ఉపాధ్యాయుల బోధనేతర పనులతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్ధకం!

“ఉదాహరణకు 2025 సెప్టెంబర్ ఒక నెల షెడ్యూల్‌ను మాత్రమే తీసుకున్నా, దాదాపు ప్రతి వారం బోధనేతర కార్యక్రమాలతో పాఠశాలల ప్రధాన కర్తవ్యమైన తరగతి బోధన బలహీనమవుతోంది. ATL Lab, కళా ఉత్సవ్, సైన్స్ సెమినార్, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్, భాషా దినోత్సవాలు. 4 రోజులు వరుసగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్. UDISE+, FRS, మధ్యాహ్న భోజన పథకం (MDM) రిపోర్టింగ్, SHVR రేటింగ్, Inspire నామినేషన్లు, FA-2 మార్క్ ఎంట్రీ. సాంస్కృతిక/జాతీయ దినోత్సవాలు: ఉపాధ్యాయ దినోత్సవం, లిటరసీ డే, హిందీ దివాస్, నాటకాలు, సభలు. ఆడిట్లు , తనిఖీలు: సమగ్ర శిక్షా ఆడిట్లు, పాఠశాల స్థాయి ఆర్థిక పరిశీలనలు. ఒకే నెలలో ఇంత పనులు రావడం వల్ల తరగతి బోధనకు సమయం దొరకడం కష్టమే.”

ఆర్. వెంకట్ రెడ్డి ,
జాతీయ కన్వీనర్, ఎం. వి. ఫౌండేషన్
venkatmvf@gmail.com
మొబైల్ : 99498 65516

ప్రభుత్వ పాఠశాలలలో ఉపాధ్యాయులు తరగతి బోధనతో పాటు అనేక పరిపాలనా పరమైన పనులు, రిపోర్టింగ్ ఆన్ లైన్ ఆఫ్ లైన్, విభాగ సంబంధిత పనులు, మీటింగులు అలాగే ఆన్ లైన్ మీటింగ్ లతో పని వత్తిడి కి గురి అవుతున్నారని తెలుస్తుంది. ఇవన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ, రోజు రోజుకు ఎక్కువ కావడం వలన విలువైన బోధనా సమయాన్ని కోల్పోతున్నామనీ పలు మార్లు అసహనం వ్యక్తం చేస్తుంటారు. ఈ మధ్య టీచర్లు సామాజిక మధ్యమాలలో పాఠశాలలకు వస్తున్న విద్యా శాఖ ఉత్తర్వులపై ‘మాకు బోధించే సమయాన్ని ఇవ్వండి మహా ప్రభు లారా’ అని ‘ప్రభుత్వ స్కూళ్లకు మహిమ కలుగు కాక’ అని ‘కనీసం తెలుగు పేర్లన్నాపెట్టించండీ అని స్వచ్చ ఏవం హరిత విద్యాలయ అనే సర్క్యులర్ ను ఉద్దేశించి మరొకరు, ‘వామ్మో నయం మా అప్పుడు మా పంతుళ్లకు ఇలాంటి పనులన్నీ అప్పచెప్పి ఉంటే మేము టీచర్లమూ అయ్యే ఛాన్సే ఉండేది కాదని’ మరొకరు జోకులు వేసుకుని వారి నిస్సహాయతను చాటుకుంటున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఉత్తర్వులలో వాడే భాష కూడా అభ్యంతకరముగానే ఉంటుంది .

ఉదాహరణకు 2025 సెప్టెంబర్ ఒక నెల షెడ్యూల్‌ను మాత్రమే తీసుకున్నా, దాదాపు ప్రతి వారం బోధనేతర కార్యక్రమాలతో పాఠశాలల ప్రధాన కర్తవ్యమైన తరగతి బోధన బలహీనమవుతోంది. ATL Lab, కళా ఉత్సవ్, సైన్స్ సెమినార్, రాష్ట్రీయ ఆవిష్కార్ సప్తాహ్, భాషా దినోత్సవాలు. 4 రోజులు వరుసగా స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్. UDISE+, FRS, మధ్యాహ్న భోజన పథకం (MDM) రిపోర్టింగ్, SHVR రేటింగ్, Inspire నామినేషన్లు, FA-2 మార్క్ ఎంట్రీ. సాంస్కృతిక/జాతీయ దినోత్సవాలు: ఉపాధ్యాయ దినోత్సవం, లిటరసీ డే, హిందీ దివాస్, నాటకాలు, సభలు. ఆడిట్లు , తనిఖీలు: సమగ్ర శిక్షా ఆడిట్లు, పాఠశాల స్థాయి ఆర్థిక పరిశీలనలు. ఒకే నెలలో ఇంత పనులు రావడం వల్ల తరగతి బోధనకు సమయం దొరకడం కష్టమే. వీటికి తోడు మధ్యాన్న భోజనం నాణ్యత సరకుల ఇండెంట్లు తిన్న పిల్లల లెక్కలు తినని పిల్లల లెక్కలు ఆన్ లైన్ లో పొందుపరచాలి. ప్రతి రోజు వాట్సాప్ లో అర్జెంట్, మోస్ట్ అర్జెంట్ అంటూ ఆదేశాలు జారీ అవుతుంటాయి. ఆపార్ ,పెన్ , ఆధార్ అపడేట్లు వేరే పని. ఈ పనులన్నీ అందరూ టీచర్లు చేయరు కదా కేవలం ప్రధాన ఉపాధ్యాయులకే ఈ పనులన్నీ అందులో ప్రధాన ఉపాధ్యాయుల పనిలో భాగమే అని వాదన చేయవచ్చు. ప్రధాన ఉపాధ్యాయులు టీచర్ల సహకారం లేనిది ఇన్ని పనులు చేయడం సాధ్యమయ్యే పని కాదు. కొంత మంది ఉపాధ్యాయులు ఇవన్నీ అధిగమించి బోధనను చేస్తూ చేయించి నట్లైతే చాటుగా వారికి చండశాసనులు లాంటి బిరుదులు కూడా పొందుతుంటారు.కానీ అతటా ఇది సాధ్యం కాదు.

తరగతి గదిలో బోధనకు తరచూ అడ్డంకుల వలన విద్యార్థుల నేర్చుకునే ఫలితాలు దెబ్బతింటున్నాయి. ఈ చర్యలన్నీ ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్ట (RTE-2009) ఉల్లంఘననే. ఉపాధ్యాయులకు జనాభా గణన లెక్కలు, ప్రకృతి వైపరిత్యాలలో సహాయ విధులు మరియు పార్లమెంటు, రాష్ట్ర శాసన సభ, స్థానిక ప్రభుత్వాలకు జరిగే ఎన్నికలకు సంబంధించిన మూడు విధులను మినహాయించి టిచర్లను ఏ ఇతర విద్యేతర పనులకు పంపకూడదని విద్యా హక్కు చట్టం నిర్దేశిస్తుంది.బోధన సమయం తక్కువ అవుతుండడం వలన విద్యార్థులకు నేర్పే మరియు విద్యార్థులకు నేర్చుకునే సామర్ధ్యాలు పడిపోతున్నాయి. ఉపాధ్యాయులకు బోధించాలనే ఉత్సాహం తగ్గుతోంది వారు ఎక్కువ ఇతర పనుల్లో నిమగ్నమై, తమ అసలు బాధ్యత అయిన బోధనను విస్మరిస్తున్నారు.

పై అధికారుల పర్యవేక్షణలో ప్రాధాన్యం బోధన నాణ్యతపై కాకుండా, బోధనేతర కార్యక్రమాల అమలుపై ఎక్కువ శ్రద్ద చూపుతారు. కారణం వారి పై అధికారులు కింది అధికారుల మీద ఈ విషయాల మీదనే వత్తిడి చేస్తుంటారు. దీని ప్రభావం ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒక సారి జరిగే జాతీయ విద్యా సామర్ధ్యాల సాధన నివేదికలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సామర్ధ్యాలు జాతీయ సగటు కంటే తక్కువగాను చాలా రాష్ట్రాల కంటే మన విద్యార్థులు వెనుక ఉన్నారని దీనికి ఉపాధ్యాయులే కారకులుగాను దోషులగా చిత్రీకరిస్తుంటారు. ఉపాధ్యాయుల బోధన బోధనేతర పనుల మీద జాతీయ స్థాయిలో పలు అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ (NIEPA) చేసిన అధ్యయనం ప్రకార కేవలం 19% సమయాన్ని మాత్రమే బోధనకు కేటాయిస్తున్నట్లు మిగతా 42% ముఖ్యమైన బోధనేతర పనులకు మరియు 38% పాఠశాల నిర్వహణ మరియు విద్యా శాఖ అప్పచెప్పే పనులకు పోతుందని ఈ నివేదిక వెల్లడించింది. నూతన జాతీయ విద్యా విధానం లో కూడా ఈ విషయాన్ని ఉటంకిస్తూ ఉపాధ్యాయుల తో బోధనేతర పనులు చేయించరాదని పేర్కొన్నది. దిల్లీ లో చేసిన ఒక అధ్యయనంలో 66% ఉపాధ్యాయులు బోధనేతర పనులు బోధనకు అతి ముఖ్య అడ్డంకులుగా పేర్కొన్నారు. ఈ మధ్య యునిసెఫ్ వాళ్ళు తెలంగాణ లో విద్యా సామర్ధ్యాలు అందించడం లో వెనుకబడి ఉండడం మీద క్షేత్ర స్తాయిలో కేవలం ఉపాధ్యాయుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి చేసిన పరిశోధనలో చాలా ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. మామూలుగా అధికార సమావేశాలలో ఈ విషయాలు చర్చకు రావు. చర్చ చేసిన స్పందన ఉండదని చాలా సందర్భాలలో అధికారులకు ఏది వినాలనిపిస్తే అదే చెప్పడం లేదా మౌనంగా ఉండిపోవడమే చేస్తుంటారు.

ఈ నివేదికలో అత్యధిక శాతం టీచర్లు ఫేస్ రీడింగ్ హాజరుకు దాదాపు 45 నిమిషాల సమయం పోతుందని, సమాచారం నింపడానికి, మధ్యాహ్న భోజన లెక్కలు ఫోటోస్ అప్లోడ్ చేయడం , తల్లిదండ్రుల సమావేశాలు పెట్టినప్పుడు కూడా ఫోటోలు అప్లోడ్ నెట్ కననెక్షన్ సరిగా లేక పోతే అప్ లోడ్ కు సమయం పడుతుందని చెప్పారు. స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ వలన అంతగా ఉపయోగం లేదని తప్పులు ఎత్తి చూడం తప్ప క్షేత్ర స్థాయి పరిస్థితికి అక్కడ మాట్లాడే విషయాలకు పొంతన ఉండదని కేవలం గైడ్ లైన్స్ ను మాత్రమే ఆచారిస్తారని తెలిపారు. శిక్షణా తరగతులకు క్షేత్ర స్తాయి పరిస్థితులకు అసలు పొంతనే ఉండదని అభిప్రాయ పడ్డారు. తరగతిలో ఎలా నేర్పించాలో మాకే వదిలేయాలని టీచర్లకు స్వయం ప్రతిపత్తి అవసరమని బోధన ఎలా చేయాలో చాలా కేంద్రీకృత నిర్ణయాలు చేస్తారని బోధన ఎలా చేయాలో ఉపాధ్యాయులకు వదిలి వికేంద్రీకృత విధానం ఉన్నప్పుడు మాత్రమే బోధన సరిగా జరిగే అవకాశం ఉంటుందని బలంగా నమ్ముతున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు మనకు మామూలుగా కనిపించినా అనేక వత్తిడి లలో ఉంటారని అది బయటకు కనిపించకుండా అలసట, ఉదాసీనత అధిక పని తో బర్న్అవుట్ అయి బోధన పట్ల కూడా ఆసక్తి కోల్పోతారని పలు పరిశోధనలు చెపుతున్నాయి.

ప్రపంచ మానసిక ఆరోగ్య రోజు సందర్భంగా జామిత అనే మానసిక నిపుణులు జరిపిన అధ్యయనంలో ఉపాధ్యాయులు పని ఒత్తిడి గురి కావడానికి కొన్ని ప్రధాన కారణాలను వెల్లడించింది. ఆర కొర నిధులతో పాఠశాలలను నడపడం, తల్లిదండ్రుల నుండి సమాజం నుండి తమ పని చేసే సామర్ధ్యం పై వస్తున్న డిమాండు, పై అధికారులు చెప్పే అధిక పని భారం, పనిలో వెనుకబాటు లో ఉంటే పడి మంది లో అవమానానికి గురి అవుతామన్న ఒత్తిడి, చిన్న చిన్న విషయాలకు కూడా నిర్ణయాలు తీసుకునే అధికారం లేకపోవడం ,వ్యవస్థ లో వేగంగా వస్తున్న పాఠ్యాంశాల్లో మార్పులు తరగతి నిర్వహణలో మార్పులు, ఒంటరిగా లేదా ఇద్దరే పని చేయడం పై నుండి సహాయ సహకారాలు అందకపోవడం,ఎంత పని చేసినా గుర్తింపు లేకపోవడం, పలు రకాల పరీక్షల నిర్వహణ జిల్లా అధికారుల నుండి పరీక్షలలో ఫలితాలు ఉన్నతంగా రావాలని విపరీతమైన వత్తిడి చేయడం, ఫలితాలు రానందు వల్ల విమర్శలకు గురి కావడం తో పాటు పాలన పర చర్యలకు గురి అవుతామని ఇలా అనేక వత్తిడి ల కారణంగా చాలా మంది ఉపాధ్యాయులు బర్న్అవుట్ కు గురి అవతారని తెలిసింది.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వాలు వేల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తుంది. ఉపాధ్యాయులను బోధనేతర సమయానికి వాడితే చాలా విలువైన సమయము ప్రజా ధనం వృధా అవుతుంది. ప్రభుత్వ పాఠశాలలో అత్యధికంగా చదువుకుంటున్న పేదల, బలహీన వర్గాల పిల్లలు నాణ్యమైన విద్యకు దూరం అవుతారు. వారి విద్యా హక్కు నిశ్శబ్దంగా ఉల్లంఘించ బడుతుంది. ఈ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించకపోగా వ్యవస్థ దోషాన్ని పిల్లలపై నెట్టి వేస్తుంటాము.విద్యను అందుకోక పోవడానికి తామే కారకుల మనే మచ్చ వాళ్ళ జీవితాంతం వెంబడిస్తుంది. మరో వైపు అంకితమైన భావంతో పని చేస్తే ఈ పనులన్నీ అడ్డంకులు కావని,టీచర్లకు ఇస్తున్న శిక్షణ నిరుపయోగం కాదని పాత బోధన పద్దతిని పాత సిద్దాంతాన్ని పాటించకుండా ఆధునిక యుగం లో పని చేసే మెళుకువలు మరియు తరగతి గది నిర్వహణ మెళుకువలు నేర్చుకుని ఉపాధ్యాయులు మంచి ఫేసీలిటేటర్ గా కావాలనే వాదన కూడా ఉంది.

ఒకేసారి పలు కార్యక్రమాలు చేసే నైపుణ్యతలు పెంచుకోవాలి తప్ప బోధనేతర పనులు భారంగా చూడొద్దనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చర్చ అవసరమే అయినా నోబుల్ బహుమతి గ్రహీత సుప్రసిద్ద స్పానిష్ కవియిత్రి చిలియన్ దేశస్థురాలు గాబ్రియేల మిస్ట్రాల్ అన్నట్లు ‘మనము ఎన్నో తప్పులు, ఎన్నో లోపాలు చేసినా, వాటన్నింటిలోనూ అత్యంత పెద్ద నేరం పిల్లలను విస్మరించడం, జీవన ప్రవాహాన్ని నిర్లక్ష్యం చేయడమే. మనకు అవసరమైన అనేక విషయాలు వేచి ఉండవచ్చు. కానీ బాల్యం మాత్రం వేచి ఉండదు. ఈ క్షణంలోనే అతని ఎముకలు ఏర్పడుతున్నాయి, రక్తం తయారవుతోంది, ఇంద్రియాలు అభివృద్ధి చెందుతున్నాయి. అతనికి మనము ‘రేపు’ అని సమాధానం చెప్పలేము. అతని పేరు ‘ఈ రోజు’ కావున మన పిల్లలు నాణ్యమైన విద్యను అందుకోవడం అత్యావకాశ్యత గా గుర్తించాలి.

చివరగా ..
ఉపాధ్యాయుల నైపుణ్యం పిల్లలకు జ్ఞానం, విలువలు, మరియు ఆలోచనా శక్తిని బోధించడంలో ఉంటుంది. కానీ ఉపాధ్యాయుల బోధించే హక్కును దూరం చేయడం వలన వారి వృత్తి ని అగౌరపరచడమే కాకుండా అవమాన పరిచినట్లు కూడా అవుతుంది. వారి నైపుణ్యాన్ని బయటకు రాకుండా చేసినట్లు అవుతుంది. చివరికి బోధన వృత్తిని కించపరిచినట్లు అవుతుంది. ముందుగా ఉపాధ్యాయులు మౌనం వీడి బోధనకు ఎదురుకుంటున్న ఇబ్బందులను గుర్తించి పరిష్కారం వైపు కదలాలి. లేకపోతే మన పిల్లలకే విద్య ‘మంది పిల్లలకు’ విద్య అవసరం లేదనే కుట్రలో మీరు కూడా భాగస్వాములవుతారని గుర్తించండి. బోధన సమయాన్ని కాపాడటం కేవలం పరిపాలనా సంస్కరణ కాదు, ఇది మానవతా బాధ్యత మరియు రాజ్యాంగబద్ధమైన కర్తవ్యము. కాబట్టి విద్యాశాఖ తక్షణమే చర్యలు తీసుకొని, ఉపాధ్యాయులను బోధనేతర పనులనుంది విముక్తి చేసి విద్యార్థుల విద్యా హక్కును కాపాడాలని విజ్ఞప్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *