స్పష్టం చేసాయి. భారత్‌లోని మానవాభివృద్ధి సర్వే సమాచారం రెండు తరాల మధ్య కొనసాగిన ప్రాథమిక వృత్తికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. 2019లో తాడిట్ కుందు అనే ఒక ఆర్థిక వేత్త ఒక దినప త్రికలో తన అధ్యయన వివరాలు తెలిపారు. దీని ప్రకారం 1980 ప్రాంతంలో జన్మించిన మగపిల్లల్లో 63% శాతం మంది, వ్యవసాయం, వ్యవసాయ కూలీ లేదా నిర్మాణ రంగ కార్మికులుగా కొనసాగిన తమ తల్లిదండ్రుల వృత్తుల్లోనే స్థిరపడ్డారు!
ఈ వివరాలను పరిశీలిస్తే ఏ ప్రజాస్వామిక సమాజమైనా తగిన అవకాశాలు కల్పించకపోతే, ఎదుగుదల సాధ్యం కాదని స్పష్టమవుతోంది. ఇరుకు రోడ్డుపై ప్రయాణించే కార్లు, తమ ముందు వాటిని దాటి ముందుకె ళ్లే సామర్థ్యాన్ని కలిగివుండాలి. అంతేకాని వంశపారంపర్యత నిర్ధారించిన స్థాయిల్లోనే కొట్టుమిట్టాడ కూడదు. ఇక్కడ వెనుక వున్న కారు, తన ముందుదాన్ని దాటి వెళ్లాలంటే రోడ్డును వెడల్పు చేయాలి. అప్పుడే అది తేలిగ్గా ముందుకు దూసుకెళ్లగలదు. కింది తరాలవారు ముందుకెళ్లడానికి ప్రజాస్వామిక సమాజం కల్పించే అవకాశాలు సరిగ్గా ఈ రోడ్డు వెడల్పు చేయడం వంటివే! అంటే అందరికీ సమాన విద్యను అందుబాటులోకి తేవడం, నిర్ణయాత్మక చర్యలు, ఉద్యోగాల కల్పన, దేశంలోని మరింత గతిశీలత కలిగిన ప్రాంతాలకు వలస వెళ్లడం, కొత్త సంస్థల ఏర్పాటుకు అడ్డంకులను చాలావరకు తొలగించడం వంటివే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించే అవకాశాలు!!
– నిరంజన్ రాజధ్యాక్ష
” మింట్ ” సౌజన్యం తో





