గంజాయి మత్తులో యువత భవిష్యత్తు… దేశాన్ని మింగుతున్న మత్తు మానవ విపత్తు

గంజాయి అనే మత్తు పదార్థం ఈ కాలంలో దేశాన్ని మానవీయ విపత్తుగా ముప్పతిప్పలు పెడుతోంది. గ్రామీణం గానీ, పట్టణం గానీ, పాఠశాలలైనా, కళాశాలలైనా, యువతీ యువకులైనా … తేడా లేకుండా ఈ మత్తు మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇది కేవలం ఒక మానసిక వ్యసనం కాదు. శారీరక ఆరోగ్యాన్ని, కుటుంబ పరిమితిని, సామాజిక సమతుల్యతను, ఆర్థిక స్థిరత్వాన్ని నాశనం చేసే భయంకరమైన వ్యాధిగా రూపుదిద్దుకుంది.
గంజాయి అనేది “గంజి మొక్క” నుండి వచ్చే మత్తు పదార్థం. దీనిలో ప్రధానంగా ఉండే క్రియాశీల పదార్థం టెట్రా హైడ్రో. కానబినాల్, ఇది మెదడులోని స్వభావాన్ని ప్రభావితం చేస్తూ తాత్కాలిక ఆనందానుభూతిని కలిగించ గలదు. అయితే దీర్ఘకాల వాడకం వల్ల మానసిక అస్థిరత, భ్రమలు, నిస్పృహ, బహుళ వ్యక్తిత్వ లక్షణాలు, ఆందోళన, విపరీత భావోద్వేగాలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఊపిరితిత్తుల సమస్యలు, గుండె వేగం పెరగడం, జీర్ణక్రియ మందగించడం వంటి శారీరక దుష్ప్రభావాలు కలుగుతాయి.
2021లో ఆఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ రూపొందించిన డ్రగ్ వినియోగంపై జాతీయ సర్వే ప్రకారం దేశంలో సుమారు 3.1 కోట్ల మంది కనీసం ఒక్కసారి గంజాయి వాడినట్లు తేలింది. ఇందులో దాదాపు 70 లక్షల మంది గంజాయికి బానిసలుగా మారిన వారే. పట్టణాల్లో మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గంజాయి వినియోగం వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 15 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు కల యువత దీనికి బలవుతున్నారు.
గంజాయి వినియోగానికి ప్రధాన కారణాలలో ఒకటి – సులభ లభ్యత. దేశంలోని ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ల ఏజెన్సీ ప్రాంతాలలో విస్తృతంగా సాగవుతోంది. అక్కడినుండి ఇది దేశ వ్యాప్తంగా అక్రమంగా రవాణా అవుతోంది. ముంబయి, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కళాశాలలు, పబ్‌లు, పార్టీలు గంజాయి విక్రయాలకు కేంద్రాలుగా మారిపోయాయి. యువతలో స్నేహితుల ఒత్తిడి, సరదా ప్రయోగం అనే పేరుతో మొదలై, వ్యసనంగా మారుతోంది. నిరుద్యోగం, కుటుంబ కలహాలు, ప్రేమ విఫలాలు వంటి మానసిక ఒత్తిళ్లు కూడా గంజాయి వైపు నెట్టేస్తున్నాయి. అంతేకాదు, “గంజాయి హానికరం కాదు”, “ఇది ఆయుర్వేద మందు” అనే తప్పుడు ప్రచారాలు కూడా యువతను ఈ మత్తులోకి తొక్కిస్తున్నారు.
ఈ మత్తు పదార్థం ప్రభావం కేవలం వ్యక్తిగత స్థాయిలో కాకుండా కుటుంబానికి, సమాజానికి తీవ్రంగా విస్తరిస్తోంది. గంజాయి వాడకం వల్ల పాఠశాల విద్యార్థులలో చదువుపై ఆసక్తి తగ్గిపోతోంది. తరచుగా గైర్హాజరు అవుతూ చివరికి చదువు మానేస్తున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, ఏకాగ్రత కోల్పోవడం, మానసిక స్థిరత్వం కోల్పోవడం వలన ఉద్యోగ అవకాశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోంది. నేరాల శాతం పెరుగుతోంది. గంజాయి కొనుగోలుకు డబ్బుల కోసం దొంగతనాలు, దాడులు వంటి నేరాలకు పాల్పడే అవకాశాలు కూడా పెరిగాయి. డ్రగ్ ఆధారిత నేరాల శాతం గత ఐదేళ్లలో 32 శాతం మేర పెరిగిందన్నది ప్రభుత్వ గణాంకాలే చెబుతున్న నిజం.
ఇటు తెలంగాణలో 2023లో మాత్రమే గంజాయి అక్రమ రవాణా కేసులు 850కి పైగా నమోదయ్యాయి. హైదరాబాదు, రంగారెడ్డి ప్రాంతాల్లోనే దాదాపు 220 కేసులు చోటుచేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖ, అల్లూరి సీతారామరాజు, పాడేరు, ముంపు ప్రాంతాల్లో గంజాయి సాగు కొనసాగుతూనే ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారు 1,500 ఎకరాల గంజాయి సాగు గుర్తించబడి నాశనం చేయబడినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనటానికి కేంద్ర ప్రభుత్వం 1985లో మాదక ద్రవ్యాలు మరియు మానసిక ప్రభావ పదార్థాల చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం గంజాయి సాగు, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం నేరంగా పరిగణించ బడుతుంది. కేంద్ర స్థాయిలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్రాల్లో పోలీసు శాఖలు, ఎక్సైజ్ శాఖలు గంజాయి వ్యాపారాన్ని అరికట్టేందుకు కృషి చేస్తున్నాయి. డ్రోన్‌ల ద్వారా పర్యవేక్షణ, సరిహద్దుల్లో తనిఖీలు, రహస్య సమాచార మాధ్యమాల ద్వారా గంజాయి వాణిజ్యాన్ని గుర్తించి నిర్వీర్యం చేస్తున్నారు. పాఠశాల స్థాయిలో అవగాహన సదస్సులు, కళాశాలల వద్ద డ్రగ్ నిరోధ శిబిరాలు నిర్వహించడం మొదలు పెట్టారు.
2025 నాటికి మత్తు పదార్థాల వినియోగాన్ని 50 శాతం తగ్గించాలన్న లక్ష్యంతో కేంద్రం “దేశీయ మత్తు నియంత్రణ చర్యల కార్యాచరణ పథకం”ను చేపట్టింది. ఇందులో అవగాహన కార్యక్రమాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటు, మానసిక చికిత్సలు, కుటుంబాల సహకారం వంటి అంశాలను మేళవించారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాలల పాఠ్యాంశాలలో డ్రగ్స్ హానిపై ప్రత్యేక అధ్యాయాలు ప్రవేశ పెట్టాయి.
అయితే ఈ చర్యలు సరిపోవు. సమాజం మొత్తం దీన్ని ఒక జాతీయ సంక్షోభంగా గుర్తించాలి. ప్రతీ పాఠశాల, కళాశాల, కుటుంబంలో ఈ విషయంపై చర్చ, చైతన్యం అవసరం. యువత మానసిక ఒత్తిళ్లకు గురికాకుండా ఉండేందుకు వారికి మానసిక ఆరోగ్య మార్గదర్శకత అవసరం. ఉపాధి అవకాశాలు పెంచాలి. సినిమా, టెలివిజన్, సోషల్ మీడియా వంటి వేదికల్లో గంజాయి వాడకాన్ని ప్రోత్సహించే దృశ్యాలను నియంత్రించాలి. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ఈ పోరాటంలో భాగస్వామ్యం ఉండాలి.
గంజాయి మహమ్మారి మన దేశ యువతను బలి తీసుకుంటోంది. అది కేవలం ఒక మత్తు పదార్థం కాదు – అది ఒక భవిష్యత్ హంతక మార్గం. ఈ మత్తు మాయను అంతమొందించాలి. ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మానసిక నిపుణులు, సమాజ సేవా సంస్థలు, యువతీ, యువకులు – అందరూ చేతులు కలిపి పని చేయాలి. అంతే కాదు, మానవతా దృష్టితో ఈ వ్యసనాన్ని ఔషధ చికిత్స, పునరావాసం, బోధన, శిక్షణ, క్రమశిక్షణ అనే అంశాలుగా అర్థం చేసుకుని ముందుకెళ్లాలి.
మన దేశం ఆరోగ్యంగా ఉండాలంటే మన యువత ఆరోగ్యంగా ఉండాలి. యువత చేతులు సృష్టి కర్తలుగా ఎదగాలి. మత్తు పదార్థాలకు బానిసలుగా కాక. యువతను గంజాయి సంకెళ్ల నుండి విముక్తి చేయాలంటే – చైతన్యంతో, శక్తితో, స్పూర్తితో ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేయాలి. అప్పుడు గంజాయి రహిత భారతం సాధ్యమే. అప్పుడు మన దేశ భవిష్యత్తు వెలుగులవైపు ప్రయాణిస్తుంది.
రామ కిష్టయ్య సంగన భట్ల, 
సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్టు – 9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *