మహారాష్ట్రలో తొలి తెలుగు కథా రచయిత్రి

“బండారు అచ్చమాంబ ‘మహారాష్ట్రలో తొలి తెలుగు రచయిత్రి’ మాత్రమే కాదు… తెలుగు భాషలో.., తెలుగు కథా సాహిత్యంలో ‘మొదటి కథా రచయిత్రి’ కూడా..! గురజాడ అప్పారావు కంటే పదేండ్లు ముందే అచ్చమాంబ రాసిన కథ ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురితమైంది. అచ్చమాంబకు ‘తొలి స్త్రీవాద చరిత్రకారిణి’ అనే పేరు కూడా ఉంది. ఆ కాలంలో మహిళలకు విద్యావకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అచ్చమాంబ స్వయం కృషితో విద్యాభ్యాసం చేసి, రచయిత్రిగా కూడా ఎదగడం నేటి మహిళలకు కూడా ఆదర్శణీయమే..!”
మహారాష్ట్రలో తొలి తెలుగు కథా రచయిత్రి బండారు అచ్చమాంబ, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో, 1874లో జన్మించారు. తన ఆరేండ్ల వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆమె తల్లి పిల్లల్ని తీసుకుని మహారాష్ట్ర ప్రాంతానికి వెళ్లింది. పదేండ్ల వయసులో బండారు మాధవరావుతో వివాహం జరిగింది. పదిహేడు సంవత్సరాల వయసులో మాధవరావుతో కాపురం మొదలుపెట్టింది.
తెలుగు విజ్ఞాన సర్వస్వం’* (ఎన్‌సైక్లోపీడియా) రాసిన చరిత్రకారుడు, పండితుడు *కొమర్రాజు వేంకట లక్ష్మణరావు* అచ్చమాంబకు స్వయాన సోదరుడు. భర్త మాధవరావు బ్రిటిష్ ప్రభుత్వ ఉద్యోగిగా నాగ్‌పూర్‌లో పనిచేసేవారు. నాగ్‌పూర్‌లో ఉన్న సమయంలో అచ్చమాంబకు విస్తృతమైన పఠనం చేసే అవకాశం దక్కింది. మొదట్లో మాధవరావుకు అచ్చమాంబ చదువుకోవడం అంతగా నచ్చేది కాదు కానీ, సోదరుడు లక్ష్మణరావు కూడా చదువుల నిమిత్తం నాగ్‌పూర్ వచ్చినప్పుడు తమ్ముని పక్కన కూర్చుని పట్టుదలతో, దీక్షగా చదువుకునేది. నాగ్‌పూర్‌లో ఉన్న కాలం అచ్చమాంబ జీవితంలో అత్యంత ప్రభావంతమైన దశగా భావిస్తారు. లక్ష్మణరావు కూడా పలురకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవాడు. నాగ్‌పూర్‌లోనే ఆమె హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, గుజరాతి భాషలతో పాటు కాస్త బెంగాలి, సంస్కృతం కూడా నేర్చుకున్నారు. ప్రధానంగా మహిళల
స్థితిగతులపై లోతైన అవగాహన పెంచుకున్నారు.
బండారు అచ్చమాంబ ‘మహారాష్ట్రలో తొలి తెలుగు రచయిత్రి’ మాత్రమే కాదు… తెలుగు భాషలో.., తెలుగు కథా సాహిత్యంలో ‘మొదటి కథా రచయిత్రి’ కూడా..! గురజాడ అప్పారావు కంటే పదేండ్లు ముందే అచ్చమాంబ రాసిన కథ ‘హిందూ సుందరి’ పత్రికలో ప్రచురితమైంది. అచ్చమాంబకు ‘తొలి స్త్రీవాద చరిత్రకారిణి’ అనే పేరు కూడా ఉంది. ఆ కాలంలో మహిళలకు విద్యావకాశాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ అచ్చమాంబ స్వయం కృషితో విద్యాభ్యాసం చేసి, రచయిత్రిగా కూడా ఎదగడం నేటి మహిళలకు కూడా ఆదర్శణీయమే..!
అచ్చమాంబకు ఒక కొడుకు, ఒక కూతురు.. కానీ చాలా చిన్న వయసులోనే వారిద్దరూ చనిపోవడం తో అచ్చమాంబ తీవ్రమైన మానసిక వ్యథకు గురయ్యారు. అయినప్పటికీ ఆమె తన బాధను సమాజ సేవ, రచనల వైపు మళ్ళించారు. ధైర్యం, స్వయం కృషి, మహిళా విద్యపై బలమైన నమ్మకం, సంస్కరణ భావాలు, సహనం, సాహిత్య సేవ ఆమె వ్యక్తిత్వంలోని ప్రధాన లక్షణాలు. అచ్చమాంబ రచనల్లో చరిత్రాత్మకమైన దృష్టికోణం కనిపిస్తుంది. ఆమె రాసిన *‘అబల సచ్చరిత్ర రత్నమాల’* అనే పుస్తకం ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఈ పుస్తకంలో వేయి సంవత్సరాల భారతీయ మహిళలకు సంబంధించిన చరిత్రను ఆధారాలతో  సహా పేర్కొన్నారు. 34 మంది మహిళల అందం, ధైర్యం, వ్యక్తిత్వం,  చరిత్ర తదితర అంశాలను ఆ పుస్తకంలో పొందుపరిచారు. నేటికీ ఈ పుస్తకం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎంతో ఔచిత్యంగా ఉంది. ఈ పుస్తకం లోని కథనాలను కందుకూరి వీరేశలింగం పంతులు తన పత్రిక “చింతామణి” లో ప్రచురించారు..
అచ్చమాంబ – – –
–  ధనత్రయోదశి,
–  గుణవతియగు స్త్రీ (తెలుగు జనానా పత్రిక, 1901 మే),
– లలితా శారదులు,
–  జానకమ్మ (తెలుగు
       జనానా పత్రిక, 1902        మే),
– దంపతుల ప్రథమ కలహం (హిందూ సుందరి 1902 జూన్),
–  సత్పాత్ర దానం (హిందూ సుందరి 1902),
– స్త్రీ విద్య (హిందూ సుందరి),
– భార్యాభర్తల సంవాదం (హిందూ సుందరి, 1903 జులై),
–  అద్దమును సత్యవతియును (హిందూసుందరి
1903),
– బీద కుటుంబం (సావిత్రి పత్రిక 1904),
– ప్రేమ పరీక్షణం (1898),
–  ఎరువు సొమ్ము పరువు చేటు (1898)
తదితర కథలు రాసినట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. మరికొన్ని పుస్తకాలు కూడా అచ్చమాంబ రాశారు. ‘అబల సచ్ఛరిత్ర రత్నమాల’, ‘క్రోషో అల్లిక మీద పుస్తకం’, ‘ఊలు అల్లిక మీద పుస్తకం’, ‘ఒక శతకం’ కూడా రాసినట్లుగా పరిశోధకులు తేల్చి చెప్పారు.  అచ్చమాంబ రచనల్లో స్ఫూర్తిదాయక శైలితో పాటు, పాఠకుల్లో ఆత్మవిశ్వాసం కలిగించే తీరు, సామాజిక సందేశం, మహిళా సాధికారితపై బలమైన దృక్కోణం స్పష్టంగా కనిపిస్తాయి. నాగ్‌పూర్ నగరం ఆమెను సాధారణ గృహిణి నుండి అసాధారణ సాహిత్యకారిణిగా, సామాజిక సంస్కర్తగా తీర్చిదిద్దిందని నిస్సంకోచంగా చెప్పొచ్చు.. ఇంతటి ప్రతిభావంతురాలైన రచయిత్రి 1905, జనవరి 18న, మధ్యప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో తన 31వ ఏట అకాల మరణం చెందడం విషాదకరం..
ప్రస్తుత కాలానికి వస్తే, మహారాష్ట్రలో ఎందరో తెలుగు రచయితలు, కవులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్నారు. మన వారసత్వ మూలాలు బండారు అచ్చమాంబతో మొదలయ్యాయని మరిచిపోకూడదు..! అచ్చమాంబ మహారాష్ట్ర తెలుగు రచయితలకు నిత్యస్మరణీయురాలు..
– సంగెవేని రవీంద్ర
– 9987145310

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *